వాటర్ ట్యాంకు నిర్మాణానికి భూమి పూజ
ఎమ్మెల్యే రాంబాబు
ఒంగోలు, కొమరోలు ,జూన్ 30 : కొమరోలు మండలంలోని గాజుల వెంకటాపురం గ్రామ ప్రజలకు రక్షిత మంచినీటి పథకం క్రింద మంచినీటిని సరఫరా చేసేందుకు మంజూరైన 20 వేల లీటర్ల సామర్ధ్యం గల ఓవర్‌హెడ్ ట్యాంకు నిర్మాణానికి గిద్దలూరు శాసనసభ్యులు అన్నా వెంకటరాంబాబు భూమి పూజ చేశారు. నిర్మాణానికి 24 లక్షల వ్యయంతో నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. తదుపరి ఆయన గ్రామంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశానికి పంచాయితీ ప్రత్యేకాధికారి ముత్యాల సుబ్బారావు అధ్యక్షత వహించారు. మాజీ జడ్‌పిటిసి ఆర్‌డి రామకృష్ణ మాట్లాడుతూ కొమరోలు మండలంలోని గాజుల వెంకటాపురం గ్రామ అభివృద్ధికి ప్రత్యేకంగా పాటుపడిన ఎమ్మెల్యే రాంబాబు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ముఖ్య అతిథిగా శాసనసభ్యులు రాంబాబు మాట్లాడుతూ గిద్దలూరు నియోజకవర్గ పరిధిలోని కొమరోలు మండలంలోని సూరవారిపల్లి, గాజులవెంకటాపురం గ్రామాలకు తారురోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపుతున్నామని త్వరలో ఉత్తర్వులు రానున్నట్లు ఆయన తెలిపారు. తారు రోడ్లు మంజూరు కానిదే మిగిలిన పనులు చేపట్టబోనని ఆయన హామీ ఇచ్చారు. ఈ గ్రామానికి మంజూరైన సిమెంటు రోడ్లు ఇసుక కొరతతో పనులు నిలిచిపోయాని అన్నారు. గ్రామంలో ఇంటి స్థలాలు లేని లబ్దిదారులను గుర్తించి అధికారులతో సంప్రదించి అర్హులకు ఇంటి స్థలాలు మంజూరుకు కృషి చేస్తానని అన్నారు. తన పదవీకాలంలో గిద్దలూరు నియోజకవర్గంలోని రోడ్డులేని గ్రామాలు ఉండకూడదని ఆయన సభను ఉద్దేశించి ప్రసంగించారు. దాదాపు అన్ని గ్రామాల్లో మంచినీటి సమస్య లేకుండా చేయగలిగామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యుఎస్ డిఇ నరసింహరావు, ఎఇ రంగస్వామిరెడ్డి, ఎంఇఓ ముత్యాల సుబ్బారావు, ఎంపిడివో జాన్సన్‌పాల్, మాజీ జడ్‌పిటిసి సారె వెంకటనాయుడు, కుప్పా రంగనాయకులు, నల్లగుంట్ల మాజీ సర్పంచి మేడం గోపాల్‌రెడ్డి, మాజీ జడ్‌పిటిసి నరసింహులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ వెంగయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.