విజయ్‌మాల్యాను మాకప్పగించండి

1

– యూకేకు విదేశాంగశాఖ లేఖ

న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 28(జనంసాక్షి): విజయ్‌ మాల్యాను వెనక్కి పంపించాలని బ్రిటన్‌ను భారత ప్రభుత్వం అధికారికంగా కోరింది. విదేశాంగ శాఖ కార్యదర్శి ఈ మేరకు లేఖ రాశారు.  బ్యాంకులకు చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయల రుణం చెల్లించకుండా విజయ్‌ మాల్యా లండన్‌లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఆయన బిలియన్‌ డాలర్ల రుణానికి సంబంధించి భారత్‌ విచారించాల్సి ఉందని, తప్పకుండా మాల్యాను వెనక్కి పంపాలని భారత విదేశాంగ శాఖ బ్రిటన్‌ ప్రభుత్వానికి లేఖ రాసింది.విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి వికాస్‌ స్వరూప్‌ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ.. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖతో పాటు యూకేలో ఉన్న భారత రాయబారి సైతం ఆ దేశ మంత్రిత్వశాఖతో పాటు కామన్‌వెల్త్‌ కార్యాలయంలో నోటీసులు అందించనున్నారు. విజయ్‌ మాల్యాను వెనక్కి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.  విజయ్‌ మాల్యా మార్చి 2న దేశం విడిచి లండన్‌కు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. విచారణకు హాజరవ్వాలని ఈడీ పలుమార్లు సమన్లు పంపినా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మాల్యా పాస్‌పోర్టును కూడా రద్దు చేసింది.

విజయ్‌ మాల్యా 2003లో కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ను ప్రారంభించారు. సాధారణ ధరలకే భారతీయులకు లగ్జరీ ప్రయాణం అందిస్తామంటూ ప్రారంభించిన ఈ ఎయిర్‌లైన్స్‌ 2012కల్లా దివాలా తీసి మూతపడింది. మాల్యా పలు బ్యాంకుల వద్ద తీసుకున్న వేల కోట్ల రూపాయల రుణాలు చెల్లించకుండా లండన్‌ వెళ్లారు. దీనిపై సీబీఐ విచారణ కూడా జరుగుతోంది. ఇడి కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేసింది.