వట్టి మాటలు కట్టిపెట్టండి

3

– చౌకబారు విమర్శలు వద్దు

– మంత్రి హరీశ్‌ రావు

హైదరాబాద్‌,మార్చి11(జనంసాక్షి):తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్రతో కుదుర్చుకున్న అంతర్రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల ఒప్పందంపై కాంగ్రెస్‌ నేతలు చౌకబారు విమర్శలు చేయడంపై మంత్రి హరీష్‌ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 8.3.2016 న రెండు రాష్ట్రాల మధ్య గోదావరి జలాల వినియోగంపై ఒక చారిత్రాత్మకమైన ఒప్పందం కుదిరిందని చెప్పారు. 1975 నుంచి నలుగుతున్న అంతర రాష్ట్ర వివాదాలకు స్వస్తి పలికి, పొరుగు రాష్ట్రాలతో ఘర్షణ వైఖరిని విడనాడి, పరస్పర అవగాహన, సహకారం అన్న ప్రాతిపదికన రెండు ప్రభుత్వాలు ఈ ఒప్పందం కుదుర్చుకొని ఒక కొత్త ఒరవడికి తెర తీశాయని చెప్పారు.గత పదేండ్ల కాలం అధికారాన్ని వెలగబెట్టిన కాంగ్రెస్‌ నాయకులు, గోదావరి జలాల వినియోగంపై ఏ ఒక్క వివాదాన్ని పరిష్కరించలేక చేష్టలుడిగిపోయారని హరీష్‌ రావు మండిపడ్డారు. ఇవ్వాళ తమ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంపై అక్కసు వెళ్ళగక్కుతున్నారని విమర్శించారు. ఇదంతా పాతదే. తమ ప్రభుత్వం 2012 లో కుదుర్చుకున్న ఒప్పందాన్నే తిరిగి సంతకాలు చేసి మహా విజయంగా ప్రచారం చేసుకుంటున్నారని, గ్రావిటీ ద్వారా వచ్చేనీటిని వదలి ఎత్తిపొతలకు పోతున్నారని, రీ ఇంజనీరింగ్‌ పేరు విూద డబ్బులు వెనుకేసుకుంటున్నారని .. ఇట్లా రకరకాల విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.శుభకార్యం జరుగుతుంటే ఓర్వలేనోడు ముక్కుల పుల్ల పెట్టుకొని తుమ్మినట్టు కొంత మంది కాంగ్రెస్‌ నాయకుల పద్ధతి ఉన్నదని హరీష్‌ రావు మండిపడ్డారు. 2012లో విూ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం జరగడానికి దోహదం చేసిందా? అని ప్రశ్నించారు. కేంద్రంలో, మహారాష్ట్రలో, ఇక్కడా విూ ప్రభుత్వమే ఉన్నా పదేళ్లు ప్రాజెక్టు పని ఒక్క అంగుళం కూడా ఎందుకు కదలలేదని నిలదీశారు. 152 విూటర్ల ఎఫ్‌.ఆర్‌.ఎల్‌ వద్ద కాలువల డిజైన్లు పూర్తి చేసి, టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించిన విూరు.. మహారాష్ట్రను ఒప్పించాల్సిన బాధ్యత ఎందుకు మరిచారని హరీష్‌ రావు ప్రశ్నించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్విరాజ్‌ చవాన్‌ (కాంగ్రెస్‌) ప్రాణహిత పనులపై తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తే నిమ్మకు నీరెత్తినట్లు కూర్చొని కాలక్షేపం చేసి ఇవ్వాళ తమ విూద అక్కసు వెళ్ళగక్కుతున్నారని మండిపడ్డారు.ఇది పాత ఒప్పందమంటున్న కాంగ్రెస్‌ నాయకులకు 5.5.2012 న వారు కుదుర్చుకున్న ఒప్పందంలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయో వారికి ఎరికేనా? అని హరీష్‌ రావు ప్రశ్నించారు. కిరణ్‌ కుమార్‌ రెడ్డి సంతకం చేసిన ఒప్పందంలో ఉన్నది ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు ఒక్కటే కాదా? అని నిలదీశారు. గోదావరిపై ఆరు ప్రాజెక్టులను ఒకే గొడుగు కిందకి తెచ్చిన ఒప్పందం, కేవలం ప్రాణహిత- చేవెళ్ళ ప్రాజెక్టు కోసం మాత్రమే చేసుకున్న ఒప్పందం ఒక్కటి ఎట్లా అవుతుందో కాంగ్రెస్‌ నాయకులు చెప్పాలని హరీష్‌ రావు ప్రశ్నించారు.పాతవాటిని, కొత్త వాటిని, గోదావరిపై భవిష్యత్తులో నిర్మించబోయే ప్రాజెక్టులు ఏవైనా ఇప్పుడు కుదుర్చుకున్న ఒప్పందం పరిధిలోకి తేవడం చరిత్రాత్మకం కాదా? అని నిలదీశారు. గోదావరి నదిలో తెలంగాణకు ఉన్న వాటాను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేయడానికి తలపెట్టిన మేడిగడ్డ బ్యారేజీపై మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించడం చరిత్రాత్మకం కాదా? అని ప్రశ్నించారు.పెన్‌ గంగ, తుమ్మిడిహట్టి బ్యారేజీల ద్వారా ఆదిలాబాద్‌ జిల్లాలో, మేడిగడ్డ నుంచి అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల ద్వారా ఎల్లంపల్లికి, అక్కడి నుండి మిడ్‌ మానేరు, మల్లన్న సాగర్‌, కొండపోచమ్మ జలాశయాలకు గోదావరి నీటిని తరలించి, వీటి ద్వారా కరీంనగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌, మెదక్‌, నల్లగొండ జిల్లాల్లోని 16 లక్షల ఎకరాలకు, హైదరాబాద్‌ జంట నగరాలకు, దారిలో వందలాది గ్రామాలకు తాగునీరు, నీరు రాక వట్టిపోయిన నిజాంసాగర్‌, శ్రీరాంసాగర్‌, సింగూర్‌ ప్రాజెక్టులను జలకళతో పునరుజ్జీవింపజేసే ఈ ఒప్పందం చరిత్రాత్మకం కాదా? అని హరీష్‌ రావు కాంగ్రెస్‌ నేతలను నిలదీశారు.సుధీర్ఘ కాలం అధికారంలో ఉన్న విూరు 1975 లో కుదుర్చుకున్న ఒప్పందాలను ఏ మేరకు అమలు చేశారో ప్రజలకు చెప్పుకోవలసి ఉందని మంత్రి హరీష్‌ రావు అన్నారు. 1975 లోనే లెండి, లోయర్‌ పెన్‌ గంగ, ప్రాణహిత ప్రాజెక్టులపై ఒప్పందాలు చేసుకున్న విూరు ఆ ప్రాజెక్టులని ఎందుకు పూర్తి చెయ్యలేకపోయారని ప్రశ్నించారు. 1978 లో ఇచ్చంపల్లి ప్రాజెక్టుని నిర్మించడానికి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఏ గంగలో కలిపినారో ప్రజలకు వివరించగలరా? అని నిలదీశారు. ఇచ్చంపల్లి ప్రాజెక్టు నిర్మాణం అయి ఉంటే తెలంగాణ ప్రజల సాగునీటి కష్టాలు తీరి ఉండేవి కావా? అని నిప్పులు చెరిగారు. 40 ఏండ్ల క్రితమే సంతకాలు చేసిన ఏ ఒప్పందం అయినా సాకారం అయ్యిందా? 2003 లో లెండి ప్రాజెక్టు ప్రారంభం అయితే పుష్కరకాలం దాటినా పూర్తి చెయ్యలేని అసమర్థత ఎవరిది? అని కాంగ్రెస్‌ నేతలను నిలదీశారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమ ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం నుంచే అంతర రాష్ట్ర వివాదాల పరిష్కారానికి ప్రయత్నాలు మొదలు పెట్టిందని మంత్రి హరీష్‌ రావు గుర్తుచేశారు. స్వయంగా ముఖ్యమంత్రి రెండుసార్లు, మంత్రిగా తాను మూడుసార్లు ముంబై వెళ్ళి మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపినామని వివరించారు. ఫోన్‌ లో సంభాషణలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయన్నారు. ఈ మధ్య కాలంలో ఇంజనీర్ల స్థాయిలో అనేక చర్చలు జరిగినయని, ప్రాజెక్టుల సాంకేతిక అంశాలను కొలిక్కి తీసుకురాగలిగామని చెప్పారు. ఆ ప్రాంత ఇతర మంత్రులని, ప్రజాప్రతినిధులని కలిసి సాంకేతిక అంశాలని వివరించి, వారిని విశ్వాసంలోకి తీసుకొని ప్రాజెక్టుల నిర్మాణానికి సానుకూల వాతావరణాన్ని కల్పించగలిగినామని తెలిపారు.గత సంవత్సర కాలంగా తాము పడిన శ్రమ ఫలించి మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ స్వయంగా మన ముఖ్యమంత్రి చంద్రశేఖర రావుని ముంబై ఆహ్వానించారని హరీష్‌ రావు చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున జరిగిన కొత్త ఒప్పందం తెలంగాణ సాగునీటి రంగ చరిత్రలో ఒక గొప్ప మైలురాయి అని, తెలంగాణ రైతుల కలలు నెరవేరే ఒక అద్భుత సందర్భమని అన్నారు. తెలంగాణ ఉద్యమ సాగు ఆకాంక్షలు నెరవేరేందుకు వేసిన పునాది రాయి అని కొనియాడారు. భవిష్యత్‌ లో రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాలు జరుగుతాయని జరుగుతున్న ప్రచారాన్ని అబద్దమని నిరూపించిన వేళ అన్నారు. గత ప్రభుత్వాలు పొరుగు రాష్ట్రాలతో అనుసరించిన ఘర్షణ వైఖరిని విడనాడి, పరస్పర సహకారం, అవగాహన ప్రాతిపదికగా నదీ జలాలని వినియోగించుకోవడం సాధ్యమేనని దేశానికి చాటి చెప్పిన ఘట్టమని ప్రశంసించారు. ఇటువంటి సందర్భాన్ని తెలంగాణ బిడ్డలుగా ఆహ్వానించాల్సిన కాంగ్రెస్‌ నాయకులు.. ఒప్పందంపై చౌకబారు విమర్శలు చేయడం విచారకరమన్నారు హరీష్‌ రావు. కాంగ్రెస్‌ నాయకులు దీన్ని బ్లాక్‌ డే అంటున్నారని, నిజానికి కాంగ్రెస్‌ కు ఇది నూటికి నూరు శాతం బ్లాక్‌ డే అని ఎద్దేవా చేశారు. ఇన్నేళ్ళు అధికారంలో ఉండి కాంగ్రెస్‌ చెయ్యలేనిది ఏడాది కాలంలోనే టిఆర్‌ఎస్‌ చేసిందని జనం మెచ్చుకుంటున్నారని, కాంగ్రెస్‌ ని తిడుతున్నారని, కాబట్టి వారికి బ్లాక్‌ డేనే అన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ ను క్షమించరన్నారు. ఇప్పటికే అన్నిఎన్నికల్లో కర్రు కాల్చి వాతలు పెట్టినా బుద్ధి మారడం లేదని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధికి అడ్డుతగిలితే తెలంగాణ ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెపుతారని హెచ్చరించారు.

ఇక ఇవ్వాళ కొందరు గ్రావిటీని వదిలి ఎత్తిపోతలకు పోతున్నారని పాత చింతకాయ పచ్చడిని వడ్డిస్తున్నారని మంత్రి హరీష్‌ రావు మండిపడ్డారు. ఏ అనివార్య పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను వెతకవలసి వచ్చిందో ప్రజలకు ఇప్పటికే వివరించి చెప్పినామన్నారు. ప్రజలకు అవి అర్థం అయినయని, అందుకే మహారాష్ట్రతో కుదిరిన ఒప్పందాన్ని స్వాగతించినారని వివరించారు. విమర్శల కోసమే విమర్శలు చేసే వాళ్ళకు జవాబులు చెప్పే అవసరం లేదని, వారికి ప్రజలే తగిన బుద్ధి చెపుతారని హరీష్‌ రావు స్పష్టం చేశారు.