వాగ్దానాలు నెరవేర్చడంలో మోదీ, మమత విఫలం

3

– బెంగాల్‌ ప్రచారం సభలో రాహుల్‌

హౌరా,ఏప్రిల్‌ 23(జనంసాక్షి):ఎన్నికల ముందు ఎన్సో వాగ్దానాలు చేసి తీరా గెలిచాక  ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీలు ఘోరంగా విఫలమయ్యారని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శించారు. హౌరా జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాహుల్‌ మాట్లాడుతూ శారదా చిట్‌ ఫండ్‌ కుంభకోణంతో మమత ప్రభుత్వం ప్రజలను లూటీ చేసిందని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. గత ఐదేళ్లుగా ఇక్కడ ప్రజలు పట్టించుకున్న పాపాన పోలేదని, ప్రజా సమస్యలను పాతరేసారని మండిపడ్డారు. పశ్చిమబంగ ముఖ్యమంత్రి మమత బెనర్జీపై  విమర్శలు గుప్పించారు. పజలకు ఆరోగ్యం, విద్య, ఉద్యోగం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని పేర్కొన్నారు. కానీ ఈ ప్రభుత్వం ప్రజలు కూడటెట్టుకున్న డబ్బును చిట్‌ఫండ్‌ పేరుతో దోచేసిందని విమర్శించారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగ కల్పనలో ప్రభుత్వం విఫలమైందని రాహుల్‌ మమత బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని విమర్శించారు. గతంలో ఉద్యోగాలు వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చేవారని.. ఇప్పుడు ఇక్కడి వారే వేరే ప్రాంతాలకు వలస వెళుతున్నారన్నారు. మమత బెనర్జీ వలే మోదీ కూడా అసత్య వాగ్దానాలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మొదట యువతకు ఉద్యోగ కల్పనకు కృషి చేస్తామన్నారు.