రెజ్లర్ వినేశ్ ఫోగాట్‌పై చివరి నిమిషంలో అనర్హత వేటు
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్‌పై పారిస్ ఒలింపిక్స్ లో చివరి నిమిషంలో అనర్హత వేటు పడింది. వినేశ్ మహిళల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ 50 కిలోల విభాగంలో ఇవాళ రాత్రి ఫైనల్‌లో పోటీ పడాల్సి ఉంది. దీంతో నిర్వాహకులు ఆమె బరువును చూశారు. ఆ సమయంలో వినేశ్ 100 గ్రాములు అదనపు బరువుతో ఉన్నట్టు గుర్తించారు. దాంతో ఆమెపై ఒలింపిక్ కమిటీ, రెజ్లింగ్ కమిటీ అనర్హత వేటు వేశాయి.
అయితే, మంగళవారం రాత్రి నాటికి వినేశ్ ఫోగాట్ నిర్ణీత 50 కిలోల కన్నా 2 కేజీలు అదనపు బరువు ఉన్నారు. దాంతో వెయిట్ తగ్గేందుకు ఆమె జాగింగ్, స్కిప్పింగ్, సైక్లింగ్ చేశారు. ఇక కోచ్, ఇతర స్టాఫ్ ఆమెతో పాటు రాత్రంతా నిద్రాహారాలు మానేసి వినేశ్ అదనపు బరువు తగ్గించేందుకు తీవ్రంగా శ్రమించారు. చివరికి ఆమె శరీరం నుంచి కొంత రక్తాన్ని తొలగించారు. అలాగే జుట్టు కూడా కత్తిరించారు. అయినా ఫలితం లేకుండా పోయింది.
ఈవెంట్‌కు ముందు 100 గ్రాముల బరువు అధికంగా ఉండటంతో అనర్హత వేటు పడింది. దీంతో మహిళల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ 50 కిలోల విభాగంలో ఫైనల్స్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.
అనర్హత వేటుపై మోదీ ఓదార్పు
అనర్హతపై ప్రధాని మోదీ స్పందిస్తూ వినేశ్‌ను ఓదార్చారు.”వినేశ్.. నువ్వు ఛాంపియన్లకే ఛాంపియన్! నీ ప్రతిభ దేశానికి గర్వకారణం. భారతీయులందరికీ నువ్వు స్ఫూర్తిదాయకం. ఈ రోజు నీకు తగిలిన ఎదురుదెబ్బ ఎంతో బాధించింది. దీన్ని వ్యక్తం చేయడానికి నా దగ్గర మాటల్లేవు. కానీ, ఈ బాధ నుంచి బయటపడి నువ్వు బలంగా తిరిగి రాగలవని నేను నమ్ముతున్నా. సవాళ్లను ఎదిరించడం నీ నైజం. నీకు మేమంతా అండగా ఉన్నాం” అని మోదీ భరోసానిచ్చారు.
అనర్హత వేటు తర్వాత ఆసుపత్రి పాలైన వినేశ్ ఫోగాట్
భారత స్టార్ అథ్లెట్ వినేశ్ ఫోగాట్ అస్వస్థకు గురయ్యారు. డీగైడ్రేషన్ కారణంగా ఆమె అనారోగ్యం బారిన పడ్డారు. దాంతో వినేశ్‌ను పారిస్లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారని సమాచారం. ఇవాళ రాత్రి మహిళల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ 50 కిలోల విభాగంలో ఫైనల్స్ ఆడాల్సి ఉండగా, 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హత వేటు పడింది.
మంగళవారం బౌట్ సమయంలో ఆమె తన బరువు నియంత్రణలోనే ఉంచుకొన్నట్లు తెలుస్తోంది. కానీ, మంగళవారం రాత్రికి వినేశ్ రెండు కిలోల ఓవర్వెయిట్ ఉన్నారు. దీంతో జాగింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్ వంటివి బరువు తగ్గేందుకు దోహదపడే కసరత్తులు చేశారు.
అంతేకాకుండా భోజనం కూడా తీసుకోకుండా, బరువును తగ్గించుకునేందుకు రాత్రంతా ఆమె నిద్రపోకుండా మేల్కొనే ఉన్నట్లు సమాచారం. దీని కారణంగానే వినేశ్ ఇప్పుడు డీహైడ్రేషన్‌కు గురైనట్లు క్రీడా వర్గాల సమాచారం.