రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు
-ఉత్తరాఖండ్ రాష్ట్రపతి పాలనపై ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయం
న్యూఢిల్లీ,ఏప్రిల్ 23(జనంసాక్షి): మండుటెండల్లో పార్లమెంట్ సమావేవాలు మళ్లీ వేడెక్కనున్నాయి. సోమవారం నుంచి జరిగే సమావేశాలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మరోవైపు సర్కార్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు విపక్ష పార్టీఅలు కత్తులు నూరుతున్నాయి. సోమవారం నుంచి సమావేవాలు ప్రారంభం కానుండగా జిఎస్‌టి సహా అన్ని బిల్లుపై ఆమోదం లభించగలదని పార్లమెంటరీ వ్యవహారా శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ధీమాగా ఉన్నారు. పార్లమెంట్ ఉభయ సభల్లో సమావేశాల పునఃప్రారంభం కానుండడంతో బిల్లులపై మరోమారు కాంగ్రెస్‌తో చర్చిస్తామన్నారు. బడ్జెట్ సెషన్స్ లో భాగంగా రెండో దశ సమావేశాలు సోమవారంనుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు కత్తులను నూరుతుంటే, వాటిని ధీటుగా ఎదుర్కొనేందుకు పాలకపక్షం సిద్దంగా ఉంది. లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ పిలుపుమేరకు ఆదివారం అఖిలపక్షం భేటీకానుంది. మరోవైపు కీలక సమస్యలపై చర్చ చేపట్టాలంటూ పలువురు విపక్ష సభ్యులు ఇప్పటికే స్పీకర్, చైర్మన్ లకు నోటీసులు అందచేశారు. వాటిలో అధిక శాతం ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభం, మహారాష్ట్ర సహా దేశవ్యాప్తంగా నెలకొన్న కరువుకు సంబంధించినవే కావటం.. ఈ దఫా సమావేశాలు ఎలా జరగబోతున్నాయనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి.రోజుకో మలుపు తిరుగుతున్న ఉత్తరాఖండ్ పరిణామాలపై చర్చను చేపట్టాలంటూ రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత గులామ్ నబీ ఆజాద్, ఉపనేత ఆనంద్ శర్మలు చైర్మన్ కు శుక్రవారమే నోటీసులు ఇచ్చారు. 267వ నిబంధన ప్రకారం చర్చకు అనుమతించాలని కోరినట్లు వారు తెలిపారు. మహారాష్ట్ర సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న కరువు పరిస్థితులను అంచనావేయడంలో, ఉపశమన చర్యలు తీసుకోవడంలో ఎన్డీఏ సర్కారు విఫలమైందని ఆరోపిస్తూ మరికొందరు విపక్ష ఎంపీలు కరువుపై చర్చను కోరుతున్నారు. అయితే బడ్జెట్ సంబంధిత బిల్లుపై చర్చకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తామన్న పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటనతో ప్రభుత్వ తీరు ఎలా ఉండబోతోందో తెలుస్తోంది. కీలకమైన బిల్లులకు అడ్డుపడుతోందని కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. కాగా, ఆదివారంనాటి అఖిలపక్ష భేటీ, సోమవారం ఉదయం జరిగే బీఏసీ సమావేశాల్లో సభ జరగబోయే తీరుతెన్నులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.