రోడ్డేస్తారా.. అయితేనే ఓటేస్తాం

పలు జిల్లాల్లో కనీస మౌలిక వసతుల కోసం డిమాండ్లు
ఓటేయకుండా ధర్నాలు, రహదారులపై బైఠాయింపులు
తాగునీరు, విద్యుత్‌ సౌకర్యం లేదని నిరసనలు
ధాన్యం కొంటేనే ఓటేస్తామని భీష్మించిన అన్నదాతలు
కనీస వసతుల కోసం ఓటర్లు భీష్మించారు. పోలింగ్‌ బూతులకు రాకుండా రహదారులపై ఆందోళనకు దిగారు. రోడ్డు కావాలంటూ ఒకచోట.. నీళ్లు, కరెంట్‌ కావాలని మరోచోట.. ఇతర పలు సమస్యలు పరిష్కరించాలని ఇంకోచోట స్థానికులు డిమాండ్లు వినిపించారు. ఏండ్ల తరబడి తిప్పలు పడుతున్నా పట్టించుకోకపోవడంతో ఆగ్రహం చెంది, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటు వేయకుండా నిరసన గళం వినిపించారు.
జనంసాక్షి నెట్‌వర్క్‌, మే 13 (హైదరాబాద్‌)
ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం బావోజిపేటలో గ్రామస్తులు ఓటింగ్‌ను బహిష్కరించడంతో ఓటింగ్‌ నిలిచిపోయింది. గ్రామానికి చేరుకునేందుకు రోడ్డు వేయాలని డిమాండ్‌ చేయాలని, త్రీ ఫేజ్‌ విద్యుత్‌ సరఫరా చేయాలని కోరుతున్నారు. ఇక ఓటింగ్‌ బహిష్కరించిన గ్రామస్తులతో చర్చించేందుకు అధికారులు రంగంలోకి దిగి.. వారితో చర్చలు జరిపారు. కొమురంభీం ఆసిపాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ మండలం జగన్నాథపూర్‌ గ్రామ పంచాయితీ పరిధి బొరిగా గ్రామస్తులు ఓటింగ్‌ను బహిష్కరించారు. ప్రభుత్వాలు మారిన తమ సమస్యలు మాత్రమే అలానే ఉంటున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి కనీసం రోడ్డు సౌకర్యం లేదంటూ పోలింగ్‌ను బహిష్కరించారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ నియోజకవర్గం కొత్తూరు మండలంలోని కొడిచెర్ల గ్రామతాండ వాసులు ఎన్నికలను బహిష్కరించారు. తమకు ప్రత్యేక పోలింగ్‌ బూత్‌ ఏర్పాటు చేయాలని గతంలో చెప్పినా అధికారులు వినిపించుకోకపోవడంతో ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు తండావాసులు రోడ్డుపై బైఠాయించారు. కొత్తూరు తహసీల్దార్‌ రవీందర్‌రెడ్డి తన సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకుని తండావాసులతో మాట్లాడి శాంతింపజేశారు.
వంతెన వేయాలని.. మైనింగ్‌ ఆపాలని
ఎన్‌ఎస్పీ కాలువపై వంతెన నిర్మించాలని ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలోని రాయమాదారం గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించారు. నాగర్‌కర్నూలు పార్లమెంట్‌ పరిధిలో బల్మూర్‌ మండలం మైలారం గ్రామస్థులు మైనింగ్‌కు అనుమతులు రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఓటింగ్‌ను బహిష్కరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లందు మండలం కొమ్ముగూడెం తండా వాసులు సాగు, తాగునీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు పట్టించుకోవడంలేదని ఓటింగ్‌ స్లిప్పులు చూపుతూ నిరసన తెలిపారు. అలాగే కొల్లాపూర్‌ మండలం చెంచుగూడెంలో నాలుగు రోజులుగా విద్యుత్‌ రావడంలేదంటూ ఓటింగ్‌ను బహిష్కరించారు గిరిజనులు. తమ కాలనీకి విద్యుత్‌ సమస్యను పరిష్కరిస్తేనే ఓటు వేస్తామని, తాగునీరు కూడా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. అటవీప్రాంతం కావడంతో ఫారెస్ట్‌ అధికారులు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఆరోపించారు. అధికారులు తమ సమస్యలను పరిష్కరించే వరకు ఓటు హక్కు వినియోగించుకోమంటూ తేల్చిచెప్పారు. మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఎదిర గ్రామంలో ప్రజలు పార్లమెంట్‌ ఎన్నికలను బహిష్కరించారు. ఇప్పటివరకు గ్రామస్థులు పోలింగ్‌ బూత్కు వెళ్లి ఒక్క ఓటు కూడా వెయ్య లేదు. గత రెండు నెలల నుంచి గ్రామస్తులు అమర్‌ రాజా కంపెనీకి వ్యతిరేకంగా ధర్నాలు నిర్వహించిన, అధికారులు స్పందించకపోవడంతో ఎన్నికలను బహిష్కరించామని పలువురు పెద్దలు తెలిపారు. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
ధాన్యం కొనాలని అన్నదాతలు…
యాదాద్రి జిల్లా భూదాన్‌ పోచంపల్లి మండంలోని కనుముక్కల గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆదివారం కురిసిన అకాల వర్షం వల్ల తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ పోలింగ్‌ కేంద్రం వద్దే తడిచిన ధాన్యం బస్తాలతో రైతుల ధర్నాకు దిగారు. తడిచిన ధాన్యం కొనుగోలుపై తమకు స్పష్టమైన హామీ ఇస్తేనే ఓటు వేస్తామని పోలింగ్‌ కేంద్రం వద్ద నిరసన చేపట్టారు. లేదంటే అప్పటివరకు ఓటు వేయమని గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించారు. దీంతో కనుముక్కల గ్రామంలో హై టెన్షన్‌ వాతావరణం నెలకొంది. రైతుల ధర్నాతో అప్రమత్తమైన పోలీసులు.. భారీగా భద్రతను పెంచారు.