రాజ్యాంగబద్దంగానే నిర్ణయాలు

1

రాజ్‌భవన్‌ వివరణ

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 4(జనంసాక్షి): తనపై ఒక విూడియాలో వచ్చిన వార్తకథనాలపై గవర్నర్‌ నరసింహన్‌ తరపున రాజ్‌ భవన్‌ అదికారులు వివరణ ఇచ్చారు. గవర్నర్‌ కు ఉద్దేశాలు ఆపాదిస్తూ కథనాలు రాయడం సరికాదని వ్యాఖ్యానించారు. రాజ్‌భవన్‌ రాజ్యాంగబద్ధమైన అత్యున్నత కార్యాలయమని రాజ్‌భవన్‌ కార్యాలయం ప్రకటించింది.తెలుగు రాష్టాల్రను సమదృష్టితో చూస్తున్నామని రాజ్‌భవన్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మేరకు ఓ ప్రతికా ప్రకటనను రాజ్‌భవన్‌ విడుదల చేసింది. విధుల నిర్వహణలో రాష్టాల్ర మధ్య వివక్ష చూపటం లేదని, రాజ్యాంగ బద్ధంగానే పనిచేస్తున్నట్లు రాజ్‌భవన్‌ వర్గాలు ప్రకటించాయి. సీఎస్‌లు, సలహాదారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నామని, ఎలాంటి పక్షపాతం లేకుండా వివాదాలకు దూరంగా పనిచేస్తామని ప్రకటనలో పేర్కొన్నాయి. రాజ్‌భవన్‌ నిర్ణయాలు చట్టానికి లోబడే ఉంటాయని పేర్కొంది. రాజ్‌భవన్‌ నిష్పక్షపాతంగా రాజ్యాంగానికి లోబడే పని చేస్తుందని వెల్లడించింది. అనవసర వివాదాల్లోకి రాజ్‌భవన్‌ను లాగడం సమంజసం కాదు. ఏ నిర్ణయమైనా చట్టానికి లోబడే తీసుకుంటుంది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఉన్నప్పుడు కూడా సంబంధిత శాఖల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిష్కరించేందుకు కృషి చేసింది. రాష్ట్రపతి పాలనలో తీసుకున్న నిర్ణయాలన్నీ సాధారణ పరిపాలన, న్యాయ, ఆర్థిక అంశాలన్నీ కూడా సమగ్రంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయాలు తీసుకున్నామని తెలిపింది. రాష్ట్రపతి పాలన సమయంలో అప్పటి చీఫ్‌ సెక్రటరీ, సలహాదారుల సూచనల, సలహాల మేరకే గవర్నర్‌ నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రపతి పాలనలో తీసుకున్న సమష్టి నిర్ణయాలను ఒక్క గవర్నర్‌కే ఆపాదించడం సబబు కాదని రాజ్‌భవన్‌ కార్యాలయం పేర్కొంది.