వచ్చే వేసవి నుంచి పగటి పూట విద్యుత్‌

5

– రైతులకు రాత్రి కరెంటు కష్టాలుండవు

-మంత్రి హరీష్‌

మెదక్‌మార్చి 22 (జనంసాక్షి): వచ్చే వేసవి నుంచి రైతులకు ఉచితంగా ఉదయం నుంచే విద్యుత్‌ సరఫరా చేస్తామని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఉదయం నుంచి 9 గంటల పాటు రైతులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ అందిస్తామని చెప్పారు. ఏడాది తర్వాత రైతులకు రాత్రిపూట విద్యుత్‌ సమస్య అనేది లేకుండా చేస్తామని పేర్కొన్నారు.అలాగే  రాష్ట్రంలో మున్సిపల్‌ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురానున్నట్టు , ఇందుకుగాను 800 మంది మున్సిపల్‌ ఇంజినీర్లను త్వరలో నియమించనున్నట్టు చెప్పారు. ఆదివారం సాయంత్రం మెదక్‌ ఖిల్లాపై మున్సిపల్‌ కౌన్సిల్‌ సభ్యులు, అధికారులతో ఆయన సవిూక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఇప్పటివరకు నాలుగు జిల్లాలకు ఒక మున్సిపల్‌ ఎస్‌ఈ ఉండేవారని, ఇకముందు రెండు జిల్లాలకు ఒక ఎస్‌ఈని నియమిస్తామన్నారు. జిల్లాకో పబ్లిక్‌ హెల్త్‌ ఆఫీసర్‌ను నియమిస్తామని చెప్పారు.

పట్టణాలను సుందరంగా తీర్చిదిద్దడానికి పారిశుద్ధ్యంపై ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. వావ్‌ పద్ధతి కింద ఐటీసీ సౌజన్యంతో తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయనున్నట్టు తెలిపారు. ఇకనుంచి మున్సిపాలిటీల్లో చెత్తకుండీల పద్ధతి ఉండబోదన్నారు. పారిశుద్ధ్య సిబ్బంది నేరుగా ఇంటింటికి వెళ్లి తడి, పొడి చెత్తలను వేర్వేరుగా సేకరిస్తారని తెలిపారు. పొడి చెత్త ద్వారా పేపర్‌ వంటి ఉప ఉత్పత్తులు తయారు చేసే అవకాశం ఉందన్నారు. తడి చెత్తను ఎరువులకు వినియోగిస్తామని చెప్పారు.

బీడీ కార్మికులందరికీ పింఛన్లు ఇవ్వలేం..

చేగుంట: బీడీ కార్మికులందరికీ పింఛన్లు అందించలేమని నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు స్పష్టం చేశారు. దివారం మెదక్‌ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో 10 శాతం ఉండి, పీఎఫ్‌ కలిగిన బీడీ కార్మికులందరికీ పింఛన్లు అందిస్తామన్నారు. ప్రస్తుతం అర్హుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని, వారందరికీ జీవనభృతి చెల్లిస్తామన్నారు.