‘జనంసాక్షి’ కథనంతో కేవలం 2 గంటల్లోనే..

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (జనంసాక్షి) : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలోని రాయికల్ టోల్ ప్లాజా వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనలో మృతుడి కుల గుర్రం పురుషోత్తం రెడ్డి మెడలోంచి నాలుగు తులాల గొలుసు మాయమైన విషయం విదితమే. ఈ దారుణ ఘటనను బాధిత కుటుంబ సభ్యులు ‘జనంసాక్షి’కి తెలియజేయడం, వెంటనే జనంసాక్షిలో పతాక శీర్షికన కథనం ప్రచురించడంతో పోలీసులు ఆగమేఘాలపై కదిలారు. ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాలతో కేవలం 2 గంటల్లోనే పోలీసులు రికవరీ చేశారు. ఆ చైన్‌ను తూకం వేసి బాధితులకు అందజేశారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతూ ‘జనంసాక్షి’ కథనాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే మృతుడి మెడలోంచి గొలుసు దొంగతనం చేసింది ఎవరనేది తేలాల్సి ఉంది. సంఘటనా స్థలానికి వెళ్లిన కొందరిలోనే ఆ గొలుసు దొంగ ఉన్నట్టు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు సైతం సీరియస్‌గా తీసుకున్నట్టు తెలిసింది.