రౖౖెతులను సరైనరీతిలో ఆదుకోవాలి
కుండపోతగా కురుస్తున్న అకాల వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా పెద్దయెత్తున రైతులకు అపార నష్టం వాటిల్లింది. పంఠ నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అకాల వర్షాలతో ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయానికి నాశనమైపోవటంతో రైతులు నట్టేట మునిగారు. చేసిన అప్పులు తీర్చలేమనే బెంగతో కొంత మంది మృత్యువాతపడ్డారు. ప్రభుత్వం తగు రీతిలో ఆదుకోకుంటే మాత్రం ఆత్మహత్యల పరంపర కొనసాగే ప్రమాదముంది. అకాల వర్షాలకు తెలంగాణలోని పది జిల్లాల్లో మిర్చి, వరి, మొక్కజొన్న, పత్తి,పసుపు, మామిడి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 70 వేల ఎకరాలకు పైగా పంట నష్టం వాటిల్లిందని అధికారిక లెక్కలు చెప్తున్నాయి. అయితే సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రైతాంగానికి ఏనాడు పంటనష్టానికి తగు పరిహారం అందిన పాపాన పోలేదు. ఇప్పుడు స్వరాష్ట్రంలోనైనా తమను ప్రభుత్వం కష్టాల్లోంచి గట్టెక్కిస్తుందని రైతాంగం కోటి ఆశలు పెట్టుకుంది. ఇటీవలే ప్రదాని మోదీ రైతులకు వరాల జల్లు కురిపించిన నేపథ్యంలో ఆన్నదాతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే ప్రధాని మోదీ అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారాన్ని 50శాతం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ప్రకటించారు. అంతేకాకుండా రైతులకు నష్టపరిహారం చెల్లించడానికి 50శాతం పంట నష్టపోయి ఉండాలన్న నిబంధనను సైతం 33శాతానికి తగ్గించామని, ఎక్కువమంది రైతులు నష్టపోయిన పంటకు మెరుగైన పరిహారాన్ని పొందడానికి ఇది తోడ్పడుతుందని ఆయన చెప్పారు. అయితే రైతన్నల విషయంలో ప్రభుత్వ యంత్రాంగం మాత్రం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోంది. దీనికి గతంలో జరిగిన ఎన్నో ఉదాహరణలు చెప్పొచ్చు. గతంలో పలుమార్లు అధికారులు సకాలంలో స్పందించకపోవడంతో కేంద్రం విడుదల చేసిన నిధులు క్షేత్రస్థాయిలో రైతన్నలకు చేరకుండానే వెనక్కు వెళ్లిన దుస్థితి దాపురించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక పంట నష్టపోయిన రైతులకు బీమా సౌకర్యం ఉన్నా క్లెయిములపై సకాలంలో స్పందించకపోవటంతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ ఇటీవలే పంట నష్టపోయి కష్టాల్లోవున్న రైతుల క్లెయిమ్‌లను సత్వరం పరిష్కరించాలని బీమా సంస్థలను ఆదేశించారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఇటీవల కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానల కారణంగా పంటలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయమని ఇంతకుముందు కేంద్రమంత్రులను కోరిన ప్రధాని మంత్రులతో సమావేశమై సవిూక్షించిన తర్వాత రైతులకు ఉదారంగా సహాయం అందించాలని నిర్ణయం తీసుకున్నారు. రైతులకు సాయం అదించడం కోసం పరిమితిని రెట్టింపు చేశారు. రైతుకు చెల్లించే పరిహారాన్ని ఒకటిన్నర రెట్లు పెంచారు. ఉదాహరణకు గతంలో వంద రూపాయల పరహారం పొందితే ఇప్పుడు 150 రూపాయలు లభిస్తుంది. ఒకవేళ అది లక్ష రూపాయలుంటే ఇప్పుడు లక్షన్నర లభిస్తుంది. అంటే 50శాతం పెంచారు. పంట దెబ్బతిన్న రైతుల రుణాలను పునర్వ్యవస్థీకరించాలని బ్యాంకులను ఆదేశించారు. వారి క్లెయిమ్‌లను సత్వరం పరిష్కరించాలని బీమా కంపెనీలను ఆదేశించారు. కష్టాల్లో ఉన్న రైతుల రుణాలను పునర్వ్యవస్థీకరించాలని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ కూడా బ్యాంకులకు ఆదేశించారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది తక్కువ వర్షాల కారణంగా పంట దెబ్బతింటే ఈ ఏడాది అకాల వర్షాలు, వడగండ్ల వానల కారణంగా నష్టం జరిగింది. ఖజానాకు భారమైనా రైతులను ఆదుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేస్తున్నా అధికారులు, బ్యాంకర్లు రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తునే ఉన్నారు. రైతులకు ప్రభుత్వం అందజేసే పంట నష్టపరిహారం వారికి సక్రమంగా అందడం లేదు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులు తిరిగి ఖజానాకే వెళ్లిపోతున్నాయి. నిధులు బ్యాంకు ల నుంచి అధికారులకు చేరుతున్నాయి. కానీ రైతులకు మాత్రం సరిగ్గా అందడం లేదు. అసలు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం రావడమే గగనమైతే వచ్చిన దానిని కూడా అధికారులు రైతులకు సకాలంలో చెల్లించకుండానిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు ఈ కింది సంఘటనలే నిదర్శనం. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాలో 2011లో నీలం తుపాను వల్ల చాలా వరకు పంటలు పోయూరు?. దీంతో ప్రభుత్వం 2,600 మంది రైతులకు పరిహారం కింద రూ.13. 50 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులు అదే ఏడాది అక్టోబర్‌లో విడుదలయ్యూయి. అధికారులు ఇందులో రూ.12.44 కోట్లను డ్రా చేసి, బ్యాంకులకు పంపించారు. అయితే అప్పటికే సమయం మించిపోయింది. వీటిని లబ్ధిదారులకు అందించాలంటే ఆన్లైన్లో ఇవ్వాలి. కానీ ఆన్లైన్ చేయడానికి రైతులను గుర్తించడంలో జరిగిన జాప్యం వల్ల నిధులు తిరిగి వెళ్లిపోయాయి. తరవాత రైతుల బ్యాంకు అకౌంట్ల జాబితాలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలపడంతో మళ్లీ మంజూరు చేశారు. వాటిలో కొన్ని అకౌంట్లకు పరిహారాలను జమ చేసిన యంత్రాంగం, మరికొన్ని అకౌంట్లు దొరకలేదన్న కారణంగా కొన్ని నిధులు పక్కన పెట్టేశారు. దీంతో అకౌంటు నంబర్లు ఇవ్వలేదన్న సాకుతో బ్యాంకర్లు కొంత నగదును తిరిగి వ్యవసాయాధికారులకు పంపించేశారు. ఇలా రూ.1.44 కోట్లు మళ్లీ అధికారుల వద్దకు చేరాయి. రైతుల అకౌంట్లను సరిచేసి మళ్లీ వీటిని 2013లో మార్చిలో పంపించారు. అయితే ఇందులో కూడా రూ. 29.73 లక్షలు వెనక్కి వచ్చేశాయి. అలాగే అధిక వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు 2013 జూలైలో కూడా రూ. 3.74 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో కూడా రూ.48.45 లక్షలు వెనక్కి మళ్లిపోయాయి. బ్యాంకులకు రైతుల ఖాతాల నంబర్లు ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. తరవాత ఖాతా నంబర్లు సరిచేసి అధికారులు పంపించారు. అయినా 17.97లక్షల రూపాయలు తిరిగి వచ్చేశాయి. దీంతో అధికారులు ఇప్పుడు మళ్లీ రైతుల ఖాతా నంబర్లు సేకరించే పనిలో పడ్డారు. మరికొద్ది రోజుల్లో ఆయా రైతులకు పరిహారం చెల్లిస్తామని చెబుతున్నారు. ఖాతా నంబర్లు తీసుకుని బ్యాంకులకు ఇవ్వడంలో వ్యవసాయాధికారులు నిర్లక్ష్యం వహిస్తుండడం వల్లే తమకు నష్టపరిహారం అందడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. ఒక వైపు ప్రకృతి వైపరీత్యాల కారణంగా తీవ్రంగా నష్టపోతుండగా, ఇంకో వైపు అధికారుల నిర్లక్ష్యంతో ఇబ్బందులకు గురవుతున్నామని, ప్రభుత్వం పరిహారం మంజూరు చేసిన సంవత్సరం తరవాత కూడా సొమ్ము తమ ఖాతాల్లో జమకావడం లేదని వారు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా విడుదలవుతున్న పరిహారం సక్రమంగా పంపిణీ జరిగే అవకాశం ఉందా అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక బీమా ప్రీమియం చెల్లింపునకు జాతీయ వ్యవసాయ బీమా సంస్థ ఈనెల 31ని గడువుగా విధించింది. బ్యాంకర్లు పంట రుణం ఇచ్చే సమయంలోనే రైతుల నుంచి బీమా ప్రీమియం కట్టించుకోవడం రివాజు. ఈ ఏడాది పంట రుణాలు మంజూరు చేయకపోవడంతో ఏ ఒక్క రైతు బీమా ప్రీమియం చెల్లించలేకపోయారు. దీంతో వాతావరణ బీ మా పథకం రైతులకు అందకుండా పోయింది. కరవు ఉరుముతుండటంతో పంట నష్ట పరిహారం చెల్లించేదెవరని రైతులు ఆందోళన చెందుతున్నారు. బీమా విధానంలో కూడా సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. నష్టపోయిన పంటలో కేవలం కొంత మేరకు మాత్రమే కాకుండా పూర్తిస్థాయిలో పంటనష్ట పరిహారం అందించాలి. అంతేకాక బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లించి రైతన్నను ఆదుకోవాలి. అప్పుడే అన్నదాతకు మేలు జరుగుతుంది. లేకుంటే ఆత్మహత్యలు మరింత పెరిగిపోయే ప్రమాదముంది.