రాజకీయ కురువృద్ధుడు వాజ్‌పేయికి అత్యున్నత పురస్కారం
ప్రోటోకాల్ పక్కనపెట్టి ఇంటికెళ్లిన రాష్ట్రపతి
వాజ్‌పేయికి భారతరత్న అందజేసిన ప్రణభ్
న్యూఢిల్లీ,మార్చి27(జనంసాక్షి): మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయికి భారత ప్రభుత్వ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేసింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్వయంగా వాజ్ పేయి నివాసానికి వెళ్లి పురస్కారాన్ని అందజేశారు. 91 సంవత్సరాల వాజ్ పేయి మంచానికే పరిమితం కావడంతో ఆయన ఇంటివద్దనే భారతరత్న పురస్కారాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి హవిూద్ అన్సారీ, ప్రధాని నరేంద్రమోడీ, మాజీ ప్రధాని మన్మోహన్, పలువురు కేంద్ర మంత్రులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. భారతరత్న నేపథ్యంలో కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడుతూ వాజ్‌పేయి ప్రపంచానికి మార్గదర్శకుడని అన్నారు. వాజ్‌పేయీ భారతరత్న అందుకోవడం గర్వంగా ఉందన్నారు. కేవలం దేశ నాయకుడిగానే గాక, తన దార్శనికతతో ప్రపంచ దేశాల్లోనూ చెరగని ముద్ర వేసుకున్నారని పేర్కొన్నారు. వాజపేయి మానవోత్తముల్లో ఉత్తముడని అన్నారు. ఆయన కేవలం భారతదేశానికే కాక అంతర్జాతీయ రాజనీతికోవిదుడని పేర్కొన్నారు. వాజపేయికి భారతరత్న అవార్డు దక్కినందుకు దేశం మొత్తం ఆనందించాలని చెప్పారు. ఆయన మూర్తిమత్వం, వాక్పటిమ నైపుణ్యంతో నిండినవని, ఎదుటివాళ్లను కట్టిపడేసేంత శక్తిగలవని కొనియాడారు. రాష్ట్రపతి సైతం తన ప్రొటోకాల్‌ను పక్కకు పెట్టి క్రిష్ణ విూనన్ మార్గ్‌లోని వాజపేయి నివాసానికి వచ్చి భారతరత్న అవార్డును అందజేయటం గర్వకారణమని తెలిపారు. కాగా భారతరత్న అవార్డు అందుకుంటున్న మాజీ ప్రధాని వాజపేయికి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనకు ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని, ఆయన నిజమైన రాజకీయ కోవిదుడని, ఈ అవార్డుకు తగినవారని చెప్పారు. గొప్ప రాజనీతివేత్త అయిన వాజ్‌పేయీకి భారతరత్న రావడం సంతోషంగా ఉందని ట్విట్టర్లో పేర్కొన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా కూడా తన హృదయపూర్వకంగా వాజపేయికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు.