యూపీ సీఎం అభ్యర్థి రాహులా? ప్రియాంకా?
– కాంగ్రెస్ మల్లగుల్లాలు
న్యూఢిల్లీ,మే1(జనంసాక్షి): వచ్చే సంవత్సరం జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున సీఎం అభ్యర్ధి విషయంలో కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతుంది. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలలో ఎవరినీ సీఎం అభ్యర్ధిగా ప్రతిపాదించాలనే విషయంలో తర్జన భర్జనలు పడుతోంది.యూపీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు జాతీయ స్థాయి ఎన్నికల మాదిరిగా ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడాలని ఏఐసిసి సంకల్పించింది. జూన్ మొదటి వారంలో ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్‌లోనూ అలాగే ఏఐసీసీలోనూ భారీ మార్పులు తప్పవంటున్నారు. అగ్రవర్ణాలు, మైనార్టీలను కలుపుకుంటూ యూపీ ఎన్నికల బరిలో దిగాలని కాంగ్రెస్ యోచిస్తోంది. సమాజ్‌వాదీతో కానీ, బిఎస్పీతో కానీ పొత్తు కుదుర్చుకోబోరని కూడా సమాచారం. మరోవైపు రాహుల్ గాంధీ యూపీ సిఎం అభ్యర్ధి అయితే 2019 లోక్‌సభ ఎన్నికలకు ప్రధానమంత్రి అభ్యర్ధి ఎవరనేది సస్పెన్స్‌గా మారింది. ప్రియాంకను బరిలోకి దించే అవకాశముందని కూడా సమాచారం. లేకపోతే బిజెపియేతర పక్షాలైన ప్రాంతీయ పార్టీలు, వామపక్షాలతో కలిసి బీహార్ సిఎం నితీశ్ కుమార్‌ను ప్రధాని అభ్యర్ధిగా ఎంచుకుని కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో పోరాడవచ్చని తెలుస్తోంది. రానున్న కొద్ది రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.