రాయ్‌బరేలి వద్ద ఘోర రైలు ప్రమాదం

2

38 మంది మృతి, వందకుపైగా క్షతగాత్రులు

రాయబరేలీ,మార్చి20(జనంసాక్షి): డెహ్రాడూన్‌-వారణాసి మధ్య నడిచే జనతా ఎక్స్‌ప్రెస్‌ శుక్రవారం ఉత్తరప్రదేశ్‌ రాయబరేలీ జిల్లాలోని బచ్రావాన వద్ద పట్టాలు తప్పి ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 38 మంది మృతి చెందారు. దాదాపు 150 మంది గాయపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని… క్షతగాత్రులను వైద్య చికిత్స నిమిత్తం లక్నోలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. జనతా రైలు డెహ్రాడూన్‌ నుంచి వారణాసి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇంజన్‌తో పాటు రెండు బోగీలు పట్టాలు తప్పటంతో అందులోని ప్రయాణికులు గాయపడ్డారు. మరోవైపు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ప్రమాద ఘటనపై రైల్వే మంత్రిత్వశాఖ విచారణకు ఆదేశించింది. వారణాసి – డెహ్రాడూన్‌ రైలు మార్గంలోని రైళ్లను మరో మార్గం ద్వారా గమ్యానికి చేర్చారు. రైలు ప్రమాదంపై ఉత్తరప్రదేశ్‌ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతులకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేలు ఎక్స్‌ గ్రేషియా ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రత్యేక బృందాలు ప్రమాదస్థలికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను సవిూపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బ్రేక్‌ ఫెయిల్‌ అవడంతో ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.