రాజీనామాలు అక్కర్లేదు కేంద్రంపై విశ్వాసముంది
టీ మంత్రుల సమావేశం అనంతరం జానారెడ్డి వెల్లడి
హైదరాబాద్, జనవరి 28 (జనంసాక్షి):
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆధ్వర్యంలో తెలంగాణ ఏర్పడుతుందనే ధీమా తమకు ఉందని సినీయర్‌మంత్రి పంచాయతీ రాజ్‌శాఖమంత్రి కె.జానారెడ్డి అన్నారు. సోమవారం నాడు ఆయన నివాసంలో తెలంగాణ ప్రాంత మంత్రులు భేటీ అయ్యారు. అనంతరం మంత్రులతో కలిసి జానారెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ విషయంలో జరుగుతున్న పరిణామాలలో కొంత ఆలస్యం జరిగితే తెలంగాణ వాదులు తమను లక్ష్యంగా చేసుకున్నారని ఆయన అన్నారు. అయినప్పటికీ తెలంగాణ సాధన కోసం కొంతమంది వాడుతున్న భాషను భరిస్తున్నామన్నారు. తెలంగాణకోసం కోసం అన్ని స్థాయిల్లో ప్రజా ప్రతినిధులు కృషి చేస్తున్నారన్నారు. తెలంగాణ విషయంలో తాను మాట తప్పే పరిస్థితి, మడమ తిప్పే పరిస్థితి లేదన్నారు. తెలంగాణ కోసం రాజీనామాలకు సైతం తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఎలాంటి త్యాగాలకు వెనుకకు పోయేది లేదన్నారు. కొందరు నేతలు తమపై ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని అది సరికాదని కోమటిరెడ్డి సోదరులను ఉద్దేశించి అన్నారు. తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీవ్రంగా ఆలోచిస్తోందన్నారు. త్వరలో సమస్యకు పరిష్కారం చూపిస్తుందన్నారు. ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాన రాష్ట్రాన్ని తాము ఎట్టిపరిస్థితుల్లోనూ సాధిస్తామని అన్నారు. అవసరమైన సమయంలో పదువులను తృణపాయంగా వదులుతామన్నారు.
టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ నెలలో తెలంగాణ వస్తుందటే తప్పులేదు. కానీ తాము చెబితే తప్పా అన్ని ప్రశ్నించారు. తెలంగాణ కోసం ఆలోచిస్తున్నామని తమపార్టీ చెప్పడంలో తప్పేముందన్నారు. కెసిఆర్ మాటలు పనికిమాలినవి అన్నారు. నా జీవితంలో నేనెప్పుడూ మాట తప్పలేదన్నారు. తెలంగాణ తుదిదశకు వచ్చిందనే సంయమనం పాటిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణపై అనుకూల ప్రకటన రాకుంటే అందరం కలిసి కార్యాచరణ ఏర్పాటు చేసుకుంటామన్నారు. త్యాగం అంటే తెలంగాణ ప్రజలు కోరుతున్నట్లుగా కేవలం పదువులకే కాదని అన్ని రకాలుగా త్యాగాలు చేసి ప్రజల ముందు నిలబడతామన్నారు. తమ పార్టీ నాయకత్వంపై తమకు పూర్తి నమ్మకం ఉందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై నెల రోజులు గడువు కోరి మళ్ళీ వెనక్కి పోవడం అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసిందని జానారెడ్డి అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తాము తమ పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తీసుకువచ్చి తెలంగాణ సాధిస్తామని చెప్పారు. ఒకటి, రెండు రోజులు ఆలస్యమైనా తెలంగాణ తప్పక సాధిస్తామని ఆయన తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చారు.