వికారుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ బూటకం

4

-చేతికి బేడిలు వేసి సీటుకు కట్టేసిన వ్యక్తులు తూపాకులు ఎలా లాక్కుంటారు.

-అలాంటి ఫీట్‌లు రజినీకాంత్‌ సినిమాలోనే సాధ్యం

-సీబీఐ లేదా హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపండి

-సీఎం కేసీఆర్‌ను కలిసిన ముస్లిం మతపెద్దలు, ఎంపీ అసదుద్దీన్‌

హైదారబాద్‌, ఏప్రిల్‌ 9 (జనంసాక్షి):

వికారుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ బూటకం అని ఆరోపించిన హైదరాబాద్‌ ఎంపి అసదుద్దీన్‌ ఓవైసీ ఇదే విషయాన్ని సిఎం కెసిఆర్‌ను కలసి వివరించారు. కొందరు ముస్లిం మతపెద్దలను వెంట తీసుకుని ఆయన సచివాలయంలో సిఎంను కలిశారు. అనంతరం విూడియాతో మాట్లాడుతూ చేతులకు సంకెళ్లు ఉండగా ఎవరైనా తుపాకి వాడగలరా.. అలాంటి ఫీట్లు కేవలం రజనీకాంత్‌ సినిమాల్లోమాత్రమే సాధ్యమవుతాయన్నారు. వికారుద్దీన్‌ ఎన్‌కౌటర్‌ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావును కలిసి నిరసన తెలిపేందుకు ఆయన కొందరు ముస్లిం మతపెద్దలతో కలిసి గురువారం నాడు సచివాలయానికి  వచ్చారు. అక్కడ ముఖ్యమంత్రిని కలిసిన అనంతరం బయటకొచ్చి విూడియాతో మాట్లాడారు. వికారుద్దీన్‌ ఎన్కౌంటర్‌పై  సీబీఐ లేదా హైకోర్టు సిటింగ్‌ జడ్డిజతో విచారణ కోరినట్లు అసదుద్దీన్‌ తెలిపారు. జరిగిన సంఘటనపై ముఖ్యమంత్రి వద్ద నిరసన తెలిపామని, సీఎం కూడా విచారం వ్యక్తం చేశారని ఆయన అన్నారు. తనకు మూడు రోజుల సమయం ఇస్తే సంఘటన వివరాలన్నీ పూర్తిగా తెలుసుకుంటామని ఆయన హావిూ ఇచ్చినట్లు కూడా అసద్‌ వివరించారు.  వరంగల్‌ శివారులో జరిగిన ఎన్‌కౌంటర్లో వికారుద్దీన్‌ మృతిచెందిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేయాల్సిందిగా సీఎం కేసీఆర్‌ను  అసదుద్దీన్‌ ఒవైసీ కోరుతున్నట్టు తెలిసింది. వికారుద్దీన్‌ ఎన్కౌంటర్‌ విషయంలో ఒవైసీలు తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. నల్లగొండ జిల్లాలో పోలీసుల విూద జరిగిన కాల్పులకు ప్రతీకారంగానే వికారుద్దీన్‌ను  బూటకపు ఎన్‌కౌంటర్లో హతమార్చారని కూడా విమర్శించారు. ఈ నేపథ్యంలోనే ఇతర ముస్లిం మతపెద్దలతో కలిసి కేసీఆర్‌ వద్దకు వెళ్లడం, ఆయనతో భేటీ కావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.