రైతుల ఆదాయం పెంచుతాం

5

– ప్రధాని మోదీ

న్యూఢిల్లీ,మార్చి19(జనంసాక్షి): రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని సంకల్పించామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పునరుద్ఘాటించారు. రైతుల ఆదాయం పెంచేలా వ్యవసాయాన్ని ఆధునీకరించడమే లక్ష్యమన్నారు. శనివారం దిల్లీలో నిర్వహించిన కృషీ ఉన్నతి మేళాను ఆయన ప్రారంభించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ.. ‘రైతుల ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు చేపడుతున్నాం. వ్యవసాయ సాంకేతిక సమాచారం అందరికీ చేరవేయాలి. ఎప్పుడైనా ఏదైనా చేయాలనుకుంటే కచ్చితంగా చేస్తాం. మేం చేసిన ప్రతిదాన్ని వాళ్లు చేశామని చెప్తున్నారు. కొన్ని చోట్ల ప్రాజెక్టులు కట్టారు. రైతులకు మాత్రం నీరందలేదు. వేసవిలో నీటి పొదుపు ఎలా అనేది అందరూ ఆలోచించాలి. రైతులు ఆనందంగా ఉండాలంటే నీరు పుష్కలంగా ఉండాలి. రైతుల కష్టాల్లో పాలుపంచుకోవడానికి మేమున్నామని వారికి భరోసా ఇస్తున్నాం’ అని మోదీ స్పష్టం చేశారు. రైతుల అభివృద్ధే ఈ సదస్సు లక్ష్యం. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని రైతులు అభివృద్ధి బాటలో సాగాలని మోదీ పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణలు తీసుకురావాలని శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు. గతంలో యూరియా సబ్సీడీని కంపెనీలే తినేసేవని ఇప్పుడు నేరుగా రైతులకు అవి అందుతున్నాయని గుర్తు చేశారు. ఈ సదస్సులో మూడు రోజుల పాటు వివిధ పథకాలు సాంకేతిక పరిజ్ఞానంపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. ఐదేళ్లలో రైతుల ఆదాయం

రెట్టింపు చేయడం కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.