వరంగల్‌ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

5

పక్కా ప్రణాలికలు సిద్ధంచేయండి

సీఎం కేసీఆర్‌ సమీక్ష

వరంగల్‌,మార్చి 24 (జనంసాక్షి):

వరంగల్‌ నగరాన్ని క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ సిటీగా మార్చాలని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. నగరానికి కేటాయించిన నిధులతో అభివృద్ది ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. ఆయన వరంగల్‌లో ప్రజా ప్రతినిధులు, అధికారులతో సవిూక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం కడియం ఎమ్మెల్యేలు టి.రాజయ్య, ఆరూరి రమేష్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, మేయర్‌ నన్నపునేని నరేందర్‌తోపాటు పలువురు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ.. వరంగల్‌ నగరానికి గతంలో ఎన్నడూలేని విధంగా బడ్జెట్‌లో రూ.300 కోట్లు కేటాయించామన్నారు. నగరంలో ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించుకుని కార్యాచరణ ప్రారంభించాలని తెలిపారు.వరంగల్‌లో పెరుగుతోన్న ట్రాఫిక్‌ రద్దీకి అనుగుణంగా రహదారులను వెడల్పు చేయాలని సూచించారు. ప్రజల సౌకర్యార్థం బస్‌ బేలు, కూరగాయల మార్కెట్లు, టాయిలెట్లు, కమ్యూనిటీ హాల్స్‌, పార్కులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వంద ఎకరాల విస్తీర్ణంలో థీమ్‌ పార్క్‌ను నిర్మించాలని చెప్పారు. స్మృతివనం పనులు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. వరంగల్‌ కలెక్టరేట్‌లో కొత్తగా టవర్స్‌ నిర్మించి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల నివాసాలు ఉండేటట్టు చూడాలని పేర్కొన్నారు.నగరంలో విస్తృతంగా పర్యటించి రహదారులు, మంచినీరు, డ్రైనేజీ ఇతర సమస్యలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. వరంగల్‌లో దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్‌ పార్క్‌ వస్తున్నందున జనాభా ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుందని పేర్కొన్నారు. ఇందుకు తగిన విధంగా మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ యేడాది వర్షాకాలం ప్రారంభం నుంచి హరితహారం కార్యక్రమం చేపట్టాలని వివరించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు పరిశుభ్రంగా ఉండేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అన్ని కార్యాలయాలు పచ్చగా ఉండేలా చూడాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ హన్మకొండలోని కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు నివాసం నుండి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. మహబూబాబాద్‌ ఎంపీ సీతారాం నాయక్‌ కుమారుడి వివాహానికి హాజరైన కేసీఆర్‌ కెప్టన్‌ నివాసానికి వచ్చారు. దాదాపు రెండు గంటలపాటు జిల్లా అభివృద్ధిపై అధికారులతో సవిూక్ష నిర్వహించారు. అనంతరం హైదరాబాద్‌కు బయలుదేరారు.