వాతావరణ సంరక్షణ చట్టబద్దం కావాలి
ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, గ్రామాల్లో కనిపిస్తున్న దైన్యం చూస్తుంటే భవిష్యత్ మరింత అగమ్యగోచరంగా కనిపిస్తోంది. ప్రధానంగా సాగునీటి సంగతెలా ఉన్నా మంచినీటి కోసం కష్టాలు తప్పవన్న దుస్థితి కళ్లముందు కదలాడుతోంది. వాననీటి సంరక్షణ అన్నది నినాదంగానే కాకుండా జాతీయ విధానం కావాలి. గ్రామాలను యూనిట్‌గా ఎంచుకుని గ్రామాల్లో చెరువులను, కుంటలను రక్షించుకుంటే తప్ప భూగర్భ జలాలలను పరిరక్షించుకోలేం. ప్రచారార్భాటాలను తగ్గించుకుని పక్కాగా ప్రణాళికా బద్దంగా సాగితే అదికూడా ఓ దశబ్దం పాటు యుద్దంలా కదిలితే తప్ప భవిష్యత్‌కు భరోసా లేదు. మంచినీటి కోసం మనం ఇప్పటి నుంచే అడుగు వేయాలి. పర్యావరణ పరిరక్షణ, మంచినీటి సంరక్షణ, మొక్కల పెంపెకం అన్నీ కూడా పరస్పర ఆశ్రయాలు. ఇవన్నీ కూడా ప్రజల జీవితంలో భాగస్వామ్యం చేస్తూ కఠిన చట్టాలు చేయాలి. మొక్కులను పెంచి,నీటి సంరక్షణ చేయడమన్నది ప్రతి పౌరుడి బాధ్యతగా మారాలి. ఇది ప్రచారం కోసం చెబితే చాలదు. చట్టబద్దంచేయాలి. స్వచ్ఛ భారత్ పేరుతో ప్రచారం ఊదరగొడుతున్నా ఎక్కడా పౌరుల్లో మార్పు కనిపించడం లేదు. చెత్త తొలగింపు అన్నది ప్రభుత్వ బాధ్యతన్నదిగా మారింది. ఉచిత పథకాలకు, ఓట్ల కోసం ఉద్దేశించిన పథకాలకు లక్షల కోట్లు ఖర్చు చస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ మొత్తాన్ని పర్యావరణ పరిరిక్షణకు, వాననీటి పథకాలకు వినియోగించకుంటే రానున్న రోజుల్లో అడుకున్నా నీరు దొరకని విధంగా దారుణ పరిస్థితులు దాపురించక మానవు. చుక్కనీటిని కూడా గ్రాముల లెక్కన కొనాల్సి వస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాకతీయుల కాలంలో, ఆ తరవాత నిజాం నవాబుల కాలంలో వాననీటిని ఒడిసిపట్టేలా జలాలతో ఓ గొలుసుకట్టు వ్యవస్థలా చెరువుల్ని నిర్మించారు. వాటిని మనం తెగ్గొట్టి ప్లాట్లుగా చేసుకుని సర్వనాశనం చేసుకున్నాం. చిన్ననీటి వనరులను ధ్వంసం చేసుకున్నాం. ఆ పాపం ఇప్పుడుమనలను వెన్నాడుతోంది. మండే ఎండలు, వాతావరణ అసమతుల్యత, వర్షాభావం ఇవన్నీ కూడా మనం చేజేతులా ప్రకృతిని నాశనపం చేసుకున్న కారణంగానే వచ్చాయని తెలుసుకోవాలి. నది జలాధారాలైన, వాగులూ వంకలన్నీ కొందరు స్వార్థపరుల వల్ల పూడుకుపోయాయి. రహదారులుగానూ మారాయి! అందరి సహకారంతో నదిని అడ్డగించే తుప్పలూ, గుర్రపుడెక్కల వంటివాటిని ఇప్పటికీ తొలగింకుకోలేక పోతున్నాం. వాగులపై సొంతంగా సర్వే చేయించి చెక్‌డ్యామ్‌లను నిర్మించుకునేలా ప్రజల్లో చైతన్యం తీసుకుని రావాలి. దీన్ని మరింత పెద్ద ఎత్తున తీసుకెళ్లాలి. హైదరాబాద్‌నే తీసుకుంటే
నగరంపై ఒకప్పుడు పచ్చటి దుప్పటి కప్పినట్లు ఉండేది. కాంక్రీట్ జంగల్ కారణంగా ఇప్పుడది అంతా అంతరించింది. దశాబ్దాలుగానగరంలో ఉన్న నీటివనరుల నిర్వహణను నిర్లక్ష్యం చేసిన పాలకుల పాపం తరతరాలకు పెనుశాపంగా మారి ఎక్కడికక్కడ మృత్యుఘంటికలు మోగిస్తోంది. మున్ముందు నీటికోసమే యుద్ధాలు జరుగుతాయన్న వాదనలను మనం అర్థం చేసుకోలేకపోతే, కఠినంగా వ్యవహరించకపోతే దేశం తీవ్ర దుర్భిక్షాన్ని ఎదుర్కోక తప్పదు. మార్చి 22ను ప్రపంచ జల దినోత్సవాన్ని ఏటా నిర్వహించడం పరిపాటిగా మారుతున్న ప్రజల్లో మార్పు రావడం లేదు. ప్రజలు నీటి సంరక్షణను బాధ్యతగా గుర్తించడం లేదు. ప్రపంచ జల దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి నిర్ణయించి పాతికేళ్లు అవుతున్నా ప్రజల్లో మార్పు రాలేదు కదా మరింతగా పర్యవావరణ విధ్వంసం జరుగుతోంది. పర్యావరణ మార్పుల దుష్పభ్రావాలకు తోడు స్వార్థపరుల కారణంగా మంచినీటి కటకట మరింతగా ముంచుకుని వస్తోంది. తీవ్ర అనావృష్టికి కారణభూతమైన ఎల్‌నినో దెబ్బకు కోట్ల మంది ప్రజల జీవనం దుర్భరమైపోతోంది. వర్షాలు లేక భారత దేశంలో గత రెండేల్లుగా తీవ్ర క్షామపరిస్థితులు నెలకొన్నాయి. దీని కారణంగానే భూగర్భ జలమట్టం
పడిపోయింది. ప్లాస్టిక్ వాడకం పెరగడం, చెట్లను నరికివేయడం వంటి కారణాల వల్ల భూతాపం పెరుగుతోంది. అందుకే మార్చిలోనే ఎండుల మండుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల 40 డిగ్రీలకు పైబడుతున్న ఎండలు, వట్టిపోయిన జలాశయాలు- ముంచుకొస్తున్న ముప్పు తీవ్రతకు అద్దం పడుతున్నాయి. కృష్ణా,గోదావరిల్లో చుక్కనీరుల లేని దుస్థితి చూసి కళ్లు తెరవాలి. జూన్‌లో వానలు కురిసేలోగా కనీసం ఇవి మంచినీటి వినియోగానికి కష్టాలు తప్పేలా లేవు. సింగపూర్, ఇజ్రాయెల్ వంటి దేశాలు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని నాణ్యమైన నీటి సరఫరాల్లో అగ్రగామిగా ఉంటే, ఇండియా పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రస్తుతమున్న నీటి సరఫరా సామర్థ్యానికి మించిన గిరాకీతో 2025నాటికి భారత్ నీటి కొరతను ఎదుర్కోబోతున్నదని కేంద్ర ప్రభుత్వం గతేడాది వెల్లడించింది. అయితే దారుణం తెలిసినా అందుకు కఠిన నిర్ణయాలకు మా/-తరం ముందుకు రావడంలేదు. ప్రభుత్వమే తనకుతానుగా ఈపనులు చేయలేదు. ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఇది విజయం అవుతుంది. అందుకు ప్రజల్లో చైతన్యం తీసుకుని వస్తూనే బాధ్యతలను తప్పనిసరి చేయాలి. నీటి సంరక్షణ, చెట్ల పెంపకం, పర్యావరణ పరిరక్షణలను చట్టబద్దం చేయాలి. నీటి వనరుల్ని రక్షించుకోవడంలో ప్రభుత్వాలు, పౌర సమాజాల వైఫల్యం కళ్లకుకడుతోంది. నీటి బొట్టును నిర్లక్ష్యం చేస్తే రేపు కన్నీరు పెట్టక తప్పదన్న సామాజిక స్పృహతో ప్రతి పౌరుడూ జల సంరక్షణకు నడుం బిగిస్తే తప్ప ముందుకు కదలలేం. బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ, ఇదే మాదిరి జీవన సరళి కొనసాగిస్తే వాతావరణ వేడిమికి మండి మసైపోక తప్పదని గుర్తుంచుకోవాలి.