రూపాయికి చికిత్స ఏది?
భారత అధికారిక మారక ద్రవ్యం రూపాయి ఇప్పుడు ఉనికిని కాపాడుకునేందుకు నానా పాట్లు పడుతుంది. పాలకుల నిర్లక్ష్య పూరిత విధానాలు, కార్పొరేట్ల ధనదాహం వెరసి రూపాయిని తీవ్రంగా దెబ్బతీశాయి. అంతర్జాతీయ చోటు చేసుకున్న మార్పులు, రోజు రోజుకు మార్కెట్ల హెచ్చు తగ్గులు రూపాయి విలువను మరింత క్షీణించేలా చేస్తున్నాయి. గురువారం డాలర్‌తో రూపాయి మారకం విలువ 59.93 పైసలకు పడిపోయింది. అంటే ఒక్క డాలర్‌కు భారత రూపాయలు 60 ఇవ్వాల్సిందే. ఈ దుస్థితికి కారణాలు అన్వేషించే పనిలో సగటు భారతీయులుండగా ఈ పరిణాల వల్ల ముంచుకుపోయిందేమీ లేదు అనే ధోరణిలో ఆర్థికశాఖ వర్గాలున్నాయి. రూపాయి ఏర్పడిన నాటి నుంచి ఇంత తీవ్రంగా పతన మవడం ఇదే మొదటిసారి. గత మే నెలలో డాలర్‌తో రూపాయి మారకం విలువ 58.98లుగా ఉండగా జూన్ 20 నాటికి అది మరింత తీవ్రంగా క్షీణించి 59.93లుగా నమోదైంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయమే ఈ దుస్థితికి, దుర్ఘతికి కారణంగా మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య లభ్యతను పెంచడానికి నెల నెల కొనుగోలు చేస్తున్న 8,500 కోట్ల డాలర్ల బాండ్లను ఈ ఏడాది నుంచి తగ్గిస్తామని అమెరికా కీలక ప్రకటన చేసింది. అమెరికా నిర్ణయంతో అంతర్జాతీయ డాలర్‌కు డిమాండ్ పెరుగగా ఆసియా దేశాల కరెన్సీ ఘననీయంగా పడిపోయింది. డాలర్‌కు డిమాండ్ భారీగా పెరగడంతో ఈక్విటీ మార్కెట్‌లో ఎఫ్‌ఐఐలు భారీగా పెట్టుబడులను వెనక్కు తీసుకున్నాయి. ఈ ప్రభావం రూపాయిపై పడింది. గురువారం ఒక్కరోజే విదేశీ ఇన్వెష్టర్లు రూ. 2 వేల కోట్ల మేర పెట్టుబడులను వెనక్కు తీసుకున్నారు. శుక్రవారం మార్కెట్‌లో రూపాయి కాస్త బలపడింది. గురువారం 59.57 రూపాయల వద్ద ముగిసిన రూపాయి మారకం 16 పైసలు పెరిగి 59.35 వద్ద ట్రేడ్ అయింది. డాలర్ల విక్రయాలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా అనుమతించిన తర్వాత రూపాయి విలువ కాస్త కోలుకుంది. ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం తర్వాత అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయిన రూపాయి మారకం విలువను పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటామన్న ఆర్‌బీఐ ప్రకటన తర్వాత మార్కెట్ వర్గాలు కాస్త ఊపిరి పీల్చుకున్నాయి. భారత దేశంలో క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దంలో షేర్‌షా సూరి రూపాయిని ప్రవేశపెట్టాడని చారిత్రక ఆధారాలున్నాయి. ఆ రూపాయికి 40 రాగి నాణేల విలువ ఉండేది. రూపాయిని మొదట కాగితాలుగు ముద్రించింది 1770-1832 మధ్యలో బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్, 1773-75లో జనరల్ బ్యాంక్ ఆఫ్ బెంగాల్ బీహార్. వారన్ హేస్టింగ్స్ బెంగాల్ బ్యాంక్ (1784-91)ను స్థాపించాడు. 19వ శతాబ్దం ప్రారంభంలో రూపాయి విలువ పటిష్టంగా ఉండేది. వెంణి నాణెం రూపాయిగా ఉండేది. అదే సమయంలో బంగారంతో పోలిస్తే వెండి విలువ గణనీయంగా పతనమైంది. అదే రూపాయి పతనానికి నాందిగా పేర్కొంటున్నారు. బ్రిటిష్ కాలంలో రూపాయికి 16 అణాలు ఉండేవి. ఒక్కో అణాకు 6 పైసల విలువ. మద్రాసు ప్రెసిడెన్సీ కాలంలో ఫానం అనే ద్రవ్యం చెలామణీలో ఉండేది. 12 ఫానంలు ఒక రూపాయికి సమానం. స్వాతంత్య్రానికి ముందు తిరువాన్కూర్ రూపాయి, హైదరాబాద్ రూపాయి, కచ్ చోరీ ఇలా వివిధ ప్రాంతాల్లో వివిధ ద్రవ్యం చెలామణీలో ఉండేది. దేశానికి స్వాతంత్రం వచ్చాక అన్ని ద్రవ్యాలను తీసేసి రూపాయిని దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టారు. 1957లో రూపాయికి 100 పైసలుగా నిర్ధారించి ఈ పైసలను నయా (హిందీలో ‘కొత్త’)గా పిలిచేవారు. తర్వాతి కాలంలో నయా మరుగున పడిపోయింది. డేనిష్ ఇండియన్ రూపాయిని 1845లో, ఫ్రెంచి ఇండియన్ రూపాయిని 1954లో, పోర్చుగీసు ఇండియన్ ఎస్కుడోను 1961లో తొలగించి వాటి స్థానంలో రూపాయిని ప్రవేశపెట్టేవారు. మొదట్లో భారత రూపాయి పటిష్టంగా ఉండేది. 1966 జూన్ 6న మొట్టమొదటి సారిగా భారత్ తన ద్రవ్య విలువను తగ్గించుకుంది. తర్వాతికాలంలో అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 20కి అటు ఇటుగా ఉండేది. ప్రపంచీకరణ ప్రభావంతో అంతర్జాతీయ పెట్టుబడులకు భారత్ ద్వారాలు బార్లా తెరిచింది. రూపాయి ద్రవ్య విలువ అత్యధికంగా ఉన్న నేపథ్యంలో అభివృద్ధి చెందిన దేశాలు అంతమొత్తం ఉంటే పెట్టుబడులు పెట్టేందుకు ససేమిరా అన్నాయి. ఫలితంగా ఇప్పటి ప్రధాని, అప్పటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి మన్మోహన్‌సింగ్, అప్పటి ప్రధాని, సంస్కరణ పితామహుడిగా చెప్పుకునే పీవీ నరసింహారావు తీవ్ర తర్జన భర్జనల తర్వాత రూపాయి మారకం విలువను 20 నుంచి 42కి తగ్గించారు. అప్పటికే భారత ఆర్థిక వ్యవస్థ దారుణంగా పడిపోవడంతో దేశంలో ఉన్న బంగారం నిల్వలు కుదువ బెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయ పెట్టుబడులు వస్తే తప్ప ఆర్థికంగా పురోగతి ఉండదని చెప్పిన పాలకులు ఒకేసారిగా రూపాయి మారకాన్ని తగ్గించేశారు. అది మొదలు రూపాయి మారకం విలువ క్రమేణా క్షీణిస్తూ వస్తోంది. మొదట్లో 42 నుంచి 46 మధ్య ఉన్న రూపాయి మారకం విలువ సంస్కరణలు వేగవంతమయ్యాక మరింతగా క్షీణించింది. ఆ రోజుల్లో ఊపుమీదున్న బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ (బీఎస్‌ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) తర్వాత తీవ్ర ఒడి దుడుకులను ఎదుర్కొన్నాయి. ప్రపంచమంతా అమెరికా వెనుక పరిగెత్తడం ప్రారంభించడం ప్రారంభించాక అక్కడ జరిగే ప్రతి పరిణామం రూపాయి సహా అన్ని దేశాల కరెన్సీపై తీవ్ర ప్రభావాన్నే చూపింది. అంతర్జాతీయంగా తీవ్ర ఆర్థిక మాంద్యం నెలకొన్న తరుణంలో కాస్త బలంగా ఉన్న రూపాయి ఆ ప్రభావం తగ్గడంతో మరింతగా క్షీణించింది. గడిచిన కొన్ని నెలలుగా రూపాయి మారకం విలువ క్రమేణా క్షీణిస్తోంది. ప్రజలు బంగారం కొనుగోలుపై మోజు చూపడం, బంగారాన్ని పెట్టుబడిగా పెట్టడం కూడా రూపాయి విలువ క్షీణతకు దారితీసింది. రూపాయి మారకం విలువ క్షీణిస్తున్నాకొద్దీ ఆహార ద్రవ్యోల్బణం, ధరల సూచీ క్రమేణా పెరుగుతూ పోతుంది. ఫలితంగా సామాన్యుడు రెండు పూటల పిడికెడు మెతుకులు తినలేని పరిస్థితి. ఇటీవల యూపీఏ-2 ప్రభుత్వ నాలుగేళ్ల ప్రస్థానాన్ని వివరిస్తూ ప్రధాని మన్మోహన్‌సింగ్ 8 శాతం వృద్ధి రేటు సాధించడమే లక్ష్యమని తెలిపాడు. ఈ దిశగా చర్యలు చేపడుతానని వివరించాడు. కానీ ఆ పరిస్థితి ఏ కోశాన కనిపించడం లేదు. అంతర్యుద్ధం, అనేక యుద్ధాలతో చితికిపోయిన అఫ్ఘనిస్తాన్ కరెన్సీ విలువ డాలర్‌తో పోల్చినపుడు 56 రూపాయలుగా ఉండగా, అత్యంత పటిష్టమైన ఆర్థిక వ్యవస్థగా చెప్పుకునే భారత్‌లో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. రూపాయి విలువ ఆల్‌టైమ్ కనిష్టస్థాయికి పతమైన పరిస్థితుల్లోనూ చికిత్స చేసేందుకు భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వ్‌బ్యాంక్ చేపట్టిన చర్యలు శూన్యమే. రూపాయిని నిలబెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ వద్ద అత్యంత శక్తిమంతమైన ఆయుధాలున్నాయని, అవసరమైనప్పుడు తప్పక కలుగజేసుకుంటుందని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్‌సింగ్ అహ్లువాలియా పేర్కొన్నాడు. రూపాయి విలువ పతమైన నేపథ్యంలో ఆందోళన అవసరం లేదని ఆర్థిక మంత్రి చిదంబరం పేర్కొన్నాడు. కానీ రూపాయి పునరుజ్జీవానికి, పునరుత్తేజ్జానికి ఏం చర్యలు తీసుకుంటాడో మాత్రం వివరించలేదు.