యువ ఐఏఎస్‌ హత్యపై వెల్లువెత్తుతున్న నిరసన

2A

 

2B

బెంగళూరు,మార్చి17(జనంసాక్షి):

కర్ణాటక కోలార్‌ జిల్లాలో ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపిన ఐఏఎస్‌ అధికారి డీకే రవిది అనుమానాస్సద మృతి కాదని, అది ముమ్మాటికి హత్యేనంటూ నిరనలు వెల్లువెత్తుతున్నాయి. బెంగళూరు నగరంలోని తావరెకెరెలో రవి తన నివాసంలో ఉరివేసుకుని ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. రవి ప్రస్తుతం వాణిజ్య పన్నుల విభాగంలో అదనపు కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. కొన్ని నెలల క్రితం కొంతమంది బడావ్యాపారులకు పన్నుల విషయంలో నోటీసులు జారీచేశాడు. ఈ విషయంలో ఏమైనా విబేధాలు వచ్చి వారి ప్రమాదం పొంచి ఉందని ఆత్మహత్యకు పాల్పడ్డాడా అని అనుమానిస్తున్నారు.లేక ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కర్ణాటక కేడర్‌ 2009 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన రవి.. కోలార్‌ డిప్యూటీ కమిషనర్‌ గా పనిచేసిన సమయంలో ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకొని ప్రజల మన్నలు పొందారు. గత అక్టోబర్‌ లోనే వాణిజ్య పన్నుల శాఖలో డిప్యూటీ కమిషనర్‌ గా బాధ్యతలు స్వీకరించారు. అటు ఇసుక మాఫియా ముఠా రవిని హత్యచేసి ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఐఏఎస్‌ రవి(35) ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటలకు తన ఆఫీసు నుండి అధికారిక నివాస భవనం చేరుకున్న రవి ఫ్యానుకు ఉరి వేసుకొని కనిపించారు. ప్రస్థుతానికి దీన్ని ఆత్మహత్య గానే పరిగణిస్తున్నామని పోలీసు కవిూషనర్‌ ఎమ్‌ఎన్‌ రెడ్డి పేర్కొన్నారు. సంపన్న వర్గాలు, పారిశ్రామిక వేత్తల నుంచి పన్నులను నిక్కచ్చిగా వసూలు చేసి నిజాయితీ గల అధికారిగా పేరు తెచ్చుకున్నారు. రవి ఫోన్‌ కాల్స్‌, నివాసంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. దీనిపై త్వరలోనే వివరాలు వస్తాయని అన్నారు.