వారసత్వ రాజకీయాల నుంచి కాంగ్రెస్ బయట పడాలి..!
మునిగే పడవకు నావికుడు ఎవరైతే ఏంటి అన్న చందంగా కాంగ్రెస్ పరిస్థితి ఉంది. నాయకుడు అన్నవాడి ప్రతిభ అధికారంలో లేనప్పుడే తెలుస్తుంది. పగ్గాలు రాహుల్‌కు అందిస్తారని చేసుకుంటున్న ప్రచారం చూస్తే కాంగ్రెస్‌లో గందరగోళం కనిపిస్తోంది. పగ్గాలు తల్లి చేతుల్లో ఉన్నా, తనయుడి చేతుల్లో ఉన్నా పెత్తనం వారిద్దరిదే అన్న సంగతి జగానికి తెలుసు. కాంగ్రెస్ వారికి మరీ ఖచ్చితంగా తెలుసు. పేరుకే మన్మోహన్ ప్రధానిగా ఉన్నా పెత్తనమంతా తల్లీ కొడుకులదే అని కూడా తెలుసు. అయినా ఈ దేశాన్ని పదేళ్లు వీరిద్దరూ తమ గుప్పిట్లో పెట్టుకుని ఏం వెలగబెట్టారని..?పగ్గాలు ఎవరి చేతుల్లో ఉన్నా రాహుల్ పొడిచేదేవిూ లేదన్నది తేలిపోయింది. నిజంగానే రాహుల్‌కు పోరాటపటిమ లేదా నాయకత్వ లక్షణాలు ఉంటే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయ్యాక డుమ్మా కొడతారా..? పరీక్షలో పాస్ కావాలంటే క్లాస్‌లకు హాజరు కావాలి. అలా కాకుండా నేరుగా పరీక్షలు రాస్తానంటే ఢిల్లీ ఫలితాలే వస్తాయి. దానికి ప్రత్యేకంగా రాహులే అవసరం లేదు. ఎవరున్నా కాంగ్రెస్‌కు ఒక్కటే. నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ తల్లీ కొడుకులు కాకుండా ఎవరికైనా పార్టీ పగ్గాలు అప్పగిస్తే కాంగ్రెస్ కొంతయినా మంచి ఫలితాలను సాధించుకునే అవకాశం ఉంటుంది. ఓ యువనాయకుడికి పగ్గాలు అప్పగించి చూస్తే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. ఫెయిల్యూర్ స్టోరీ అన్న ముద్ర తప్పుతుంది. నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతున్నంత కాలం కాంగ్రెస్‌కు కష్టకాలం కొనసాగుతూనే ఉంటుంది. ప్రశ్నించాల్సిన సమయంలో సంజాయిషీ చెప్పుకుంటున్నట్లుగా, అధికారపక్షాన్ని నిలదీయగలిగే సందర్భంలో నీరుగారిపోయేలా రాహుల్ కలుగులో దాక్కోవడం చూస్తే ఆయన నాయకత్వ లక్షణాలు ఏపాటివో తెలిసిపోతోంది. భూసేకరణ రగడ బిల్లు సహా, బడ్జెట్ ప్రతిపాదనలు వస్తున్న సమయంలో నాయకుడన్నవాడు ఎదురొడ్డి నిలబడాలి. గట్టిగా నిలదీయాలి. అయితే అంత సత్తా లేదని తనకుతాను ప్రూవ్ చేసుకున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది రాహుల్ గాక మరొకరు కాదు.
తల ఎగరేయాల్సిన తరుణంలో తలపట్టుకుని కూర్చోవడం లేదా తలదాచుకోవడం లాంటి లక్షణానాలను రాహులు చూపుతున్నాడు. అత్యంత కీలకమైన సమయంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కనిపించనందుకు కక్కలేక మింగలేక అర్థంపర్థంలేని వివరణలు ఇచ్చుకుంటున్న కాంగ్రెస్ తీరు చూస్తే అది ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆయన బ్యాచిలర్ కాబట్టి బ్యాంకాక్‌లో ఉండివుంటాడంటూ ఎగతాళి చేస్తున్నవారికి ధీటుగా సమాధానం ఇవ్వలేక, భారత్‌లోనే ఉన్నాడంటూ ఆయన ఆప్తులూ అభిమానులూ ఏవో ఫోటోలు సాక్ష్యంగా చూపించి నవ్వుల పాలవుతున్నారు. రాహుల్ ఎక్కడున్నాడన్న ప్రశ్న ఇప్పుడు ఆ పార్టీని ఆత్మరక్షణలో పడవేసింది. ఇంతటి సందిగ్ధంలో ఉన్న వ్యక్తి పార్టీని సమర్థంగా నడపగలడా అన్నది అనుమానమే. పదేళ్లలో కనీసం ఒక్క సారయినా నాయకత్వ లక్షణాలను బయటపెట్టుకోని భీరువు రాహుల్. ఆయనకు ఏప్రిల్లో పట్టాభిషేకం చేస్తారని ప్రచారం చేసుకోవడం చూస్తుంటే కాంగ్రెస్‌కు సమాధి పూర్తిగా కట్టాలనుకుంటున్న వారి సంఖ్య పెరిగిందనే భావించాలి. ఎదురుదాడితో ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజల పక్షాలన పోరాడాల్సిన సమయం ఇది. అన్నా హజారేలాంటి పెద్దాయన చేస్తున్న పనిని కూడా చేయలేని పండు ముసలి రాహుల్ అనడంలో తప్పులేదు. ఎందుకంటే భూసేకరణ ఆర్డినెన్స్‌పై చాలా అనుమానాలు ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో వీధుల్లోకి వచ్చి నిలబడాలి. ప్రజల పక్షాన వకాల్తా పుచ్చుకోవాలి. కానీ అలాంటి ప్రయత్నాలేవీ రాహుల్ చేయలేదు. ఆయన హానీమూన్ కోసం అన్నట్లుగా తప్పుంచుకుని పోవడం మరీ దారుణం. కనీసం తాను ఎక్కడికి వెళుతున్నాడో చెప్పుకోలేని పిరికితనం
ప్రదర్శించడం మరీ దారుణం. అత్యంత కీలకమైన బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నెలరోజులు సెలవువిూద వెళ్ళిపోవడం మాత్రం చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నది. అది రాజకీయ వైరాగ్యమో, అలకో లేక ఓటమిపై నిరాశయో లేక, ఓడించారని ప్రజలపై కోపమో కాంగ్రెస్ స్కంధావారాలకే తెలియాలి.
అటువంటివేమైనా ఉంటే పార్టీలో అంతర్గతంగా చర్చించుకోవాలి. ప్రజల నమ్మకాన్ని కూడగట్టాలి. తన ఆలోచనలకు అనుగుణంగా పార్టీని తీర్చిదిద్దనీయకుండా పాతతరం నేతలు మోకాలడ్డుతున్నారన్న బాధ రాహుల్‌కు ఉంటే నిర్మొహమాటంగా వారిని తప్పించాలి. పార్టీ వరుస పరాజయాలకు పరిష్కారాలను కనుగొనే లక్ష్యంతోనే ఆయన సెలవువిూద వెళ్ళారన్న ప్రచారం తప్పుకాకపోయినా సమయం మాత్రం కాదు. అయితే సమయమూ, సందర్భం ఉండాలి. అన్నింటికి మించి పారదర్శకత ఉండాలి. తాను ఎక్కడ ఉన్నానన్నది చెప్పుకునే ధైర్యం కావాలి. ఇవన్నీ లేనివాడు నాయకుడిగా ఎదగలేడు. పార్టీలో ఆయన విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడితే అడ్డుకునే వారు లేరు. అయినా ధైర్యంగా వాటిని అమలు చేయగలిగే సత్తా రాహుల్‌కు లేదని తెలుస్తోంది. ఏఐసీసీ సమావేశాలు సవిూపిస్తున్న నేపథ్యంలో పార్టీని పునరుజ్జీవింపచేసే పథకాన్ని ఆలోచించేందుకు సెలవుపై వెళ్లారనడం శుద్ద అబద్దం. దీనికి చెప్పే కారణాలు నమ్మశక్యంగానూ లేవు. ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టడానికీ, నిలదీయడానికీ ప్రతిపక్షాల వద్ద అనేక అస్త్రాలు ఉన్నాయి. ఇప్పుడు విపక్షాలు కూడా కలసి వస్తున్నాయి. దీనిని తనకు అనుకూలంగా మలచుకుని ముందుకు సాగే అవకాశాన్ని చేజేతులా వదులుకున్న రాహుల్‌కు నాయకత్వ లక్షణాలు ఉన్నాయని ఎవరైనా భావిస్తే అది భ్రమే తప్ప మరోటి కాదు. అధికాన్ని అడ్డం పెట్టుకుని మాట్లాడడం వేరు. అధికారం లేనప్పుడు మాత్రమే నాయకుడి చేవ బయటపడుతుంది. అది కూడా రాహుల్‌కు లేదని తేలిపోయింది. అందువల్ల కాంగ్రెస్ నేతలు ఓ కొత్త నాయకుడిని తయారు చేసుకుని ఇప్పటికైనా వారసత్వ రాజకీయాలకు తెరదించితే దేశానికి, కాంగ్రెస్‌కు మంచిది.