రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు
హార్టీకల్చర్ యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు
అసెంబ్లీ సమావేశాలకు వివరాలతో సిద్ధం కండి
మంత్రులకు సీఎం కేసీఆర్ ఆదేశం
హైదరాబాద్,మార్చి5(జనంసాక్షి): సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశం రాష్ట్ర వార్షికబడ్జెట్‌పై చర్చించింది. ఈ సమావేశంలో గవర్నర్ ప్రసంగానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రివర్గం చర్చించింది. 6 ఆర్డినెన్స్‌లను బిల్లులుగా తెచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గృహనిర్మాణంపై మంత్రివర్గం చర్చించింది. కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును హార్టీకల్చర్ యూనివర్సిటీకి పెట్టాలని నిర్ణయం తీసుకుంది.
ప్రధానంగా అసెంబ్లీ సమావేశాల్లో ఈ నెల 11న బడ్జెట్ ప్రవేశపెట్టాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. విపక్షాలను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై చర్చించింది. పన్నుల వసూళ్లపై ఇతర రాష్గాల్లో అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని నిర్ణయించారు. వసూళ్ల అంశంపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుచేశారు. శాసనసభలో ఎవరి శాఖల ప్రశ్నలకు ఆ శాఖ మంత్రులే సిద్ధం కావాలని, మంత్రులందరూ సభలో సమన్వయంతో వ్యవహరించాలని సీఎం సూచించారు.