రైతు సంక్షేమంలో ముందడుగు
శ్రీకాకుళం, జూలై 7 : రైతు సంక్షేమం విషయంలో ఇతర రాష్ట్రాల కంటే మన రాష్ట్రం కొంత ముందడుగు వేసిందని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖమంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. సంతబొమ్మాళి మండలంలోని దండుగోపాలపురంలో 16 లక్షల వ్యయంతో నిర్మించిన రక్షిత మంచినీటి పథకం, నౌపాడలో 31.5లక్షల వ్యయంతో ఆర్‌ఎంఎస్‌ఎ పథకంలో నిర్మించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనాల సముదాయం, 85 లక్షల ఆర్‌డిఎఫ్ నిధులతో నిర్మించిన చిన్నమర్రిపాడు-లఖిదాస్‌పురం తారు రోడ్డును ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎంపి కృపారాణి, టెక్కలి ఎమ్మెల్యే కె.భారతి పాల్గొన్నారు. ఈస్ట్‌కోస్ట్ థర్మల్ విద్యుత్ కేంద్ర నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గత 691 రోజులుగా మత్స్యకారులు రిలే నిరాహారదీక్షలు చేస్తున్నా వడ్డీతాండ్ర కూడలి మీదుగా మంత్రి ధర్మాన పర్యటించారు. దీంతో థర్మల్ వ్యతిరేకులు అడ్డుకుంటారేమోనని భావించిన పోలీసు యంత్రాంగం పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరింపచేసింది. కాశిబుగ్గ డిఎస్పీ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా థర్మల్ వ్యతిరేకుల జాడ కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా నౌపాడ పాఠశాలలో జరిగిన బహిరంగ సభలో మంత్రి ధర్మాన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ విశ్వప్రసాద్, డిసిఎంఎస్ చైర్మన్ జి.కృష్ణ, ఎస్సీ కార్పొరేషన్ ఇఇ ఎం.జగ్గారావు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కె.మధుసూదనరావు, తహశీల్దార్ శ్రీనివాసరావు, ఎంపిడిఓ లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు.