లంకతో నాలుగు కీలక ఒప్పందాలు

2

వీసా ఆన్‌ అరైవల్‌ సదుపాయం

శ్రీలంక అభివృద్ధికి చేయూత

జాలర్ల సమస్యలపై చర్చలు

ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం

ప్రధాని నరేంద్ర మోడీ

కొలంబో,మార్చి13 పొరుగు దేశాలతో ఎప్పుడూ సత్సంబంధాలను మెరుగుపరుచుకుంటామని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తమకు స్నేహసంబధాలు ముఖ్యమని అన్నారు. శ్రీలంక పర్యటనలో ఉన్న మోదీ కొలంబోలో ఆ దేశ పార్లమెంట్‌నుద్దేశించి ప్రసంగించారు. శ్రీలంక ప్రజలకు తమిళంలో ధన్యవాదాలు తెలిపారు. తాను ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు దక్షిణాసియా దేశాల నేతలను ఆహ్వానించినట్లు గుర్తుచేశారు. తమకు నిరంతర మిత్రదేశంగా ఉన్న శ్రీలంక అత్యంత ఆప్తమైన దేశమన్నారు. ఈ రెండు దేశాల మధ్య సారూప్యతలు ఉన్నాయని వెల్లడించారు. భారత్‌ పొరుగు దేశాలు కూడా అభివృద్ది చెందాలని కోరుకుంటోందన్నారు. శ్రీలంక వివిధ రంగాల్లో అభివృద్దికి భారత్‌ చేయూతను ఇస్తుందన్నారు. ఇదిలావుంటే భారత్‌ – శ్రీలంక మధ్య నాలుగు కీలక ఒప్పందాలు కుదిరాయి. లంక వాసులకు వీసా ఆన్‌ అరైవల్‌ సదుపాయం కల్పిస్తున్నట్లు భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. జాఫ్నాలో మోదీ శనివారం పర్యటించనున్నారు. 28 ఏళ్ల తర్వాత తొలిసారిగా భారత ప్రధాని నరేంద్రమోదీ శ్రీలంకలో అడుగుపెట్టారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం మారిషస్‌ నుంచి కొలంబో విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి ఆ దేశ ప్రధాని విక్రమసింఘే ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి మోదీ నేరుగా అధ్యక్ష భవనానికి చేరుకున్నారు. అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన ఆయనను సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మోదీ సైనిక వందనం స్వీకరించారు. తర్వాత ఇరు దేశాధినేతల మద్య కీలక చర్చలు జరిగాయి. ప్రధానంగా జాలర్ల సమస్యపై లంక అధ్యక్షుడు సిరిసేనతో మోదీ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా శ్రీలంకతో భారత్‌ నాలుగు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. రెండు దేశాల ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం నరేంద్రమోదీ విూడియాతో మాట్లాడుతూ రెండు దేశాల సంబంధాల్లో ప్రజలదే కీలక పాత్ర అని అన్నారు. ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాల బలోపేతానికి, పర్యాటక అభివృద్దికి అనేక చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు. శ్రీలంక వాసులకు టూరిస్ట్‌ వీసా ఆన్‌ అరైవల్‌ అవకాశాన్ని ప్రవేశపెడుతున్నామని మోదీ చెప్పారు. తమిళ నూతన సంవత్సరం ఏప్రిల్‌ 14 నుంచి దాన్ని అమలులోకి తెస్తామని ఆయన స్పష్టం చేశారు. కొంత కాలంగా చైనాతో శ్రీలంక సన్నిహితంగా ఉంటోంది. డ్రాగన్‌ దేశ ప్రాభల్యం తగ్గించడం, శ్రీలంకను భారత్‌కు అనుకూలంగా మార్చుకోవడమే లక్ష్యంగా మోదీ పర్యటన కొనసాగుతోంది. శ్రీలంకలో తమిళులు అధికంగా ఉన్న జాఫ్నాలోనూ మోదీ పర్యటించనున్నారు.  సంబంధాలు పునరుద్దరించే కార్యక్రమంలో భాగంగా వీసా నిబంధనలు మరింత సరళతరం చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. ఇరుదేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో భాగంగా శ్రీలంక రైల్వేల్లో పెట్టుబడులు పెట్టడం. కొత్త విమానాలు నడిపేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు.