యాచారం లో ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకం (పిఎంఈజిపి) అవగాహన సదస్సు
రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జులై15(జనంసాక్షి):-యాచారం మండల పరిషత్ కార్యాలయంలో నిరుద్యోగ యువతీ యువకులకు జిల్లా పరిశ్రమల కేంద్రం రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకం (పిఎంఈజిపి) అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో ఎంపీపీ కొప్పు సుకన్య భాష ,జెడ్పిటిసి చిన్నోళ్ల జంగమ్మ యాదయ్య, జిఎం రాజేశ్వర్ రెడ్డి, ప్రకాష్ ఏడి, శివకృష్ణ ఐపీఓ, శ్రీకాంత్ రెడ్డి ఐపీఓ, ఎంపిడిఓ విజయలక్ష్మి ఇతరులు పాల్గొన్నారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగుల ఉపాధి కల్పనకు భారత ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నదని దేశంలోని వివిధ వర్గాల ప్రజల ఆశలు ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకొని, భారత ప్రభుత్వం ప్రధానమంత్రి ఉపాధి కల్పనా పథకము (పిఎంఇజిపి)ను ప్రవేశపెట్టినదన్నారు. 18 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు స్వయం సహాయక బృందాలు ఉత్పత్తి సహకార సంఘాలు మరియు ట్రస్టులు, కుటుంబంలో ఒక వ్యక్తి మాత్రమే పిఎమ్ఈజీపి ఆర్థిక సాయం పొందేందుకు అర్హులని పేర్కొన్నారు. తయారీ రంగంలో రూపాయల 10 లక్షలు సేవల రంగంలో రూపాయల 5 లక్షలకు పైబడిన ప్రాజెక్టులకు అభ్యర్థులు కనీసం 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు దరఖాస్తులు ఆన్లైన్ లో మాత్రమే పొందుపరచాలని భౌతిక దరఖాస్తులు స్వీకరించబడవన్నారు. ఈ అవకాశాన్ని యువతీయువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపిఓ ఉమారాణి,సుపరిడెంట్ శైలజ, ఏపీఎం సతీష్, సర్పంచులు, ఎంపిటిసిలు ఇతర అధికారులు పాల్గొన్నారు.