వాటర్‌గ్రిడ్‌లో అవినీతి ధార

2
సొంత వ్యక్తికే టెండర్లు

ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్‌,ఏప్రిల్‌4(జనంసాక్షి): తెలంగాణ లో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన వాటర్‌ గ్రిడ్‌ పదకంపై కాంగ్రెస్‌ ముప్పేట దాడి చేస్తోంది. తెలంగాణలో ప్రభుత్వం చేపట్టిన వాటర్‌ గ్రిడ్‌ పథకంలో అవినీతి చోటుచేసుకుందని  తెలంగాణ కాంగ్రెస్‌ మరోమారు విరుచుకుపడింది. కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ చార్జీ దిగ్విజయ్‌ సింగ్‌ చేసిన ఆరోపణలను అందిపుచ్చుకుని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు దాడి చేస్తున్నారు. ఇది కవిూషన్ల కోసం చేపట్టిందేనని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, సహా ముఖ్య నేతలు జానారెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్‌ అలీ మండిపడ్డారు. శనివారం విూడియాతో మాట్లాడుతూ.. అది వాటర్‌ గ్రిడ్‌ కాదు.. స్కాం గ్రిడ్‌, కరప్షన్‌ గ్రిడ్‌ అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ కుటుంబానికి సన్నిహితుడికి రూ.40వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చే విధంగా టెండర్లలో అవకతవకలు జరిగాయని వారు విమర్శించారు. ముడుపుల కోసం తమకు కావాల్సిన కంపెనీలు క్వాలీఫై అయ్యేవిధంగా  స్వల్ప తేడాతోనే టెండర్లు వేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కాంట్రాక్టుల్లో ఒక్క తెలంగాణ కాంట్రాక్టరుకు కూడా చోటు దక్కలేదని.. వెంటనే వీటిని రద్దు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. గ్రిడ్‌ వల్ల వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం జరుగుతుందని శాసనసభ పక్ష ఉప నేత టి.జీవన్‌ రెడ్డి అన్నారు. రెండు వేల కోట్లతో అన్ని గ్రామాలకు మంచినీటిని సరఫరా చేయవచ్చని, కాని నలభై వేల కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఇందులో వృథా అయ్యే నిధులతో ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టవచ్చని ప్రభుత్వానికి ఆయన సూచించారు. అలా చేయకుండా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్‌ మార్పు సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు కోసం మహారాష్ట్ర నుంచి 1800 ఎకరాలు సాధించలేరా ? అని జీవన్‌ రెడ్డి ప్రశ్నించారు. నిబంధనలు సవరించి మరోసారి  టెండర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయాలన్నారు. అధికారం ఉందనే అహంకారంతో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతున్నారని వారు విమర్శించారు. మంత్రి కేటీర్‌ తన తీరు మార్చుకోకపోతే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. వాటర్‌ గ్రిడ్లో అవినీతి, దోపిడీకి వ్యతిరేకంగా న్యాయపరమైన చర్యలు చేపడుతామని ఉత్తమ్‌, జానారెడ్డి, భట్టి, షబ్బీర్‌ అన్నారు. పోలవరం కోసం ఆంధ్రప్రదేశ్‌ రాష్టాన్రికి ఏడు మండలాలను తెలంగాణ ముఖ్యమంత్రి వదులుకున్నారని కూడా  జీవన్‌ రెడ్డి విమర్శలు చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న వాటర్‌ గ్రిడ్‌ పథకంతో ప్రజలకు ఎలాంటి మేలు జరగదని విమర్శించారు. ఆ పథకం వల్ల రూ.2 వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం కానుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రెండు వేల కోట్లతోనే రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు మంచినీటి సరఫరా చేయొచ్చని ప్రభుత్వానికి సూచించారు. ఇందుకు అదనంగా మరో రూ.38 కోట్లు ఎందుకు వినియోగిస్తున్నారో సమాధానం చెప్పాలని జీవన్‌ రెడ్డి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ వృథా అయ్యే నిధులతో ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టవచ్చని ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. కానీ, ప్రస్తుతం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్‌ మార్పు దారుణమని జీవన్‌ రెడ్డి మండిపడ్డారు. ముంపునకు గురయ్యే 1800 ఎకరాలను మహారాష్ట్ర ఇచ్చే విధంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలని  ఈ సందర్భంగా జీవన్‌ రెడ్డి కేసీఆర్‌ సర్కారును డిమాండ్‌ చేశారు.