రాజ్యసభలో మోడీ వ్యంగ్యాస్త్రాలు
న్యూఢిల్లీ,మార్చి9(జనంసాక్షి):ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాజ్యసభలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.ఆ పార్టీకి చెడ్డపేరు ఎప్పుడూ రాదని, కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే.. అది ప్రతిపక్షాలన్నింటినీ విమర్శించినట్టు ఆపాదిస్తుందని, అంతేకానీ తమను విమర్శిస్తున్నట్టు ఎన్నడూ భావించదని ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. కొందరు పనిచేస్తే.. మరికొందరు ఆ క్రెడిట్ తీసుకోవడానికి ఉత్సాహపడుతుంటారని పరోక్షంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలివి.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తరహాలో తాను ఆర్థికవేత్తను కాను. నాకు అంత జ్ఞానమూ లేదు. అయినా నాకు కొన్ని విషయాలు తెలుస్తాయి. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది.
ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉంటారు. మొదటి రకం వారు పనిచేస్తే.. రెండో రకం వారు ఆ పని క్రెడిట్ తమదేనని చెప్పుకొంటూ ఉంటారు. సహజంగానే మొదటి కేటగిరీలో పెద్ద పోటీ ఉండదు’ అని ఇందిరాగాంధీ ఓ సందర్భంలో ఈ మాట చెప్పారు. కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్‌కు నేను కృతజ్ఞుడినై ఉంటాను. జన్‌ధన్ యోజన పథకం కింద బ్యాంకు ఖాతాలు లేని వ్యక్తుల జాబితాను ఆయన సభ ముందు ఉంచారు. బహుశా ఆయన మైక్రోస్కోప్‌తో ఈ పని చేసి ఉంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్లు కనీసం బైనాక్యూలర్‌తో పనిచేసినా బాగుండేదన్నారు. స్వచ్ఛత కార్యక్రమం ప్రజా ఉద్యమంగా మారుతోంది. తొలిసారి పార్లమెంటు ఈ అంశంపై చర్చించింది. ఈ చర్చల్లో ప్రభుత్వంపై విమర్శలు రావొచ్చు.. అయినా దీనిపై చర్చ జరుగడం మాత్రం మంచి విషయం అన్నారు. అర్హులకు మాత్రమే ప్రభుత్వ సబ్సీడీలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. అంతేకానీ డబ్బు పొదుపు చేయడానికి కాదన్నారు. మేం జవాబుదారీతనానికి పెద్దపీట వేస్తున్నాం. మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులను నేను సవిూక్షిస్తున్నాను. ఇందులో కొన్ని ప్రాజెక్టులకు దశాబ్దాలుగా వాయిదా పడుతూ వస్తున్నాయి. ఇది పెద్దల సభ. ఇందులో గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు. ఇక్కడ జరిగిదే ఇతర అసెంబ్లీలపైనా ప్రభావం చూపుతుందన్నారు. పార్లమెంటులో ఎన్నో బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని ఆమోదించి దేశ ప్రగతికి ఊతమివ్వండని పిలుపునిచ్చారు.