రాజ్యహింసలో అందరూ అందరే

ప్రజలను కంటికి రెప్పలా కాపాడాల్సిన రాజ్యం వివిధ కారణాలను చూపి, ఏవో సాకులు చెప్పిన తన బిడ్డలను తానే పొట్టనబెట్టుకుంటుంది. ఎన్‌కౌంటర్ల పేరుతో అన్యాయంగా హత్య చేస్తోంది. ఇది సగటు భారతీయుడి ఆవేదన మాత్రమే కాదు సాక్షాత్తు దేశ అత్యున్నత న్యాయస్థానమే ఈమేరకు ఆందోళన వ్యక్తం చేసింది. రాజ్య హింసాకాండ సాగించడం, ఎన్‌కౌంటర్ల పేరుతో పొట్టనబెట్టుకోవడం అన్యాయమని వ్యాఖ్యానించింది. ప్రజల్లో పరివర్తన తీసుకురవాల్సింది పోయి హత్యాకాండతో ప్రశ్నించే గొంతుకలను అంతమొందించడం సరికాదని పేర్కొంది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఇంత ఆవేదనతో వ్యాఖ్యలు చేసే పరిస్థితులను రాజ్యం కల్పించింది. ఏవో సాకులు చెప్పి ఎందరో భారత పౌరులను హతమార్చింది. ఈ విషయంలో రాజ్యాధికారంలో ఎవరున్నా విధానాలు మాత్రమే ఒక్కటే. ఈ విషయం ఇష్రత్‌ జహాన్‌ ఎన్‌కౌంటర్‌పై సీబీఐ విచారణ ద్వారా మరోమారు వెలుగులోకి వచ్చింది. ముంబయిలోని గురునానక్‌ ఖల్సా కాలేజీలో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని ఇష్రత్‌ జహాన్‌ శమిమ్‌ రజా 2004 జూన్‌ 15 గుజరాత్‌లోని అహ్మదాబాద్‌-గాంధీనగర్‌ రోడ్డుపై జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందింది. ఆమెతో పాటు మరో ముగ్గురు యువకులు ఈ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు. బీఎస్సీ విద్యార్థిని ఇష్రత్‌ను ఎందుకు ఎన్‌కౌంటర్‌ చేయాల్సి వచ్చిందని అప్పటి పోలీసులను ప్రశ్నిస్తే ఆమె లష్కర్‌-ఏ-తోయిబా మిలిటెంట్‌ అని పేర్కొన్నారు. కానీ ఆమెది బూటకపు ఎన్‌కౌంటర్‌ అని ఆ రోజే మానవ హక్కులు గళమెత్తాయి. ముంబాయి నుంచి విద్యార్థిని ఎత్తుకొచ్చి కాల్చి చంపాయని ఆందోళనలు చేపట్టాయి. గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ సాగిస్తున్న నరమేధంలో ఈ ఘటన కూడా భాగమని భగ్గుమన్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇష్రత్‌తో పాటు ప్రణేశ్‌ పిల్లై అలియాస్‌ జావేద్‌ గులాం షేక్‌, అమ్జద్‌ అలీ రాణా, జీషాన్‌ జోహార్‌ మృతిచెందారు. వీరిలో అమ్జద్‌ అలీ రాణా ఒక్కడే పాకిస్తాన్‌కు చెందిన వాడు. మిగతా ముగ్గురు భారతీయులే. వీరంతా లష్కర్‌-ఏ-తోయిబా మిలిటెంట్లని, భారత్‌లో దొంగ నోట్ల చెలామణీతో పాటు అనేక విధ్వంసాలకు వ్యూహం పన్నారని అహ్మదాబాద్‌ పోలీసులు ఆరోపించారు. గుజరాత్‌ పోలీసులు, సబ్సిడరీ ఇంటెలిజెన్స్‌ బ్యూరో సంయుక్తంగా నడిరోడ్డుపై ఈ ఎన్‌కౌంటర్‌ చేశాయి. అడిషనల్‌ డీజీ పీపీ పాండే, డీజీ వంజెర, సీఎల్‌ సింఘాల్‌, తరుణ్‌ బారోట్‌, ఎస్‌కే అమీన్‌, అంజూ చౌదరి ఆధ్వర్యంలో ఈ ఎన్‌కౌంటర్‌ చేశారు. ఇష్రత్‌ జహాన్‌ అమాయకురాలని, ఆమె ఎన్‌కౌంటర్‌ విచారణ జరపాలని కోరుతూ హక్కుల సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగడం అహ్మదాబాద్‌ హైకోర్టు దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించింది. ఎన్‌కౌంటర్‌పై విచారణ జరిపిన సీబీఐ ఈనెల 3న అహ్మదాబాద్‌ హైకోర్టుకు నివేదిక అందజేసింది. ఇష్రత్‌ను బూటకపు ఎన్‌కౌంటర్‌లో హత్య చేశారని సీబీఐ తన విచారణలో తేల్చింది. ఈ బూటకపు ఎన్‌కౌంటర్‌కు అడిషనల్‌ డీజీ పీపీ పాండే, ఇప్పటికే సస్పెన్షన్‌కు గురైన డీజీ వంజెర, సీఎల్‌ సింఘాల్‌, తరుణ్‌ బారోట్‌, ఎస్‌కే అమీన్‌, అంజూ చౌదరి బాధ్యులని తేల్చి వారిపై చార్జిషీట్‌ దాఖలు చేసింది. సీబీఐ చార్జిషీట్‌ దాఖలు చేసిన తర్వాత బీజేపీ సీనియర్‌ నాయకుడు వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ ఇష్రత్‌ జహాన్‌ లష్కర్‌-ఏ-తోయిబా సభ్యురాలని తెలిపాడు. ఈ విషయాన్ని లష్కర్‌-ఏ-తోయిబా తన వెబ్‌సైట్లో కూడా ఉంచిందని వాదించాడు. కానీ బూటకపు ఎన్‌కౌంటర్‌ కాదని మాత్రం చెప్పలేదు. గుజారాత్‌లో సోహ్రాబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ తర్వాత ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ఆదేశాల మేరకే ఇష్రత్‌ జహాన్‌ సహా నలుగురిని పోలీసులు కాల్చి చంపారనే ఆరోపణలున్నాయి. గుజరాత్‌లో రాజ్యాధికారాన్ని వెలగబెడుతున్న నరేంద్రమోడీకి ముస్లిం వ్యతిరేకి. గోద్రా తదనంతర ఘటనల ద్వారా ఈ విషయాన్ని ఆయనే చాటుకున్నాడు. గోద్రాలో చెలరేగిన అల్లర్లలో మూడు వేల మంది వరకూ ముస్లింలు గల్లంతయ్యారు. వారిలో వేయి మందికి పైగా హత్యకు గురైనట్లు ఆధారాలున్నాయి. మిగతా వారు ఏమయ్యారో ఇప్పటికీ జాడలేదు. ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ఆధ్వర్యంలోనే ఈ దారుణ మారణకాండ సాగిందనేది అందరి నమ్మకం. ఈ విషయంలో కోర్టులు మోడీని నిర్దోషిగా పేర్కొన్నా పౌర సమాజం ఆయన్ను నిర్దోషిగా పరిగణించడం లేదు. గుజరాత్‌లో మోడీది సూపర్‌ షో అని బీజేపీ ఎంతగా బూష్టింగ్‌ ఇచ్చిన కొద్ది రోజుల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్తెసరు సీట్లతోనే అధికారాన్ని నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు అదే మోడీని బీజేపీ జాతీయ ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమించుకుంది. సీనియర్‌ నేత ఎల్‌కే అధ్వానీ కాదన్నా వినకుండా మోడీకి ప్రమోషన్‌ ఖాయం చేసింది. ఇప్పుడు ఇష్రత్‌ జహాన్‌ ఎన్‌కౌంటర్‌ బూటకమైనదని సీబీఐ తేల్చడంతో ఆ ప్రభావం మైనార్టీల పడకుండా ఉండేందుకు బీజేపీ మార్గాలు వెదుక్కుంటోంది. అందులో భాగంగానే వెంకయ్య ఇష్రత్‌ జహాన్‌ లష్కర్‌-ఏ-తోయిబా సభ్యురాలని చెప్పే ప్రయత్నం చేశాడు. లష్కర్‌ – ఏ – తోయిబా భారత్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థే. ఇందులో ఇష్రత్‌ సభ్యురాలన్నట్లు ఆ సంస్థ వెబ్‌సైట్లో పేర్కొనడాన్ని ప్రస్తావిస్తున్నారు. రాజ్యం తప్పుచేసినప్పుడు ఇలాంటి ఆధారాలు వెదుక్కోవడం పరిపాటే. అధికారాన్ని అనుభవించే పార్టీ కాంగ్రెస్‌ అయినా, బీజేపీ అయినా మరో పార్టీ అయినా ఫలితం ఇలాగే ఉంటుంది. నిషిద్ధ సంస్థలో ఎవరైనా సభ్యులుగా ఉండొచ్చని సుప్రీం కోర్టు ఇది వరకే చెప్పింది. వారి కార్యకలాపాల్లో పాల్గొనడం మాత్రమే నేరమని సుప్రీం వివరణ ఇచ్చింది. అయితే ఇష్రత్‌ సాధారణ విద్యార్థినే అయినా లష్కర్‌-ఏ-తోయిబాలో సభ్యురాలని చెప్పి కాల్చి చంపారు. కేవలం వెబ్‌సైట్లో వివరాల ఆధారంగా రాజ్యం హత్యాకాండను బీజేపీ సమర్థించే ప్రయత్నం చేసింది. తద్వారా రాజ్యాధికారం ఎవరి చేతిలో ఉన్నా ఇదే పరిస్థితి ఉంటుందని స్పష్టం చేసింది. రాజ్యం హింసాకాండను అత్యున్నత న్యాయస్థానాలు తప్పుబట్టినా ఎంతమాత్రం బెదరకుండా బుకాయింపు రాజకీయాలు సాగిస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమైనా రాజ్యం విధానమే అది అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. తద్వారా రాజ్య హింసలో ఏమాత్రం తీసిపోమని చాటి చెప్తున్నాయి.