వికారుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరపాలి ఎంపీ అసదుద్దీన్‌

3

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8 (జనంసాక్షి): వికారుద్దీన్‌ గ్యాంగ్‌ ఎన్‌కౌంటర్‌పై  మజ్లిస్‌ పార్టీ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మండిపడ్డారు. ఇది పోలీసుల హత్యని, ప్రతీకార చర్యని అన్నారు. ఎన్‌కౌంటర్‌పై  సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన బుధవారమిక్కడ డిమాండ్‌ చేశారు. పోలీసులే జడ్జిల్లా వ్యవహరిస్తే ఎలా అని ప్రశ్నించారు. విచారణ ఖైదీలపై కాల్పులు ఏవిధంగా జరుపుతారని  అసదుద్దీన్‌ అన్నారు. వీరంతా తమకు ప్రాణభయం ఉందని చెప్పిన విధంగానే చంపేశారని అన్నారు. ఈ హత్యలపై అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేయాలని ఆయన కోరారు. సూర్యాపేట ఘటనకు ప్రతీకారంగా పోలీసులు చట్టపరిధిని అతిక్రమించి ఐదుగురు ముస్లిం యువకులను ఎన్‌కౌంటర్‌ పేరుతో హత్య చేశారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వమే పథకం ప్రకారం వికారుద్దీన్‌ గ్యాంగ్‌ ని హతమార్చిందని ఆయన అన్నారు. నల్గొండ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌ బూటకమని ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఆరోపించారు. ఎన్‌కౌంటర్‌పై సీబీఐ లేదా సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఎన్‌కౌంటర్లపై త్వరలోనే మత పెద్దలతో కలిసి సీఎం కలుస్తామని తెలిపారు. కసబ్‌ ఉరితీత సమయంలోనూ ఎంతోకాలం

వేచిచూసి అతడికి అవకాశం ఇచ్చి చివరకు ఉరితీసారని అన్నారు. ఇదే భారత్‌ ఔన్నత్యాన్ని నిలిపిందన్నారు. కానీ వికారుద్దీన్‌ తదితరులను నిర్దాక్షిణ్యంగా చంపడం దారుణమన్నారు.