రాజ్యసభలో కొనసాగుతున్న అగస్టా ఆందోళన

5

న్యూఢిల్లీ,మే2(జనంసాక్షి): రాజ్యసభలో అగస్టా చాపర్‌ రగడ కొనసాగుతోంది. సోమవారం కూడా సభ ప్రారంభమైన తర్వాత ప్రతిపక్షాలు ఆ అంశంపై గందరగోళం సృష్టించాయి. అగస్టా అంశాన్ని చర్చించాలని తృణమూల్‌ కాంగ్రెస్‌  రాజ్యసభలో వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. అగస్టా వ్యవహారంపై రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ ప్రకటన చేయాలని కాంగ్రెస్‌, తృణమూల్‌ పార్టీలు డిమాండ్‌ చేశాయి. రాజ్యసభలో ఆ రెండు పార్టీల సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లారు. దీంతో సభను మధ్యాహ్నం 12.30 నిమిషాల వరకు వాయిదా వేశారు.  సభ ప్రారంభమైన దగ్గర్నుంచీ ఎంపీల ఆందోళనతో సభసజావుగా సాగలేదు. ఒకసారి సభ వాయిదా పడి తిరిగి ప్రారంభమైనా ఎంపీల ఆందోళన ఆగకపోవడంతో మరోసారి వాయిదా పడింది. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి స్లోగన్స్‌ ఇచ్చారు. అన్ని అంశాలను పక్కనబెట్టి ముందుగా అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ కుంభకోణంపై చర్చ జరపాలంటూ టిఎంసీ ఎంపీలు నోటీసు ఇచ్చారు. మే నాలుగున ఈ స్కాంకు సంబంధించిన అన్ని వివరాలను పార్లమెంట్‌ ముందు ఉంచుతామని రక్షణ శాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌  ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముడుపులు ఎవరు తీసుకున్నారన్న విషయాన్ని మేం బహిర్గతం చేస్తామని ఆయన తెలిపారు. ఆగస్టా హెలికాప్టర్లను తయారు చేసే కంపెనీని కాంగ్రెస్‌ పార్టీ బ్లాక్‌లిస్టులో పెట్టలేదని పారికర్‌ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముందుగా ఆ స్కాంపై చర్చ జరపాలంటూ టిఎంసీ ఎంపీలు ఆందోళనకు తెరలేపారు. మరో వైపు అగస్టా వ్యవహారాన్ని విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.ఈనెల ఆరవ తేదీని ఆ కేసుపై దాఖలైన పిటిషిన్‌ను సుప్రీం స్వీకరించనుంది. మరోవైపు అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ ముడుపుల వ్యవహారంలో సీబీఐ పాత్ర జోరందుకుంది. ఆ కేసులో మాజీ ఎయిర్‌ ఫోర్స్‌ చీఫ్‌ మార్షల్‌ ఎస్‌పీ త్యాగీని ఇవాళ సీబీఐ విచారిస్తోంది. వీవీఐపీ హెలికాప్టర్‌ కొనుగోలు

వ్యవహారంలో ఆయన్ను సీబీఐ విచారిస్తోంది. మనీల్యాండింగ్‌ చట్టం ప్రకారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ మాజీ వైమానికాధిపతికి సమన్లు జారీ చేసింది. ఆగస్టా హెలికాప్టర్ల కొనుగోలు వ్యవహారంలో మాజీ ఎయిర్‌చీఫ్‌ త్యాగీ సోదరులకు ముడుపుల సొమ్ము ముట్టినట్లు ఈడీ ప్రాథమిక విచారణలో బయటపడింది. దాంతో ఆయన్ను విచారిస్తున్నారు. ఇటలీ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న నమయంలో త్యాగీనే భారత వైమానిక దళ చీఫ్‌గా ఉన్నారు. కంపెనీతో ఒప్పందం కుదుర్చుకునేందుకు త్యాగీ కీలక పాత్ర పోషించినట్లు ఆయనపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అగస్టా వ్యవహారంలో ఇప్పటికే మాజీ డిప్యూటీ ఎయిర్‌చీఫ్‌ జేఎస్‌ గుజ్రాల్‌ను కూడా సీబీఐ విచారిస్తోంది. మునుముందు కూడా ఆ విచారణ కొనసాగనున్నట్లు తెలుస్తోంది.