విజయాలను జనంలోకి తీసుకెళ్లండి

4

– ప్రధాని మోదీ

న్యూఢిల్లీ,మే3(జనంసాక్షి): గత రెండేళ్లలో బిజెపి ప్రభుత్వం సాధించిన ప్రగతిని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని ప్రధాని మోదీ ఎంపీలకు సూచించారు. బిజెపి అధికారంలోకి వచ్చి కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి చేసుకోనుంది. దీంతో ఈ మంగళవారం జరిగిన బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోడీ మాట్లాడారు. ముద్ర పథకం, అందరికీ ఎల్పీజీలు, గ్రావిూణ ప్రాంతాలకూ విద్యుత్తు తదితరాలు ఎన్డీయే ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన విజయాలేనని మోదీ అన్నారు. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎంపీలకు తెలిపారు. ఇచ్చిన హావిూలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, వాటిని వరసగా నెరవేరుస్తోందని చెప్పారు. భాజపా అధ్యక్షుడు అమిత్‌షా, ఎల్‌కే అడ్వాణీ సహా పార్టీ సీనియర్‌ నేతలంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇదిలావుంటే భారతీయ జనసంఘ్‌ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన బలరాజ్‌ మధోక్‌ మంగళవారం మృతి చెందగా, ఆయన మృతికి భాజపా పెద్దలంతా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నివాళులు అర్పించారు. జనసంఘ్‌ సిద్ధాంతాల పట్ల ఆయనకున్న అంకిత భావాన్ని మోదీ కొనియాడారు. ఆ సిద్ధాంతాలు ఎప్పటికీ అంతే దృఢంగా ఉంటాయని చెప్పారు. అడ్వాణీ కూడా ఆయనతో తనకున్న జ్ఞాపకాల్ని నెమరువేసుకున్నారు.