దిగుమతులపై సుంకాల విధింపు నిలిపివేత

` సుప్రీం తీర్పుతో దారికొచ్చిన అమెరికా ప్రభుత్వం
` మంగళవారం నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటన
` అమెరికా కస్టమ్స్ శాఖ ప్రకటన విడుదల
వాషింగ్టన్(జనంసాక్షి): దిగుమతులపై సుంకాల విధింపును మంగళవారం నుంచీ నిలిపి వేయనున్నామని అమెరికా కస్టమ్స్ శాఖ తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్థిక ఎమర్జెన్సీ పేరిట ట్రంప్ ప్రభుత్వం విధిస్తున్న సుంకాలు చెల్లవంటూ అమెరికా సుప్రీం కోర్టు ఇటీవల తీర్పునిచ్చిన నేపథ్యంలో యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్స్ ప్రొటెక్షన్ శాఖ ఈ ప్రకటన విడుదల చేసింది. ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనమిక్ పవర్స్ చట్టం కింద సుంకాల వసూళ్లను నిలిపివేస్తున్నట్టు తెలిపింది. అమెరికా కాలమానం ప్రకారం, మంగళవారం అర్ధరాత్రి 12.01 నుంచి ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది.సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన మూడు రోజులకు కస్టమ్స్ శాఖ ఈ ప్రకటన విడుదల చేసింది. వెంటనే సుంకాల వసూలును ఎందుకు నిలిపివేయలేదో చెప్పలేదు. ఇప్పటివరకూ వసూలు చేసిన సుంకాల డబ్బును రీఫండ్ చేయడంపై కూడా క్లారిటీ ఇవ్వలేదు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగుమతులపై కొత్తగా 10 శాతం కనీస సుంకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా దాన్ని 15 శాతానికి పెంచారు. ఐఈఈపీఏ చట్టానికి బదులు వాణిజ్య చట్టం`1974లోని సెక్షన్ 122 కింద సర్‌చార్జ్ పేరిట ఈ సుంకాలకు తెరతీశారు. అయితే, అమెరికా చట్టసభల అనుమతి లేనిదే వీటిని కూడా 150 రోజులకు మించి పొడిగించే అవకాశం లేదు. ఇక జాతీయ భద్రత పేరిట స్టీల్, అల్యూమినియం, సెవిÖకండక్టర్స్, ఆటో రంగాలపై గతంలో విధించిన సుంకాలనూ ట్రంప్ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో శాశ్వత ప్రాతిపదికన సుంకాలు విధించేందుకు మార్గాలను అన్వేషించాలని వాణిజ్య విభాగానికి ఆయన సూచించినట్టు అంతర్జాతీయ విÖడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇకపోతే సుంకాల విధింపు చెల్లదంటూ అమెరికా సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వానికి కొత్త చిక్కులు మొదలయ్యాయి. సుంకాల వల్ల ఇప్పటివరకూ అధిక ధరలు చెల్లించిన అమెరికన్ కస్టమర్లు తమకు రీఫండ్స్ కావాలని పట్టుబడుతున్నారు. ఈ జాబితాలో ట్రంప్ రాజకీయ ప్రత్యర్థులతో పాటు కార్పొరేట్ కంపెనీలు కూడా ఉన్నాయి. అయితే, ఈ పక్రియ అంత సులభం కాదని అక్కడి నిపుణులు చెబుతున్నారు.తాను విధించిన సుంకాల భారం విదేశీ ఎగుమతిదారులపై తప్ప సామాన్య అమెరికన్లు, అమెరికా దిగుమతి దారులపై లేదని ట్రంప్ ఇప్పటివరకూ చెబుతూ వచ్చారు. అయితే, ఆయన రాజకీయ ప్రత్యర్థులు మాత్రం ఈ వాదనతో మొదటి నుంచీ విభేదిస్తున్నారు. అధిక సుంకాల భారాన్ని సామాన్య అమెరికన్లే భరించాల్సి వచ్చిందని మండిపడేవారు. ఇక సుప్రీం తీర్పు తరువాత ఇల్లినాయ్ రాష్ట్ర గవర్నర్ సుంకాల రీఫండ్స్ కోరుతూ ట్రంప్‌నకు బిల్లులు పంపించారు. సుంకాల కారణంగా తమ రాష్ట్రం 9 బిలియన్ డాలర్లు అధికంగా చెల్లించాల్సి వచ్చిందని అన్నారు. తమ రాష్ట్రంలోని ఒక్కో కుటుంబంపై సగటున 1,700 డాలర్ల అదనపు భారం పడిందని అన్నారు. ఇక కార్పొరేట్ కంపెనీలు కూడా రీఫండ్స్‌కు సిద్ధమవుతున్నాయి. కాస్ట్‌కో, రెవ్లాన్ వంటి పలు సంస్థలు ఇప్పటికే కేసులు దాఖలు చేశాయి. ఇప్పటివరకూ ట్రంప్ ప్రభుత్వం సుంకాల పేరిట 133 బిలియన్‌ల నుంచి 175 బిలియన్ డాలర్ల మేర వసూలు చేసి ఉంటుందని అమెరికా వర్గాలు భావిస్తున్నాయి. సుంకాల డబ్బులో ఎంతో కొంత తిరిగిస్తామని ట్రంప్ వర్గం ఇప్పటికే పలుమార్లు తెలిపింది. అయితే, ఇది అంత ఆషామాషీ వ్యవహారం కాదని అక్కడి నిపుణులు చెబుతున్నారు. సామాన్య ప్రజలకు నేరుగా రీఫండ్స్ అందే అవకాశాలు తక్కువని ట్రెజరీ సెక్రెటరీ స్కాట్ బెస్సెంట్ కూడా పేర్కొన్నారు. రీఫండ్స్‌లో అధికభాగం దిగుమతిదారులు, అమెరికన్ కంపెనీలకే వెళుతుందని చెబుతున్నారు. విదేశీ ఉత్పత్తుల దిగుమతి సమయంలో వీరే కస్టమ్స్ శాఖకు నేరుగా సుంకాల రూపంలో అధిక ధరలను చెల్లించారని వివరిస్తున్నారు. రీఫండ్స్ పక్రియ కూడా సంక్లిష్టంగా ఉంటుందని ఇప్పటికే జస్టిస్ ఏవిÖ కోనీ బేరెట్, జస్టిస్ బ్రెట్ కేవనా హెచ్చరించారు. ఈ విషయంలో కోర్టు కేసులు కొలిక్కి వచ్చేసరికి రెండు నుంచి నాలుగేళ్ల సమయం పడుతుందని ట్రంప్ కూడా ఇటీవల ఓ సందర్భంలో స్వయంగా అంగీకరించారు. వేల కొద్ది దిగుమతిదారుల రిఫండ్స్ అభ్యర్థనలను పరిశీలించడం కస్టమ్స్ శాఖకూ భారంగా మారుతుందని అంటున్నారు. ఇక అంతర్జాతీయ స్థాయిలో కూడా ట్రంప్ సర్కారు పలు కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాణిజ్య నిపుణులు చెబుతున్నారు. న్యూయార్క్ ఫెడ్, జేపీ మోర్గన్, కీల్ ఇన్‌స్టిట్యూట్ అంచనా ప్రకారం, కస్టమ్స్ శాఖ వసూలు చేసిన సుంకాల్లో 90 నుంచి 96 శాతం అమెరికన్ల జేబుల్లోంచే వెళ్లాయి. భారత్, చైనా, మెక్సికో లాంటి దేశాలు తమ ఉత్పత్తుల ధరల తగ్గింపు రూపంలో 4`10 శాతం మాత్రమే సుంకాల భారాన్ని భరించాయి.

 

సుప్రీం తీర్పును అలుసుగా తీసుకుని ఆటలాడితే మళ్లీ వడ్డింపులే..
` భారీగా సుంకాలు విధిస్తాం
` ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్(జనంసాక్షి):సుంకాల విషయంలో అమెరికా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అలుసుగా తీసుకుని ఏ దేశమైనా ఆటలాడాలని చూస్తే భారీ టారిఫ్‌లు విధిస్తానని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. తీర్పు విషయంలో సుప్రీం కోర్టును మరోసారి లక్ష్యంగా చేసుకున్నారు. తెలియకుండానే తనకు మరిన్ని అధికారాలు కట్టబెట్టిందని పేర్కొన్నారు. ఈ మేరకు ట్రూత్ సోషల్‌లో వరుస పోస్టులు పెట్టారు.“సుప్రీంకోర్టు తీర్పును అలుసుగా తీసుకుని ఆటలాడాలని చూసే దేశాలపై ఎన్నడూలేని రీతిలో సుంకాలు విధిస్తా. అమెరికాను దశాబ్దాలుగా కొల్లగొట్టిన దేశాలు.. ఇటీవల అంగీకరించిన దానికంటే భారీ సుంకాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. జాగ్రత్త! సుంకాల ఆమోదం పొందడానికి అధ్యక్షుడిగా నేను కాంగ్రెస్‌కు తిరిగి వెళ్లాల్సిన అవసరం లేదు” అంటూ ట్రంప్ హెచ్చరించారు.“అనేక ఏళ్లుగా అమెరికాను కొల్లగొట్టిన దేశాలపై ఇప్పుడు లైసెన్స్‌ల రూపంలో కఠిన చర్యలు తీసుకోవచ్చు. అయితే.. ఈ లైసెన్స్‌లకు ఫీజు వసూలు చేయడం కుదరదని తీర్పు చెబుతోంది. వాస్తవానికి ప్రతి లైసెన్స్‌కు ఒక ఫీజు ఉంటుంది. మరి మేం ఎందుకు వసూలు చేయకూడదు? అదేవిధంగా కోర్టు ఇతర సుంకాలను ఆమోదించింది. ఇప్పుడు వాటిని చట్టబద్ధంగా, కఠినమైన రీతిలో ఉపయోగించగలను. ఏదేమైనా.. కోర్టు తప్పుడు వ్యక్తులకు సాయం చేసింది. మున్ముందు ‘జన్మతః పౌరసత్వం’ విషయంలోనూ వ్యతిరేక తీర్పు ఇవ్వొచ్చేమో! ఇలాంటి తీర్పులు చైనా, ఇతర దేశాలకే ప్రయోజనాలు చేకూరుస్తాయి” అని మండిపడ్డారు.‘అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం’ (ఐఈఈపీఏ)ను ఉపయోగించి ప్రపంచ దేశాలపై ట్రంప్ ఏకపక్షంగా టారిఫ్‌లు విధించడాన్ని అమెరికా సుప్రీంకోర్టు ఇటీవల తీవ్రంగా తప్పుబట్టిన సంగతి తెలిసిందే. అమెరికా కాంగ్రెస్ అనుమతి లేకుండా వేసిన ఈ సుంకాలు చెల్లవంటూ తీర్పు వెలువరించింది.