రాహుల్‌తో కన్హయ్య బృందం భేటీ

2
న్యూఢిల్లీ,మార్చి22(జనంసాక్షి):దేశద్రేహం కేసులో నిందితుడిగా ఉన్న జవహార్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థి సంఘం నాయకుడు కన్నయ్యకుమార్‌ మంగళవారం కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలిశారు. లుతిన్‌లోని రాహుల్‌ నివాసంలో మరో ఐదుగురు విద్యార్థి నేతలతో కలిసి కన్నయ్య ఆయనతో సమావేశమయ్యారు. బిజెపిపై పోరాడేందుకు కాంగ్రెస్‌ పార్టీ కన్నయ్య కుమార్‌ మద్దతు తీసుకోనుందన్న వార్తల నేపథ్యంలో వీరిద్దరి భేటీ ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే వామపక్షాలు కన్నయ్యను ప్రచార రంగంలోకి దింపుతామని వెల్లడించాయి. జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలతో కన్నయ్యకుమార్‌ను ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే కన్నయ్య బెయిల్‌పై విడుదలయ్యాడు. అయితే జేఎన్‌యూ వివాదం తొలినాళ్ల నుంచే.. కన్నయ్యకు రాహుల్‌గాంధీ మద్దతు పలికారు. కన్నయ్యను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ.. జేఎన్‌యూ క్యాంపస్‌లో ఆందోళన కూడా చేపట్టారు. ఈ దశలో కన్నయ్యకుమార్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలవడంతో రాజకీయ ఊహాగానాలకు తెరలేచింది.  కన్నయ్య, ఐదుగురు విద్యార్థి నేతలతో కలిసి లుతిన్‌లోని రాహుల్‌ నివాసంలో సమావేశమయ్యారు. బీజేపీపై పోరాటాన్ని కొనసాగించేందుకు కాంగ్రెస్‌ పార్టీ కన్నయ్యకుమార్‌ మద్దతును తీసుకోనున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరి సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.