రూ.313కోట్లతో రెండో విడత చెరువుల పునరుద్ధరణ

1

రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి హరీష్‌రావు

వరంగల్‌  :

జిల్లాలో మిషన్‌ కాకతీయ రెండవ దశ కింద  రూ.313కోట్లతో 824 చెరువులను పునరుద్ధరణకు పరిపాలన అనుమతులు మంజూరు చేశామని రాష్ట్ర సాగునీటి పారుదల,మార్కెటింగ్‌ శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు చెప్పారు. గురువారం వరంగల్‌ నగరంలో మిషన్‌ కాకతీయ రెండవ దశ కింద రూ.90లక్షల 82వేల వ్యయంతో చేపట్టిన పద్మాక్షి గుండం చెరువు పునరుద్దరణ సుందీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మిషన్‌ కాకతీయ మొదటి దశ కింద జిల్లాలో రూ.418కోట్ల నిధులతో 1075 చెరువుల పనులు చేపట్టినట్లు తెలిపారు. మిషన్‌ కాకతీయ కింద మంచి ఫలితాలు సాధించి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. మిషన్‌ కాకతీయ ద్వారా చేపట్టిన చెరువుల పునరుద్దరణ పనులతో నర్సంపేట, డోర్నకల్‌, ములుగు, భూపాలపల్లి ప్రాంతాల్లో చెరువులు జలకళతో నిండి మంచి ఫలితాలు సాధించినట్లు మంత్రి చెప్పారు. జిల్లా కలెక్టర్‌ ప్రతి చెరువుకు ఒక మండల స్థాయి అధికారిని నోడల్‌ అధికారిగా నియమించి ప్రత్యేక శ్రద్దతో పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నారని తెలిపారు. భూగర్భ జలాలను పెంపొందించి రైతాంగానికి సాగు, తాగునీరు అందించేందుకు చేపట్టిన మిషన్‌ కాకతీయ కార్యక్రమం అంతర్జాతీయంగా గుర్తింపు పొందిందన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు ఏర్పాటు చేసుకున్న గ్రేన్‌ క్లైమేట్‌ ఫండ్‌ నుండి పంపిన ప్రతిపాదనల్లో 4 ప్రాజెక్టులు ఎంపికైతే అందులో మిషన్‌ కాకతీయ కింద గ్రామాల్లో నీటి లభ్యత కోసం చెరువుల పునరుద్దరణ చేపట్టి రైతాంగం పొలాలకు సాగునీరి అందించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా పట్టణ ప్రాంతాల్లోని అన్ని చెరువుల మరమత్తు, పునరుద్దరణ పనులు చేపట్టి చెరువుల జలకళతో నిండేలా చేయనున్నట్లు తెలిపారు. పట్టణాల్లో చెరువులకు నీటిని చేరవేసే ఫీడర్‌ ఛానళ్లు మట్టితో నిండి వర్షం పడితే ఆ నీరు లోతట్టు ప్రాంతాలకు మళ్లుతున్నాయని తెలిపారు. పట్టణంలోని చెరువును పునరుద్దరణ చేసి పూడిక తీస్తే బోర్లలో ప్రాచీనమైన పద్మాక్షి గుండం చెరువు పునరుద్దరణ సుందరీకరణ పనులు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.96లక్షల 70వేలతో పరిపాలన అనుమతులు మంజూరు చేయగా రూ.93లక్షల 40వేలత సాంకేతిక అనుమతులు పొంది రూ.90లక్షల 82వేల టెండర్లు పిలిచి ఒప్పందం కుదిరిందని అన్నారు. ఈ నిధులతో పద్మాక్షి గుండం చెరువు పూడిక పునరుద్దరణతో పాటు బతుకమ్మ ఆడి వేసేందుకు రెండు వైపుల మెట్లు, గణేష్‌ విగ్రహాలకు నిమజ్జనం చేసేందుకు ఫ్లాట్‌ ఫాం నిర్మించనునట్లు మంత్రి చెప్పారు. హృదయ్‌ పథకం మరో రూ.2కోట్లు పద్మాక్షి చెరువు అభివృద్దికి మంజూరు కానున్నాయని తెలిపారు. ఏప్రిల్‌ నెల మొదటి వారాల్లో చెండవ దశ కింద ప్రజాప్రతినిధులందరూ చెరువు పునరుద్దరణ పనుల ప్రారంభించే కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పిఎంకెఎస్‌వై కింద దేవాదుల ప్రాజెక్టును ఎంపిక చేసిందని దీనికి నిధులు మంజూరు కానున్నాయని తెలిపారు.దేవాదుల ప్రాజెక్టుకు ఈ సంవత్సరం రూ.2500 కోట్ల మేర ఖర్చు  చేయనున్నామని దానికి సంబంధించిన భూ సేకరణ ప్రక్రీయ వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. కరువు కాలంలో 8టిఎంసిల నీటిని దేవాదుల ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్‌, జనగామ తదితర నియోజకవర్గాలలోని చెరువులను నింపుకొన్నట్లు మంత్రి చెప్పారు.  నగర అభివృద్ధిలో భాగంగా నగర పాలక సంస్థ వరంగల్‌కు బడ్జెట్‌లో ప్రత్యేకంగా  ఈ సంవవత్సరం రూ.300 కోట్ల నిధులు కేటాయించినట్లు, వచ్చే మూడు సంవత్సరాలలో రూ.1000 కోట్లు నగర పాలక సంస్థకు ప్రత్యేకంగా నిధులు  రానున్నట్లు తెలిపారు. వరంగల్‌ పార్లమెంట్‌  సభ్యులు పసునూరి దయాకర్‌రావు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైన చెరువులను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిషన్‌ కాకతీయ కింద చెరువుల పునరుద్దరణ పనులు చేపట్టినట్లు, ఊరుకు చెరువు ముఖ్యమని చెరువు అభివృద్దితో ఊరు అభివృద్ధి చెందుతుందన్నారు. జిల్లా కలెక్టర్‌ వాకాటి కరుణ మాట్లాడుతూ నగరంలో 41 చెరువులు ఉన్నాయని, గత సంవత్సరం 16 చెరువుల పునరుద్దరణకు మంజూరు చేశామని ,నగరంలో భూగర్భ జలాలకు పెంపుకు మిగిలిన చెరువుల పనులు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో  శాసనమండలి సభ్యులు బి.వెంకటేశ్వర్లు, శాసనసభ్యులు దాస్యం వినయ్‌భాస్కర్‌, తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నగర మేయర్‌ నన్నపనేని నరేందర్‌, జెసి ప్రశాంత్‌జీవన్‌పాటిల్‌, డిప్యూటి మేయర్‌ ఖాజా సిరాజొద్దిన్‌, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.