రోమ్‌ క్వార్టర్స్‌లో సానియా జోడీ

రోమ్‌ ,మే 16 :ఫ్రెంచ్‌ ఓపెన్‌కు ముందు ఫామ్‌లోకి రావాలనుకుంటోన్న హైదరాబాదీ టెన్నిస్‌ తార సానియావిూర్జా మెరుగైన ప్రదర్శనే కనబరుస్తోంది. తాజాగా రోమ్‌ టెన్నిస్‌ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్‌ వరకూ చేరుకుంది. అమెరికా క్రీడాకారిణి బెథానీ మాటెక్‌ సాండ్స్‌తో జత కట్టిన సానియా రెండో రౌండ్‌లో 6-4 , 6-3 స్కోర్‌తో ఫ్రాన్సిస్‌ షివోన్‌ , సమంతా స్టోసర్‌ జంటపై విజయం సాధించింది. గంటా 13 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో ఇండో-అమెరికన్‌ పెయిర్‌ పూర్తి ఆధిపత్యం కనబరిచింది. అటు సమంతా – షివోన్‌ జోడీకి పలుసార్లు బ్రేక్‌ చేసే అవకాశమొచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. కాగా సానియా-బెథానీ జోడీ క్వార్టర్‌ ఫైనల్‌లో టాప్‌ సీడ్‌ సారా ఇరానీ , రాబర్టా విన్సీ జంటతో తలపడనుంది.