రైతులకు మేలు చేసేలా భూ సేకరణ ఉండాలి

3

కేంద్ర ప్రభుత్వానికి సవరణలు ప్రతిపాదించిన ఎంపీ వినోద్‌

న్యూఢిల్లీ,మార్చి9(జనంసాక్షి): భూసేకరణ బిల్లుపై లోక్‌సభలో చర్చ జరిగిన సందర్భంగా టీఆర్‌ఎస్‌ ఎంపి వినోద్‌ సవరణలు కోరుతూ పలు సూచనలు చేశారు. రైతులకు మేలు చేసేలా భూసేకరణ సవరణ బిల్లు ఉండాలని టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ కేందప్రభుత్వానికి సూచించారు. లోక్‌సభ సమావేశాల్లో భాగంగా ఆయన భూసేకరణ బిల్లుకు పలు సవరణలను ప్రతిపాదించారు. ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో ఎన్నో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయని..ఏ కారణాలతో బిల్లును ప్రవేశపెడుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు. భూసేకరణ చట్టంపై చాలా రాష్టాల్రకు అవగాహన లేదని అన్నారు. ఈ చట్టంలో సమస్యలున్నాయని తెలంగాణ రాష్ట్ర సీఎం ఫిర్యాదు చేశారన్నారు. భూ సేకరణ చట్టాన్ని ఎందుకు సవరించాలని అనుకుంటున్నారని వినోద్‌ ప్రశ్నించారు. ఏ ముఖ్యమంత్రి అయినా ప్రస్తుత భూ సేకరణ చట్టం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని ఫిర్యాదు చేశారా అని అడిగారు. ప్రధానంగా సామాజిక ప్రభావ అంచనా క్లాజ్‌ ను, రైతుల అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా ప్రతిపాదిస్తున్నారని ఆయన అన్నారు. ఇందులో ప్రైవేట్‌ కంపెనీ బదులు ఎంటిటి అనిపేర్కొన్నారని,దీని అర్దం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ సవరణ రైతులకు సానుకూలంగా ఉండాలని ఆయన సూచించారు. కొత్తగా చేయదలచిన సవరణలలో భూములు కోల్పోయేవారికి పరిహారంలో అన్యాయం జరిగే అవకాశం ఉందని అన్నారు. ఎపిఐఐసి సేకరించిన భూమిలో వేలాది ఎకరాలు ఖాళీ గా ఉన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

మరోవైపు కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూసేకరణ  బిల్లులో వైఎస్సార్‌ సీపీ తాజాగా కొన్ని సవరణలను ప్రతిపాదించింది. భూసేకరణ చట్టంలో సవరణ బిల్లుపై వైఎస్సార్‌ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు. సాగునీటి వసతి ఉన్న భూములను సేకరణ నుంచి మినహాయించాలని కోరినట్లు ఆయన తెలిపారు. దీంతో పాటు బహుళ పంటలు పండే భూములను బిల్లు నుంచి మినహాంచాలని కోరుతున్నట్లు సుబ్బారెడ్డి పేర్కొన్నారు. బహుళ పంటలు పండే భూములను బిల్లు నుంచి మినహాయించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. దేశంలో ఇలాంటి భూములు కేవలం 10 శాతం మాత్రమే ఉన్నాయని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఆ భూములను సోషల్‌ ఇంపాక్ట్‌ అసెస్‌ మెంట్‌ కు తప్పనిసరి చేయాలన్నారు. సీఆర్డీఏ పేరిట ఇప్పటికే ఏపీ ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కుంటోందన్నారు. దాదాపు 32 వేల ఎకరాలను అక్కడి రైతులకు ఇష్టం లేకుండా తీసుకుంటోందన్నారు. బహుళ పంటలు పండే భూములను కూడా లాక్కోంటుదన్నారు. అభివృద్ధి ద్వారానే దేశంలో పేదరికి అంతం కాగలదని తాము కూడా నమ్ముతున్నట్లు సుబ్బారెడ్డి తెలిపారు. కానీ అభివృద్ధికి, భూయజమానులకు మధ్య సమతుల్యత సాధించాలన్నారు. జీవనోపాధికి ఆధారమైన భూములు సేకరించి.. ఆహార భద్రతకు ముప్పు కల్గించకూడదని ఆయన అన్నారు. ఇక దేశం అంతటా భూ సవిూకరణ విధానం ప్రవేశపెట్టాలని తెలుగుదేశం పార్టీ సలహా ఇచ్చింది.ఆ పార్టీ ఎమ్‌.పి గల్లా జయదేవ్‌ లోక్‌ సభలో భూ సేకరణ బిల్లుపై మాట్లాడుతూ ఎపిలో విజయవంతంగా భూ సవిూకరణ జరిగిందని, దీనివల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంచి పేరు వచ్చిందని ఆయన అన్నారు. దీనివల్ల రైతులకు , ప్రభుత్వానికి ఉపయోగం ఉంటుందని ఆయన అన్నారు. రాజధాని కోసం భూ సవిూకరణ చేసిన విదానాన్ని ఆయన ప్రస్తావించారు.