లక్ష కోట్లపై బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం

4

నేడు పూర్తిస్థాయి బడ్జెట్‌

మిషన్‌ కాకతీయ, వాటర్‌ గ్రిడ్‌

వైద్య విద్య ప్రాధాన్యత అంశాలు

నేడు సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌

హైదారబాద్‌,మార్చి10(జనంసాక్షి): ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ ప్రతిపాదించిన బడ్జెట్‌కు తెలంగాణ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో సిఎం కెసిఆర్‌ నాయకత్వంలో ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్‌ మొట్టమొదటి పూర్తి స్థాయి వార్షిక బ్జడెట్‌ను బుధవారం  శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ సమర్పిస్తారు. అనంతరం సభ వాయిదా పడుతుంది.  ఇప్పటికే వివిధ శాఖలతో కసతరత్తు చేసిన తరవాత అంచనాలు రూపొందించారు. అలాగే సిఎం కూడా గత బడ్జెట్‌లకు భిన్నంగా ఉండేలా చొరవ తీసుకున్నట్లు ఆయన ఇటీవలి వ్యాఖ్యల వల్ల తెలుస్తోంది. ఇప్పటి వరకు చేపట్టిన వివిధ పథకాలు, ప్రకటించిన కార్యక్రమాలకు పెద్దపీట వేయబోతున్నట్లు సమాచరం. మిషన్‌ కాకతీయ, వాటర్‌ గ్రిడ్‌, కెజిటూ పిజి, గృహనిర్మాణం, శాంతిభద్రతలకు ప్రాధాన్యం పెరిగే అవకాశం ఉంది. సిఎం కెసిఆర్‌ ప్రతిష్టాత్మకంగా బావిస్తున్న వివిధ పథకాలకు నిధుల కేటాయింపు ఉండడం ఖాయంగా ఉంది. అలాగే యాదగిరిగుట్ట అభివృద్ది, గోదావరి పుష్కరాలకు సైతం నిధులు పెరిగే ఛాన్స్‌ ఉంది.

తెలంగాణ అభివృద్ధి, ఇక్కడి ప్రజానీకం సంక్షేమమే ధ్యేయంగా దాదాపు లక్ష కోట్ల రూపాయల కేటాయింపులతో వార్షి బ్జడెట్‌ రూపొందించినట్లు సమాచారం. మంతరివర్గం లాంఛనంగా సమావేవమై ఆమోద ముద్ర వేయడం కూడా లాంఛనమే. మునుపెన్నడూ లేనివిధంగా వేతనాల్లో 43శాతం మేర పెంపు ఉండబోతున్నందున భారం కూడా పెరగబోతున్నది. తెలంగాణ ప్రజల  ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చి, వారి నమ్మకాన్ని నిలబెట్టేందుకు బడ్జెట్‌ కేటాయింపులు దిక్సూచి కాబోతున్నాయి. సొంత రాబడులపై సర్కారుకు ఇప్పుడు పూర్తి అవగాహన ఏర్పడింది. అందువల్ల ఇంతకు ముందులాగా ఏదో వూహించి అంచనాలు వేయాల్సిన అవసరం ఇప్పుడు లేదు. కేందప్రభుత్వ బ్జడెట్‌, 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు కూడా వెలువడటంతో తెలంగాణకు కేంద్రం నుంచి అందే వాటాలు ఏ మేరకు ఉంటాయనేది స్పష్టమైంది. అందువల్ల కేంద్రం నుంచి అందే కచ్చితమైన మొత్తాలనే బ్జడెట్లో పొందుపర్చుకోవచ్చు. అన్నింటికీ మించి తెలంగాణ రెవెన్యూ మిగులుతో ఉండే రాష్ట్రంగా 14వ ఆర్థిక సంఘం లెక్కగట్టింది. తెలంగాణ ధనిక రాష్ట్రమేనని ముఖ్యమంత్రి స్పష్టీకరించినందున మరీ పన్నుల బాదుడుకు దిగకుండా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. బంగారంపై ఒక శాతం మేర ఉన్న వ్యాట్‌ను ఇంకా పెంచే యోచనలో ఉంది. మరి కొన్నింటిపైనా పన్నులు పెంచాలనుకుంటోంది. రెడీమేడ్‌ దుస్తులపై అయిదుశాతం వ్యాట్‌ ఉన్నప్పటికీ, దాన్ని వ్యాపారులు సక్రమంగా కట్టటంలేదు.

బ్జడెట్లో జలజాలం, చెరువుల పునరుద్ధరణ వంటి వినూత్న పథకాలకు ప్రభుత్వం భారీగానే నిధులు కేటాయించనున్నది. రోడ్ల నిర్మాణం, ఎస్సీ, ఎస్టీ సంక్షేమం వంటివాటికీ బాగా నిధులిస్తోంది. విద్య, వైద్యం ఎంతగా అభివృద్ధి చెందితే మానవాభివృద్ధి సూచీలు అంతగా పురోగమిస్తాయి. ఈ రంగాలకు కూడా నిధులు పెంచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.  ప్రజల అభిమతానికి అనుగుణంగా, అభివృద్ధికి బాటలువేసే బ్జడెట్‌ను తీర్చిదిద్దినట్టు కనిపిస్తోంది. కొత్త బ్జడెట్‌ తయారీకి సర్కారు భారీ కసరత్తు చేసింది. తొలుత ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ శాఖలవారీగా మంత్రులు, అధికారులతో భేటీలు నిర్వహించి, వారి నుంచి ప్రతిపాదనలు స్వీకరించారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ కూడా  మూడు రోజులపాటు అధికారులతో సమావేశాలు నిర్వహించారు. వివిధ అభివృద్ది, సంక్షేమ పథకాల మేళవింపుతో వార్షిక ప్రణాళికలో రూ.48వేల కోట్లపైగా కేటాయింపులు ఉంటాయి.  ప్రస్తుత రాబడులు, వ్యయాల తీరును బట్టి బడ్జెట్‌ ఆదాయవ్యవయాలు స్పష్టమవుతాయి. తెలంగాణ ఏర్పడగానే వచ్చిన బడ్జెట్‌ సందర్భంగా  రాబడులపై సరైన అవగాహన లేకపోవడంవల్ల బ్జడెట్‌ను భారీ అంచనాలతో తయారుచేశామని, 2015-’16 బ్జడెట్‌ మాత్రం వాస్తవాలకు దగ్గరగానే ఉంటుందని సిఎం కెసిఆర్‌ అన్నారు.