చిన్నారిని తొక్కిచంపిన నిందితులను కఠినంగా శిక్షించాలి
మోపాల్, ఫిబ్రవరి 23 (జనంసాక్షి) : నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన దారుణ ఘటనపై నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కంజర్ గ్రామ యువత ఆగ్రహం వ్యక్తం చేసింది. అగ్రకుల దురంహకారంతో బలహీన వర్గానికి చెందిన కుటుంబంపై దాడి చేయడమేగాకుండా రెండు నెలల పసికందును సైతం కాలితో తన్ని చంపేశారని మండిపడింది. ఈ ఘటనను ఖండిస్తూ సోమవారం సాయంత్రం కంజర్ గ్రామంలో యువకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. చిన్నారికి నివాళిగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం పలువురు యువకులు మాట్లాడుతూ.. మల్లన్న జాతర సందర్భంగా దర్శనానికి వెళ్తే తక్కువ కులానికి చెందినవారని అనుమతించకపోవడం దారుణమని, రెండు నెలల చిన్నారిపైనా దుర్మార్గంగా వ్యవహరించి కాలితో తన్ని చావుకు కారణమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రకులానికి చెందిన అహకారంతో ఈ దుర్మార్గానికి ఒడిగట్టినవారిపై సర్కారు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే అప్పటివరకు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతూనే ఉంటామని, బీసీ కులాలన్నింటినీ సమీకరించి ఆ కుటుంబానికి న్యాయం జరిగేవరకూ పోరాడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యుడు సర్కల శ్రావణ్, యువకులు రామర్తి ప్రవీణ్, కిరణ్‌గౌడ్, నరేష్, శ్రీను, సుధాకర్, నిఖిల్, బన్నీ, రాహుల్, బుచ్చన్న, సంతోష్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.



