విజయ్‌మాల్యా వ్యవహారంపై భగ్గుమన్న పార్లమెంట్‌

4
– మాల్యా నుంచి సొమ్ము రాబడతాం

– సీబీఐ విచారణ కొనసాగుతోంది

– అరుణ్‌ జైట్లీ

న్యూఢిల్లీ,మార్చి10(జనంసాక్షి): విజయ్‌ మాల్యా వ్యవహారం గురువారం పార్లమెంట్‌ను కుదిపేసింది.కింగ్‌ఫిషర్‌ అధినేత, వ్యాపారవేత్త విజయ్‌మాల్యాపై గురువారం రాజ్యసభలో వాడివేడి చర్చ జరిగింది. అతను దేశం విడిచి పారిపోయినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదని విపక్షాలు మండిపడ్డాయి.  ఆయన  విషయంలో బిజెపి అనుసరిస్తున్న తీరుపై కాంగ్రెస్‌ మండిపడింది. రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్‌ ఈ విషయమై మాట్లాడారు. మాల్యా దొరక్కపోవడానికి చిన్న గుండు సూది ఏవిూ కాదని కిలోవిూటరు దూరంలో ఉన్నా ఆయన కనిపిస్తాడని అన్నారు. దీనిపై ఆర్థికమంత్రి జైట్లీ స్పందిస్తూ సిబిఐ విచారణ జరుగుతోందన్నారు. మాల్యా నుంచి రుణమొత్తాలను రాబడుతామని అన్నారు. ఆయనను వదిలే ప్రసక్తి లేదన్నారు. అయితే స్వేచ్ఛగా ఆయన దేశం వదిలి వెళ్లేదాకా ఎందుకు చర్యలు చేపట్టలేదని, ఆయనను ఎందుకు అరెస్టు చెయ్యలేదని ప్రశ్నించారు. ఆయన పాస్‌పోర్ట్‌ని ముందెప్పుడో ఎందుకు సీజ్‌ చెయ్యలేదని లోక్‌సభలో మల్లిఖార్జన ఖర్గే  ప్రశ్నించారు. ఈ విషయంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ మాట్లాడుతూ.. 2004 నుంచే బ్యాంకులు ఆయనకు రుణాలివ్వడం ప్రారంభించాయని ఆ తర్వాత నుంచీ ఈ అంశాన్ని సీబీఐ పర్యవేక్షిస్తోందని చెప్పారు. లోకసభలోనూ కేంద్రంపై కాంగ్రెస్‌ తీవ్ర ఆరోపణలు చేసింది. ఆ విమర్శలను కేంద్ర మంత్రి రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ తిప్పికొట్టారు. విజయ్‌ మాల్యా మాకు సాధువు కాదు, ఆయన ప్రభుత్వానికి ఎంతో అప్పు కట్టాల్సి ఉందని రూడీ అన్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వలేదని, యూపీఏ ప్రభుత్వ హయాంలో తీసుకున్న సొమ్ముతోనే మాల్యా రుణాలను పొందినట్లు మంత్రి ఆరోపించారు. పదేళ్లు పాలనలో ఉన్న యూపీఏ ఎన్నడూ రుణాన్ని రికవరీ చేసే ప్రయత్నమే చేయలేదని కేంద్ర మంత్రి జైట్లీ ఆరోపించారు. మాల్యా నుంచి ప్రతి పైసా పొందేందుకు బ్యాంకులు ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇలాంటి వ్యవహారంలో కాంగ్రెస్‌ హయాంలోనే లలిత్‌ మోదీ దేశం వదిలి వెళ్లిపోయారని అప్పుడు ఫెమా చట్టం కింద కేసు నమోదైందని తెలిపారు. రాజ్యసభలో ఇదే అంశంపై కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్‌ మాట్లాడారు. మాల్యా దేశం విడిచి వెళ్లడంలో కేంద్ర ప్రభుత్వ కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. ఎస్‌బిఐ కన్సార్టియమ్‌ బ్యాంకుల నుంచి రుణం తీసుకుని, ఆ రుణాలను ఉద్దేశ పూర్వకంగా ఎగవేసిన మాల్యాపై ప్రస్తుతం ఆ బ్యాంకులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశాయి. అయితే కింగ్‌ఫిషర్‌ అధినేత దేశం విడిచి వెళ్లినట్లు సీబీఐ బుధవారం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. మాల్యా దేశాన్ని దాటించే విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్రకు పాల్పడిందని ఆజాద్‌ విమర్శించారు. లుకౌట్‌ నోటీసు ఇచ్చినా మాల్యా ఎలా అదృశ్యమయ్యారని ఆయన ప్రశ్నించారు. ఇదిలావుంటే ఆర్థిక వ్యవహారాల నేపథ్యంలో కోర్టు కేసుల నుంచి తప్పించుకునేందుకు దేశం విడిచిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యా లండన్‌లోనే ఉన్నట్లు విూడియా వర్గాలు పసిగట్టాయి. లండన్‌ శివారులోని ఆయనకు చెందిన 30 ఎకరాల్లో విస్తరించిన లేడీవాక్‌ అనే ఎస్టేట్‌లో ఆయన బస చేసినట్లు సెక్యూరిటీ సిబ్బంది స్థానిక విూడియాకు తెలిపారు. అసలు విషయం తెలిసిన తర్వాత మాల్యా గురించి తమకేవిూ తెలియదని బుకాయించారు. విజయ్‌ మాల్యా అక్కడే ఉన్నారని స్థానికులు కూడా చెబుతున్నారు. రాజ్యసభ సభ్యుడు కూడా అయిన విజయ్‌ మాల్యా 17 జాతీయ బ్యాంకుల నుంచి సుమారు 9 వేల కోట్ల రుణాలు తీసుకున్నారు. వాటిని చెల్లించలేక చేతులెత్తేశారు. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థను మూసేశారు. యునైటెడ్‌ స్పిరిట్స్‌ ఛైర్మన్‌ పదవి నుంచి ఇటీవలే తప్పుకున్నారు. ఫలితంగా ఆయనకు లభించనున్న సుమారు 515 కోట్లపై డీఆర్‌టీ ఆంక్షలు విధించింది. విజయ్‌ మాల్యా ఉద్దేశపూర్వకంగానే రుణాలు ఎగవేసినట్లు బ్యాంకులు ఆరోపిస్తున్నాయి. ఆయన దేశం విడిచి వెళ్లిపోకుండా నిరోధించాలని, పాస్‌పోర్టును స్వాధీనం చేసుకోవాలని కోరుతూ 17 జాతీయ బ్యాంకులు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు బుధవారం విచారణ జరిపింది. అయితే మాల్యా గత వారమే దేశం విడిచి వెళ్లినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయని అటార్నీ జనరల్‌ కోర్టుకు వివరించారు. దీంతో రెండు వారాల్లోగా కోర్టు ఎదుట హాజరు కావాలంటూ విజయ్‌ మాల్యాకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఈనేపథ్యంలో ఆయన ఎక్కడకు వెళ్లారన్నదానిపై ఉత్కంఠ నెలకొనగా.. లండన్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది.