రాజ్యాంగ నిర్మాతకు దేశవ్యాప్తంగా ఘననివాళి

C

న్యూఢిల్లీ/హైదరాబాద్‌,ఏప్రిల్‌14(జనంసాక్షి): దేశవ్యాప్తంగా రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ జయంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. రాజ్యాంగ నిర్మాతకు ఘనంగా నివాళులు అర్పించారు.  దిల్లీలోని పార్లమెంట్‌ ఆవరణలో  రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హవిూద్‌ అన్సారీ, కేంద్ర ¬ం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు పాల్గొని అంబేడ్కర్‌ చిత్ర పటం వద్ద నివాళులర్పించారు. ఇదిలావుంటే భారత రాజ్యాంగ నిర్మాత, పీడిత వర్గాల కోసం అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమించిన బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ యుగపురుషణడని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. డా.బీఆర్‌ అంబేడ్కర్‌ 125వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మోదీ పూలమాల వేసి అంజలి ఘటించారు. అంబేడ్కర్‌ కలలకన్న భారతావనిని తాను సాకారం చేస్తానని ఆయన ఓ ప్రకటన ద్వారా తెలిపారు. అలాగే ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా పలు రాషాల్లో జరుపుకుంటున్న విభిన్న పండగలకు ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్లో ట్వీట్లు చేశారు.

అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్‌ అలీ, మంత్రులు ఈటల రాజేందర్‌, నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, తదితరులు పాల్గొని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నివాళులర్పించారు. అసెంబ్లీ ఆవరణలోని ఆయన విగ్రహానికి తెలంగాణ శాసనసభ సభాపతి మధుసూదనాచారి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్‌ సేవలను కొనియాడారు. ఇఖ అంబేద్కర్‌ స్ఫూర్తితోనే తెలంగాణ రాష్టాన్న్రి సాధించామని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. అదేస్ఫూర్తితో ఇప్పుడు అభివృద్దికి సిఎం కెసిఆర్‌ శ్రీకారం చుట్టారన్నారు. గత ప్రభుత్వాలు దళితులకు భూ పంపిణీ కాగితాలపైనే చేశాయన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాత్రం దళితులకు సాగుకు యోగ్యమైన భూములే ఇస్తుందని చెప్పారు.  వెయ్యి కోట్లతో దళితులకు భూమి కొనుగోలు చేస్తున్నామని ప్రకటించారు. మూడెకరాల సాగుభూమి ఇవ్వడమే గాకుండా వారికి వ్యవసాయం చేసుకునేలా ఆర్థిక సాయం కూడా చేస్తున్నట్లు ప్రకటించారు. పథకాలను ప్రకటించి వదిలి వేయడం కాకుండా వాటిని ముందుకు తీసుకుని వెళ్లే లక్ష్యంతో పక్కాగా ముందుకు పోతున్నామని అన్నారు. 50 యూనిట్ల వరకు కరెంట్‌ వాడే దళిత కుటుంబాలకు బిల్లు బకాయిలు ఎత్తివేశామని తెలిపారు. కళ్యాణలక్ష్మీ పథకం ద్వారా దళిత కుటుంబాలను ఆదుకుంటున్నామని పేర్కొన్నారు. దళిత సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. నేడు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా గజ్వేల్‌ మండలం ముట్రాజుపల్లిలో విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. దళితల అభ్యున్నతికి సీఎం కేసీఆర్‌ పాటుపడుతున్నారని చెప్పారు. అలాగే ప్రభుత్వం ఇటీవల చేపట్టిన మిషన్‌ కాకతీయ, వాటర్‌ గ్రిడ్‌ పథకాలు ప్రజల మేలుకోరి చేపట్టినవేనన్నారు. కార్యక్రమంలో ఉన్నతాధికారులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సామాజిక న్యాయ పోరాట యోధుడు డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ అని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాష్‌ కారాట్‌ అభివర్ణించారు. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా విశాఖలోని ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కారత్‌ మాట్లాడుతూ.. నిమ్న జాతుల విముక్తి కోసం అంబేడ్కర్‌ అహరహం కృషి చేశారని తెలిపారు. భారత రాజ్యాంగ రచనా ప్రదాతగా దేశానికి ఎనలేని సేవ చేశారన్నారు. అంబేడ్కర్‌ స్ఫూర్తితో మనం తిరిగి సామాజిక న్యాయ సాధన కోసం జరిగే పోరాటాల్లో పునరంకితం కావాలని కోరారు. కార్యక్రమంలో జాతీయ వ్యవసాయ కార్మికుల సమాఖ్య ప్రతినిధి వరదరాజన్‌, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సిహెచ్‌ నరసింగరావు తదితరులు పాల్గొన్నారు.