రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు

4

బ్యాంకులు కరుణించవా?

ప్రధాని మోదీ ఘాటైన వ్యాఖ్యలు

ముంబై,ఏప్రిల్‌2(జనంసాక్షి): ఆర్థిక అభివృద్ధిలో బ్యాంకులదే కీలకపాత్ర అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశ ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని రోడ్‌మ్యాప్‌ రూపొందించాలని ప్రధాని ఆర్‌బీఐకి సూచించారు.  రిజర్వ్‌ బ్యాంకు 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ముంబయిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మన కరెన్సీ నోట్ల ముద్రణకు కాగితం, సిరా మనదేశంలోనే తయారుకావాలని, పేదలకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. జన్‌ధన్‌ యోజన కింద బ్యాంకుల్లో 14వేల కోట్లు జమ అయినట్లు మోదీ తెలిపారు. ఆర్థిక సమ్మిళిత వృద్ధికి ఆర్‌బీఐ 20 ఏళ్లకు మార్గదర్శిని రూపొందించాలని ఆయన సూచించారు. ఒక విద్యాసంస్థ అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి సాధించాలనుకుంటే… ఒక విద్యార్థి విదేశాలకు వెళ్లి చదువుకోవాలని ఆశిస్తే… బ్యాంకులు వారికి సహకరించాలని, ఖర్చు చేసిన ప్రతి పైసాను మన యువత వెనక్కి తెస్తుందని మోదీ నొక్కిచెప్పారు. అప్పుడే మన ఆర్థిక విధానాలు సాధారణ రైతు నుంచి ఉన్నతస్థాయి ఉద్యోగులను తయారుచేసే సంస్థల వరకు అందరి అభివృద్ధిలోనూ కీలక భూమిక పోషిస్తాయన్నారు.

ఆర్థిక అభివృద్ధి కోసం ఆర్‌బీఐ 20 ఏళ్లకు సరిపోయేలా మార్గదర్శిని రూపొందించాలని అధికారులకు సూచించారు. రైతులకు రుణాల మంజూరుతోపాటు రికవరీలో సానుకూలంగా ఉండాలని అధికారులకు సూచించారు.  కార్యక్రమంలో పాల్గొనడానికి మహారాష్ట్ర వచ్చిన ఆయనకు ఆ రాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగరరావు, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌లు స్వాగతం పలికారు. అనంతరం జరిగిన వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండటంలో రిజర్వ్‌ బ్యాంకు పాత్ర కీలకమన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం కావడానికి 2022వరకు ఆర్థిక ప్రణాళికలు ఇవ్వాలని బ్యాంకును ఆయన కోరారు.