లంచం వద్దన్నడు.. సీఎం అభినందించిండు!
హైదరాబాద్, మార్చి1(జనంసాక్షి): అవినీతికి వ్యతిరేకంగా నగర పోలీసులు చేస్తున్న సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయనే దానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచాడు ఓ కానిస్టేబుల్. పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌కు వెళ్లిన స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ స్వచ్చందంగా కొంత డబ్బును ప్రతిఫలంగా ఇవ్వజూపిన దరఖాస్తుదారుడితో సున్నితంగా తిరస్కరించి పోలీసులందరికి ఆదర్శంగా నిలిచాడు. ఆ కానిస్టేబుల్ విషయాన్ని తెలుసుకున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అతన్ని క్యాంపు కార్యాలయానికి పిలిపించుకొని అభినందించడంతో పాటు పోలీసులు, ప్రభుత్వ గౌరవాన్ని కాపాడావంటూ ప్రశంసల జల్లులో ముంచెత్తారు.
వెస్ట్‌జోన్ స్పెషల్ బ్రాంచికి జూబ్లిహిల్స్ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ జి.నారాయణరావు తన విధి నిర్వహణలో భాగంగా పాస్‌పోర్టు వెరిఫికేషన్ కోసం జూబ్లిహిల్స్ రోడ్ నెం. 10 సి లోని ఓ దరఖాస్తుదారుడి ఇంటికి శనివారం ఉదయం వెళ్లాడు. దరఖాస్తుదారుడి వివరాలను సేకరించిన అనంతరం ఇంటి పక్కన ఉండే వారిని సైతం వివరాలను అడిగి తెలుసుకున్నారు. పని పూర్తి చేసుకున్న అనంతరం తిరిగి వెళ్తున్న నారాయణరావును దరఖాస్తుదారు తండ్రి ఆపి కొంత మొత్తాన్ని టిప్‌గా ఇవ్వడానికి ప్రయత్నించారు. అయితే దానిని సున్నితంగా తిరస్కరించాడు. అయినప్పటికి మరికొంత మొత్తాన్ని ఇవ్వబోగా ”మా జీతాలను ముఖ్యమంత్రి గారు పెద్ద మొత్తంలొ పెంచారు. మా బాగోగులను మంచిగా చూస్తున్నారు. కాబట్టి మాకు విూరిచ్చే డబ్బు అవసరం లేదు” అనడంతో ఆశ్చర్యానికి గురవుతూ కానిస్టేబుల్‌ను ప్రశంసించారు. దాంతో అక్కడి నుంచి నారాయణ్‌రావు వెళ్లిపోయాడు. కాగా సదరు వ్యక్తి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసిఆర్‌కు ఫోన్ చేసి చెప్పి విూ పోలీసులు చాలా నిజాయితీగా పనిచేస్తున్నారు. డబ్బులు తీసుకోవాలని బలవంతం చేసినా తీసుకోలేదని చెప్పారు. దాంతో ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి కేసిఆర్ కానిస్టేబుల్ నారాయణ్‌రావును తమ క్యాంప్ ఆఫీసుకు పిలిపించి నగర పోలీస్ కవిూషనర్ మహేందర్‌రెడ్డి, ఎస్‌బీ జాయింట్ కవిూషనర్ నాగిరెడ్డి, అడీషినల్ డిసిపి స్పెషల్ బ్రాంచ్ గోవర్దన్‌రెడ్డి, వెస్ట్ జోన్ స్పెషల్ బ్రాంచ్ ఏసిసీ కె.ప్రసాద్, ఇన్‌స్పెక్టర్ సంతోష్‌కిరణ్‌ల సమక్షంలో ప్రశంసించారు.
నిజాయితీగా వ్యవహరిస్తూ పోలీస్ శాఖకు గౌరవం దక్కేలా విధి నిర్వహణ చేసావంటూ అక్కడే ఉన్న మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ కె.కేశవరావులకు కూడా కానిస్టేబుల్ నిజాయితీని వివరించారు. తమ ప్రభుత్వం పోలీసుల పనితీరు మెరుగుపరిచేందుకు చేపడుతున్న చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయనే విషయం ఈ సంఘటన ద్వారా బయట పడిందని పోలీసులందరూ కానిస్టేబుల్ నారాయణరావును ఆదర్శంగా తీసుకుని నిజాయితీగా విధి నిర్వహణ చేయాలని సూచించారు.