రైతు భూమిలో సోలార్ పాగా

న్యాయం చేయాలని గిరిజన రైతుల ఆవేదన
శివ్వంపేట సెప్టెంబర్ 22 జనంసాక్షి :
కూటి కోసం కోటి తిప్పల అన్నట్లుగా ఓ గిరిజన కుటుంబం పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్ లోని రామంతాపూర్ ప్రాంతానికి బ్రతుకుతెరువు కోసం వలస వెళ్ళింది.  ఇదే అదునుగా భావించిన కొందరు పెద్దలు ఆ పేద గిరిజన రైతుకు చెందిన  భూమీ లో అక్రమంగా సోలార్ విద్యుత్ ప్లాంట్ నిర్మించారు. మేము ఎవరూ లేనిది చూసి మా భూమిలో సోలార్ విద్యుత్ ప్లాంట్ ను ఎలా ఏర్పాటు చేశారని విలపిస్తూ గురువారం కొత్తపేట సోలార్ సబ్ స్టేషన్ వద్ద గిరిజన రైతులు ఆందోళన చేపట్టారు. మండలంలోని లింగోజీగూడ తాండాకు చెందిన నేనావత్ గోవింద్ నాయక్, నేనావత్ తులసీరామ్  నాయక్ ఇద్దరి అన్నదమ్ములకు కొత్తపేట గ్రామ  శివారులోని సర్వే నెంబర్ 480/చ1 లో కొత్తపేట చౌరస్తా వద్ద గల వ్యవసాయ భూములను సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుండగా గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అప్పటి నర్సాపూర్ ఎమ్మేల్యే చిలుముల విఠల్ రెడ్డి ఆదేశాల మేరకు అందులో 20 గుంటల భూమిని విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం కోసం గిరిజన రైతులు విరాళంగా ఇచ్చారు. దానం గా ఇచ్చిన భూమికి ప్రభుత్వం నుండి మాకు ఎలాంటి పరిహారం అందలేదని, మిగతా భూమి నేనావత్ గోవింద్, తులసిరామ్ పిల్లల స్వాధీనములోనే ఉన్నాయన్నారు. ఇదిలా ఉండగా కుటుంబ పోషణ నిమిత్తం హైదరాబాద్ రామంతాపూర్ కు వలస వెళ్లగా,ఇదే అదునుగా భావించిన ఆక్రమణదారులు భూమిని విరాళంగా ఇచ్చిన రైతులకు తెలియకుండా కొత్తపేట విద్యుత్ సబ్ స్టేషన్ ఆనుకుని సోలార్ విద్యుత్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న బాధిత రైతులు సోలార్ ప్లాంట్ ఇంచార్జీ యుగెందర్ వద్దకు వెళ్లి మాపేదల భూములలో మాకు తెలియకుండా సోలార్ ప్లాంట్ ను ఏవిధంగా ఏర్పాటు చేశారని ప్రశ్నించగా మీకూ రెండు మూడు రోజులలో అన్ని విషయాలు చెప్తామని కాలం వెళ్లదీస్తూ పొంతన లేని సమాధానాలు చెపుతున్నారని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఇప్పటికైనా జిల్లా ఉన్నతధికారులు వెంటనే స్పందించి  మా భూమి లో అక్రమంగా నిర్మించిన సోలార్ విద్యుత్ ప్లాంట్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోని పెదలమైన మాకు తగిన న్యాయం చేయాలని గిరిజన రైతులు కోరారు. ఈ ఆందోళన కార్యక్రమంలో గిరిజన రైతులు నేనావత్ దుర్గమ్మ, నేనావత్ మిట్యా నాయక్, నేనావత్ భి క్య నాయక్, నేనావత్ రాజు నాయక్, గోపాల్ నాయక్, లక్ష్మీ, లీలా, సుశీల, తదితరులు పాల్గొన్నారు.
Attachments area