మోస్ట్ ప్రొమెసింగ్ అవార్డును అందుకున్న మంత్రి కేటీఆర్
మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ తెలంగాణ
న్యూఢిల్లీ,ఆగస్టు 30(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రానికి మరోసారి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. రెండున్నరేళ్లలోనే ఉత్తమ పాలనతో అనేక అవార్డులు, ప్రశంసలు పొందుతున్నది. దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో పెట్టుబడులకు అనువైన రాష్ట్రంగా తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. దీంతో, సీఎన్‌బీసీ-టీవీ 18 ఇచ్చే ఇండియా బిజినెస్ లీడర్ అవార్డ్స్ లో మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును తెలంగాణ సొంతం చేసుకుంది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ చేతుల విూదుగా మంత్రి కేటీఆర్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు మంత్రి కేటీఆర్ ను అభినందించారు.కొత్త రాష్ట్రం తెలంగాణ రెండేళ్లలోనే అద్భుతాలు సృష్టించిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తున్నదని చెప్పారు. దేశంలోనే ఉత్తమ పాలసీలను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు మంత్రి కేటీఆర్. ఈ అవార్డును తెలంగాణ ప్రజలకు, ప్రభుత్వానికి అంకితం ఇస్తున్నట్టు ప్రకటించారు.రాష్ట్రానికి సీఎన్ బీసీ మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించటం ప్రభుత్వ మెరుగైన పనితీరుకు నిదర్శనం. దేశంలో ఎన్నో అభివృద్ధి చెందిన రాష్ట్రాలు పోటీపడ్డప్పటికీ.. తెలంగాణనే అవార్డు వరించింది. ప్రభుత్వ సుపరిపాలన, పారదర్శకత, సీఎం కేసీఆర్ విజన్ కు ఈ అవార్డు అద్దం పడుతోంది.