రుణాలు చెల్లించాల్సిందే

2

– మాల్యాకు జైట్లీ హెచ్చరిక

న్యూఢిల్లీ,మార్చి28(జనంసాక్షి): విజయ్‌మాల్యా రుణ ఎగవేతపై కేంద్రం తీవ్రంగా స్పందిస్తోంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ అసోం ప్రచారంలో దీనిపై ఘాటుగా స్పందించారు. రుణాల ఎగవేత దారులను వదలబోమన్నారు. ఇవి ప్రజల సొమ్మని అన్నారు. తాజాగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ కూడా మాల్యకు హెచ్చరిక చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త విజయ్‌మాల్యా గౌరవప్రదంగా బ్యాంకులకు చెల్లించాల్సిన బకాయిల్ని చెల్లించాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ హితవు పలికారు. లేకపోతే బలవంతంగానైనా విచారణ సంస్థల నుంచి చర్యల్ని ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. ఈ విషయమై సోమవారం జైట్లీ మాట్లాడారు. వ్యక్తిగత కేసుల విషయంలో తాను ఎలాంటి వ్యాఖ్యలు చెయ్యదలుచుకోలేదని చెప్పారు. అయితే విజయ్‌మాల్యా సంస్థల్లాంటి పెద్ద సంస్థల విషయంలో మాత్రం స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుందన్నారు. విజయ్‌మాల్యా బ్యాంకులకు బకాయిలు పడ్డ మొత్తాల్ని ఆయన నిజాయతీగా కడితే బాగుంటుందన్నారు. లేకపోతే న్యాయపరంగా బ్యాంకులకు వచ్చే అధికారాల ద్వారా వారు ఏమైనా చేస్తారని వాటిని మాల్యా ఎదుర్కోవలసి ఉంటుందని చెప్పారు. మాల్యా పలు బ్యాంకులకు వేల కోట్ల రూపాయల బకాయిల్ని కట్టకుండా భారత్‌ వదిలి వెళ్లిపోయిన విషయం తెలిసిందే.బ్యాంకులకు బకాయిలు చెల్లించి గౌరవం నిలుపుకోండి.. లేదంటే చర్యలు తప్పవు’ అంటూ విజయ్‌ మాల్యాలాంటి  ఎగవేతదారులను ఉద్దేశించి ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ హెచ్చరికలు చేశారు. బకాయిలు చెల్లించకుంటే బ్యాంకులు, విచారణ సంస్థలు తీసుకొనే కఠిన చర్యలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. వ్యక్తిగత కేసుల్లో తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయనని, పెద్ద గ్రూపుల విషయం తన బాధ్యతగా భావిస్తున్నానని ఆయన తెలిపారు. తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు బ్యాంకులకు ఎగవేసిన విజయ్‌ మాల్యా విషయంలో చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన ఓ ఇంటర్వూలో స్పష్టం చేశారు.బ్యాంకులకు సెక్యూరిటీలు ఉంటాయని, ఇతర సంస్థలు కూడా చట్టపరమైన చర్యల ద్వారా ఎగవేతదారుల వద్ద నుంచి బకాయిలు వసూలు చేసే పద్ధతులు ఉన్నాయని, వీటన్నింటిని సంబంధింత ఏజెన్సీలద్వారా పరిశోధన చేస్తున్నారని జైట్లీ అన్నారు. లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యా భారతదేశం విడిచి మార్చి 2న లండన్‌ పారిపోయే ముందు… అతని గ్రూప్‌ సంస్థలనుంచి రికవరీ కోరుతూ ప్రభుత్వరంగ బ్యాంకులు సుప్రీంకోర్లును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆర్థిక మాంద్యం వల్ల అనేక కంపెనీలు నష్టాల్లో కూరుకుపోయిన నేపథ్యంలో వాటి మొండి బకాయిల సమస్యకు పరిష్కారం దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు జరుపుతోంది.

ప్రస్తుతం మొండి బకాయిల సమస్యకు పరిష్కార దిశగా చర్యలు ప్రారంభమయ్యాయని, ముందే చెప్పినట్లుగా  ఇవి రెండు రకాలుగా ఉంటాయని, ఆర్థిక వాతావరణంలో కొన్ని, పరిశ్రమల వైఫల్యంవల్ల కొన్ని ఉంటాయని, ఇప్పుడు ఇటువంటి సమస్యలు పరిష్కరించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని  జైట్తీ తెలిపారు.