రోజాకు ఓ అవకాశం ఇవ్వండి

3

– సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 21(జనంసాక్షి):  ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో తాను చేసిన వ్యాఖ్యలు, అనంతరం దారితీసిన పరిణామాలపై వైకాపా ఎమ్మెల్యే రోజా శుక్రవారం సుప్రీంకోర్టుకు వివరణ పత్రం సమర్పించారు. శాసనసభలో తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లుగా లేఖలో రోజా పేర్కొన్నారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం వివరణ పత్రాన్ని అసెంబ్లీ కార్యదర్శికి పంపాలని సూచించింది. అసెంబ్లీ నిబంధనల ప్రకారం అంశాన్ని పరిగణనలోకి తీసుకుని రోజా వివరణ ఇచ్చేందుకు, క్షమాపణ చెప్పేందుకు అనుమతించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. శాసనసభ ఎప్పుడు ప్రారంభమైతే అప్పుడు రోజా లేఖను పరిగణనలోకి తీసుకుని ఈ అంశానికి ముగింపు పలకాలని సుప్రీంకోర్టు సూచించింది. తదుపరి విచారణను ఆగస్టు నెలాఖరుకు వాయిదా వేసింది.  దీంతో  ఎమ్మెల్యే రోజాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రోజా

ఇచ్చిన వివరణ లేఖను పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. స్పీకర్‌ కు ఈ లేఖ అందజేయాలని ప్రభుత్వ తరుపు న్యాయవాదికి ఆదేశించింది. రెగ్యులర్‌ సెషన్స్‌ లో లేదా ప్రత్యేక సెషన్స్‌ లో ఆర్కే రోజా వివరణ లేఖపై నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. శాసన సభ వ్యవహారాలకు కూడా రోజాను అనుమతించాలని ఆదేశించింది. ఎనిమిది వారాల్లోగా రోజా వివరణ లేఖపై నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. రోజా లేఖపై స్పీకర్‌ నిర్ణయం తీసుకోకుంటే మాత్రం తాము మరోసారి విచారణ చేపడతామని స్పష్టం చేసింది. శాసనసభా పక్ష కార్యాలయంలోకి రోజాను అనుమతించాలని ఆదేశించింది. ఎల్పీ కార్యాలయంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కూడా అనుమతిచ్చింది. అంతేకాకుండా.. చిన్న సమస్యను పెద్దదిగా చేయవద్దని.. సామరస్యంగా పరిష్కరించుకోవాలని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినట్లు సమచారం. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసిన సుప్రీంకోర్టు కేసు తదుపరి విచారణను ఆగస్టు తొలివారానికి వాయిదా వేసింది