వర్షాకాల వ్యాధులపై అప్రమత్తత ఏదీ?

 

ఏటా వర్షాకాలంతో పాటే అంటురోగాలు కూడా జంటగా కలసి వస్తున్నా ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయి. ప్రజలబాధ ప్రజలదే తప్ప ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకుంటున్న దాఖలాలు అరుదు. ఎక్కడైన మరణాలు సంభవిస్తే తప్ప కదలిక రావడం లేదు. ఇప్పటికీ గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో పట్టణ ప్రాంతాలకు వైద్యం కోసం రావడానికి నానాయాతన పడుతున్నారు. ప్రధానంగా గిరజన ప్రాంతాల్లో సమస్యలు తీవ్రంగా ఉంటున్నాయి. వర్షాకాలంలో వాతావరణ మార్పులతో పాటు జ్వరాలు ప్రబలడం అనివార్యం అవుతోంది. ముఖ్యంగా దోమకాటు కారణంగా వైరల్‌ జ్వరాలు ఆందోళన కలిగించే స్థాయికి విస్తరిస్తున్నాయి. స్వచ్ఛభారత్‌ పేరుతో ప్రచారం చేస్తున్నారే తప్ప ప్రజల్లో అవగాహన పెరగడం లేదు. ప్రభుత్వాలు కూడా దీనిని సీరియస్‌గా తీసుకోవడం లేదు. ప్లాస్టిక్‌ వినియోగం పెరగడం వల్ల గ్రామాలు కూడా మురికి కూపాలుగా మారుతున్నాయి. ఎక్కడపడితే అక్కడ వాడిపడేసిన ప్లాస్టిక్‌ వస్తువులు నాలాల్లో దర్శనం ఇస్తున్నాయి. దీంతో కాలువలు శుభ్రంగా లేక చెత్త పేరుకుపోతోంది. దీంతో ఇళ్ల పక్క ఉన్న నీటి గుంతల్లో, సైడుకాల్వల్లో, పారిశుధ్యం లోపించిన ప్రాంతాల్లో, నీరు నిల్వ ఉన్న కుంటల్లో దోమలు వృద్ధి చెందుతున్నాయి. స్వచ్ఛ భారత్‌లో భాగంగా రోడ్లను శుభ్రంగా ఉంచడమే కాక వ్యక్తిగత శుభ్రత, పరిసరాల శుభ్రత ఎంతో ముఖ్యంగా ప్రజలు గుర్తించి తగు చర్యలు తీసుకోవాల్సి ఉన్నా వారు కూడా తమ బాధ్యతను విస్మరిస్తున్నారు. చిన్నపాటి జాగ్రత్తలతో ఆరోగ్య రక్షణ పొందవచ్చు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటించడం ద్వారా దోమల నిర్మూలన సాధ్యమవుతుంది. పల్లెలు, పట్టణాలు స్వచ్ఛభారత్‌ లక్ష్యాన్ని అందుకుంటే దోమలకు ఎక్కడ చోటుండదు. ఇంట్లో, పరిసరాల్లో నీటి నిల్వలు, తాగేసి పడేసిన కొబ్బరిబొండాలు, టైర్లు లేకుండా ఊసుకోవాలి. దోమలు కాల్వల్లో పెరగకుండా ఉండేందుకు మడ్డి ఆయిల్‌, కిరోసిన్‌ పోయాలి. ఇంటి కిటికీలకు మెస్‌లు ఏర్పాటు చేసుకోవాలి. ఇంటి పరిసరాల్లో దోమల్ని ఇంట్లోకి రానీయకుండా చేసే మొక్కల్ని పెంచుకోవచ్చు. దోమకారక వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు దోమతెరల్ని వాడటంతో వారంలో ఒక రోజు నిర్మూలనకు అవసరమైన చర్యలు చేపట్టడం ఉత్తమం.సీజనల్‌ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముందని వైద్యులు పేర్కొంటున్నారు. కేవలం పారిశుధ్యలోపం కారణంగా విషజ్వరాలు పంజా విసురుతున్నాయి. పారిశుధ్యం, దోమలే ఇందుకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. గ్రామాలు, అటవీ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు వైరల్‌ జ్వరాలతో వణుకుతున్నారు. విష జ్వరాలతో బాధపడేవారు ప్రయివేటు ఆస్పత్రుల్లో చేరి వేల రూపాయలు ఖర్చు చేసుకుంటున్నారు. దోమలను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇవ్వడం లేదు. దీనికి ప్రజల తోడ్పాటు లేకపోవడం వల్ల గ్రామాల్లో పారిశుద్యం ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నచందంగా తయారయ్యింది. కంటి తుడుపు పారిశుధ్య చర్యల నేపథ్యంలో విషజ్వరాలతో మృతి చెందుతున్న సంఘటనలు ప్రజలను కలవర పరుస్తున్నాయి. ఇక ఏదైనా జ్వరం వస్తే ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రులు కిటకిటలాడుతుంటాయి. వానాకాలం వచ్చిందంటే మురుగు ద్వారా దోమలు వ్యాప్తి చెందుతాయనే విషయం వైద్యాధికారులకు తెలుసు. మురుగు నివారణకు బ్లీచింగ్‌ పొడి చల్లడంతోపాటు సమస్యాత్మక గ్రామాల్లో ఫాగింగ్‌ చేయడం సర్వ సాధారణం. ప్రస్తుతం దోమలు బెడద పెరిగినా ఆ దిశగా నగరాల్లో, పట్టణాల్లో, నగర పంచాయతీల్లో ఫాగింగ్‌ చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వినిస్తున్నాయి. వర్షాకాలంలో చినుకు పడితే దోమలకు ప్రాణం లేచి వస్తుంది. అదే సందర్భంలో

ప్రైవేట్‌ ఆస్పత్రులకు కాసుల రాల్చే కాలం ఇది. వ్యాధి ఏదైనా, జ్వరం సోకితే చాలు వివిధ రకాల భయాలను చూసి ప్రైవేట్‌ ఆస్పత్రులు జలగల్లా పీలుస్తున్నారు. జిల్లాల్లో ఏ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించినా చలితో వణికి పోయే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఆస్పత్రులు ఇప్పుడు వ్యాపార కేంద్రాలుగా మారాయి. రోగి వస్తే చాలు డబ్బు గుంజడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ఆరోగ్యరక్షణ సంగతి ఎలా ఉన్నా ఒళ్లు,ఇల్లు గుల్లకాక తప్పడం లేదు. అన్నీ తెలిసినా అధికారులు, పాలనా యంత్రాంగం మిన్న కుంటోంది. జ్వరాలకు సంబంధించి ప్రైవేటు వైద్యశాలలు వసూలు చేస్తున్న ఫీజులపై అనేక ఫిర్యాదులు వస్తున్నా పట్టించు కోవడంలేదు. ప్రైవేటు నర్సింగ్‌ ¬మ్‌లు డెంగీ జ్వరాల పేరుతో ప్రజలను బాగా దోచుకుంటున్నాయి. ఇకపోతే గతంలో కేవలం మన్యం,గిరిజన ప్రాంతాల్లోనే విషజ్వవాలు సోకేవి. కానీ ఇప్పుడు మన్యం, మైదాన ప్రాంతం అన్న తేడా లేకుండా వ్యాధులు ముప్పేట దాడిచేయడం ఏటా సర్వసాధారణమైంది. పారిశుధ్య లోపమే దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. పల్లెలు, పట్టణాల్లో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక మురుగు కాలువలు అస్తవ్యస్తమయ్యాయి. దోమలు దాడి చేయకముందే దోమల నివారణ మందు పిచికారి చేస్తే సీజనల్‌ వ్యాధుల్ని చాలావరకు అరికట్టవచ్చు. మన్యం తరహాలోనే ఇప్పటి కైనా మైదాన ప్రాంత గ్రామాల్లో చైతన్యం కల్పించి ఉరూరా అవగాహన సదస్సులు, వైద్య శిబిరాలు నిర్వహించాల్సి ఉంది. ప్రధానంగా నీటి కాలుష్యం కారణంగా టైపాయిడ్‌ జ్వరాలు సోకే ప్రమాదం ఉంటుంది. ముందస్తుగానే తాగునీటి ట్యాంకులు, పైపులైన్ల లీకులు, కలుషిత నీటి సరఫరాను నియంత్రించ గలిగితే టైపాయిడ్‌, వైరల్‌ ఫీవర్‌ బారి నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. పంచాయితీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, పురపాలక, ఆరోగ్య శాఖ, ఐసీడీఎస్‌, డీఆర్‌డీఏ, ఇతర అనుంబంధ విభాగాల సమన్వయంతో అధికారులు, సిబ్బంది పనిచేసినపుడే ఇది సాధ్యపడుతుంది.