వికారుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌పై సందీప్‌ శాండిల్య నేతృత్వంలో సిట్‌

4

సీబీఐ లేదా సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి

అసదుద్దీన్‌, ముస్లిం సంఘాల డిమాండ్‌

హైదరాబాద్‌,ఏప్రిల్‌13(జనంసాక్షి):  వికారుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటుచేసింది. ఐజీ సందీప్‌ శాండిల్య నేతృత్వంలో ఏర్పాటుచేసిన ఈ విచారణ బృందంలో ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు సభ్యులుగా ఉంటారు. వికారుద్దీన్‌ గ్యాంగ్‌ ఎన్‌కౌంటర్‌పై సిట్‌ ఏర్పాటుకు తెలంగాణ సర్కార్‌ నిర్ణయించింది. ఐజీ సందీప్‌ శాండిల్య  సిట్‌కు నేతృత్వం వహించనున్నారు. సందీప్‌ సహా ఆరుగురితో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. వికారుద్దీన్‌ గ్యాంగ్‌ ఎన్‌కౌంటర్‌పై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. దీనికి సంబంధించి  ఉదయం డీజీపీ, నగర పోలీస్‌కమిషనర్‌తో పాటు పలువురు సీనియర్‌ పోలీస్‌ అధికారులు రాజీవ్‌శర్మతో సమావేశమై చర్చించారు.  ఎన్‌కౌంటర్‌పై మానవహక్కుల సంఘాలతో పాటు ముస్లిం సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సిట్‌ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఎన్‌కౌంటర్‌పై పూర్తి వివరాలు సేకరించాల్సిందిగా ఆదేశించింది. ఇదిలావుంటే సూర్యపేట కాల్పుల ఘటనకు సంబంధించి మూడవ నిందితుడి ఆచూకీ ఇంకా దొరకలేదని ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలో పోలీస్‌ టైగర్‌ పుస్తకాన్ని నాయిని ఆవిష్కరించారు.  సందర్భంగా మాట్లాడుతూ సూర్యపేట కాల్పుల ఘటనలో తప్పించుకున్న మూడవ నిందితుడి ఆచూకీ ఇంకా దొరకలేదన్నారు. ఇదిలా ఉండగా నల్లగొండ జిల్లా ఆలేరు వద్ద జరిగిన ఉగ్రవాది వికారుద్దీన్‌ ఎన్‌ కౌంటర్‌పై విచారణ జరుగుతోందని నాయిని తెలిపారు. నల్గొండ జిల్లాలోని జానకీపురం ఎన్‌కౌంటర్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో ఉన్న ఇద్దరు ‘సిమి’ ఉగ్రవాదులు ఎండీ ఎజాజుద్దీన్‌, ఎండీ అస్లం అలియాస్‌ బిలాల్‌ మృతిచెందిన సంగతి తెలిసిందే.