రెండేళ్లు కావస్తున్నా ప్రజల్లో కానరాని ఆశ

ఇంట గెలిచి రచ్చ గెలవాలని అంటారు. ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ దేశాన్ని ఇంకా ఆకళింపు చేసుకున్నట్లు లేదు. కానీ మన ప్రధాని మోడీ మాత్రం రచ్చ గెలిచానని అనుకుంటున్నా ఆ సంగతెలా ఉన్నా, ఇంట మాత్రం గెలవలేకపోయారు. దేశంలో అనేకానేక సమస్యలకు మోడీ ప్రధాని అయితే పరిస్కారం అవుతాయని ప్రజలంతా భావించారు. వెంకయ్యనాయుడు, అరుణ్‌ జైట్లీ తదితరులు ఎంతగా భుజకీర్తులు  ఎగరేసినా, ఎంతగా భజన చేసినా దేశ ప్రజల్లో వీసమెత్తు సంతృప్తి లేదన్నది నూటికి నూరుపాళ్లు నిజం. ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా ఈ విషయం చెబుతారు. మోడీ నాయకత్వంలో బిజెపి పగ్గాలు చేపట్టి దాదాపు రెండేళ్లు కావస్తోంది. మే 26కు రెండేల్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో  ఏదైనా పురోగతి సాధించడానికి ఇది తక్కువ సమయమేవిూ కాదు. అధికారం చేతిలో ఉంటే ప్రజలకు ఏదైనా చేయవచ్చు. ధరలను అదుపు చేస్తామన్న వాగ్దానం అస్సలు నెరవేర్చలేకపోయారు. అలాగే అవినీతిని అరికట్టలేకపోయారు. బ్యాంకుకు రుణాలు ఎగవేసే వారు కాలర్‌ ఎగరేస్తున్నారు. మాల్యా లాంటి వారు దర్జాగా తప్పించుకుని పోయారు. స్విస్‌ బ్యాంకుల్లో నల్లధనం సంగతి అటుంచి దేశంలో బ్యాంకులకు రుణాలు ఎగవేసిన వారిని వదలకుండా పట్టుకోలేక పోతున్నారు. బ్యాంకును ముంచిన కేసులో దోషిగా ఉన్న సుజనా చౌదరి కేంద్రమంత్రిగా ఉన్నారు. కావూరి సాంబశివరావు బిజెపిలో ఉన్నారు. దీనికి బిజెపి సమాధానం చెప్పాలి. మోడీని పొగుడుతన్న వారు వీటికి సమాధానం చెప్పాలి. ఇక దేశంలో శాంతిభద్రతల విషయంలో పెద్దగా మార్పులు లేవు. యూనివర్సిటీల్లో అరాచకాలు జరుగుతున్నా కఠినంగా అణచివేయడం లేదు. గతంలో కన్నా సరిహద్దులు ప్రమాదకరంగా మారాయి. కాశ్మీర్‌లో తీవ్రవాదులు పెచ్చువిూరి ప్రవర్తిస్తున్నా విదేశీ జెండాలు ఎగరవేస్తున్నా కఠినంగా అణచివేయడం లేదు. ఈ రెండేళ్ల తమ పాలనలో అనేక విజయాలు సాధించామని బిజెపి నాయకులు ప్రకటించుకుంటున్నా ప్రజల్లో మాత్రం అలాంటి భావన లేదని గ్రహించాల్సి ఉంది.  కేవలం తమను తాము అభినందించుకునే విధంగా గాకుండా కిందిస్థాయిలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చగలిగామా అన్న చర్చ చేయాలి. తాము చెప్పుకున్నదే అభివృద్దిగా భావించడమా అన్నది నేతలు గ్రహించాలి.  ప్రభుత్వం సంపన్నవర్గాలకు అనుకూలం, రైతువ్యతిరేక సర్కారు వంటి ముద్రలు ప్రజల్లో కూడా నాటుకుని పోయింది.  గ్రావిూణప్రాంతాల సర్వతోముఖాభివృద్ధి కోసమే, అన్నదాతల సంక్షేమం కోసం అనేక ప్రకటనలు చేస్తున్నా గ్రామస్థాయిలో వాటి ప్రవేశం ఏ మేరకు జరిగిందో విశ్లేషించాలి. కేంద్ర బడ్జెట్‌లో పేదలు, మధ్యతరగతి ప్రజలకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాలు లేవన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే  తీసుకున్న నిర్ణయాలను సమర్థించుకుని ఎక్కువ సమయం కేటాయించుకుని సాగితే ప్రజలు హర్షించరు. పెట్రోలు, డీజిల్‌ ధరలు తగ్గుముఖంపట్టినా  నిత్యావసరాల ధరలను మాత్రం అదుపులో పెట్టలేకపోయారు. దీనిపై ఇంతవరకు గట్టి నిర్ణయాలు తీసుకోలేదు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నామని అంటున్నా  పంటల కొనుగోళ్లు సాఫీగా సాగడం లేదు.  అవినీతి నిర్మూలనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కానరావడం లేదు.  వివిధ దేశాలలో ప్రధాని జరిపిన పర్యటనలు తద్వారా ఆయాదేశాలతో మెరుగైన సంబంధాలను వెల్లడిస్తూ సంబరాలు చేసుకోవడమే పాలన అనుకుంటే సరిపోదు. అస్సాం, పశ్చిమ్‌బంగ,తమిళనాడు, కేరళ  అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయం సాధిస్తుందా లేదా అన్నది పక్కన పెడితే క్రియశీలక పాత్ర పోషిస్తుందా అన్నది కూడా అనుమానమే.  గత పదేళ్ల యూపిఎ పాలనతో పోలిస్తే ఈ రెండేళ్లలో తామెంతో అభివృద్దిని సాధించామని చెప్పుకోవడం ద్వారా ప్రజలను వంచించలేరు. మే 26 నాటికి మోడీ కేంద్రంలో అధికార పీఠమెక్కి రెండేళ్లు కావస్తోంది. తన రెండేళ్ల  కాలంలో సాధించిన విజయాలను ప్రభుత్వ పరంగా చెప్పడంకన్నా ప్రజల్లో చర్చ సాగాలి. అలాంటి పరిస్తితులు ఉంటే అది మంచి ప్రభుత్వమని గుర్తించాలి. కానీ ఇప్పటి వరకు అలాంటి చర్చ సాగిన సందర్భాలు అరుదనే చెప్పాలి. అయితే ప్రజల్లో మాత్రం పెద్దగా సంతృప్తి మాత్రం లేదు. ఏదో ప్రభుత్వం ఉందన్న భావన తప్ప మరోటి కాదు. నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో ఉన్న ఊపు లేదా ఉత్సాహం ఇప్పుడు ప్రజల్లో కనిపించడం లేదు. ఆయన ఏదైనా  బహిరంగ సభనుద్దేశించి మాట్లాడినా, తన మాతృమూర్తి పాదాలను స్పృశించి ఆశీర్వాదాలు కోరినా, పార్లమెంట్‌ లోపలికి ప్రవేశించే ముందు మెట్లను శిరసు వంచి నమస్కరించినా గతంలో ఎన్నడూ చూడని ఒక కొత్త నేతను చూసిన అనుభూతిని కల్పించారు. పాలన వినూత్నంగా ఉంటుందని, పేదలకు మంచిరోజులు వచ్చాయని భావించారు. దేశంలో ఒక వినూత్న మార్పుకు రంగం ఆవిష్కృతమైందని అనుకున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హావిూల అమలుకు రంగం సిద్దం అయ్యిందనుకున్నారు. ధరలు తగ్గుతాయని, రైతులకు మంచి రోజులువచ్చాయని, పేదలకు భరోసా కలిగిందని, అక్రమార్కులకు ముకుతాడు వేస్తారని ఇలా ఎవరికి వారు తమ ఆశాజ్యోతిగా మోడీని భావించారు. తమ సమస్యలు క్రమంగా పరిష్కారమవుతాయని,  ఆర్థికవ్యవస్థ బలం పుంజుకుంటుందని, పేదరికం క్రమంగా మటుమాయమవుతుందని, ధరలు తగ్గిపోతాయని అనేక మంది భావించారు. యువత, మధ్యతరగతి, మహిళలు, రైతాంగం.. ఇలా ఒక్క వర్గం కాదు, ప్రతి ఒక్క వర్గమూ మోదీ పట్ల అమిత విశ్వాసాన్ని పెంచుకున్నది. అయితే అవన్నీ భ్రమలే అని భావించడానికి ఎంతోకాలం పట్టలేదు. ఈ రెండేళ్ల కాలం తక్కువేం కాదు. ఎన్నికల్లోఒ గెలవడమే లక్ష్యంగా పనిచేయడం కాకుండా ప్రజల మనసులను గెలిచేలా పాలన చేస్తే ప్రజలే ఆదరించి పట్టం కడతారని కమలనాథులు గుర్తించాలి.